ప్రభుత్వ ఆస్తుల రక్షణలోనూ చట్టాలు చుట్టాలుగా మారాయా..?

దిశ దశ, కరీంనగర్:

పబ్లిక్ ప్రాపర్టీని సంరక్షించాలంటూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారా..? పెద్దల చక్రబంధంలో చట్టాలు చిక్కుకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చిన ఫిర్యాదులకు కూడా విలువ లేకుండా పోయిందా..? ఇంతకీ చట్టం ఎవరికి చుట్టం అయినట్టు..?  వీటి వెనక అసలేం జరిగినట్టు..?

ఇష్టారాజ్యమా..?

సామాన్యుడు ఠాణా మెట్లెక్కడానికి వెనకా ముందు ఆలోచించుకున్న కాలంలో కనీసం ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులకు కూడా విలువ లేకుండా పోయిందా..? ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే విధంగా వ్యవహరించడం సరైందేనా..? వెలుగులోకి రాని ఘటనలు ఎన్నో ఉన్నప్పటికీ ఆధారాలతో లభ్యమైన కొన్ని విషయాలను గమనిస్తే అప్పటి పోలీసు అధికారులపై అధికార పెత్తనం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగునూరులో ఓ రియల్ ఏస్టేట్ సంస్థ వెంచర్ ప్రారంభించింది. ఈ వెంచర్ లో భాగంగా ఎస్సారెస్పీ కెనాల్ రహదారిని మెయిన్ రోడ్డుగా చూపిస్తూ సుడా అప్రూవల్ తీసుకున్నారు. అయితే వెంచర్ చదును చేస్తున్న క్రమంలో ఏకంగా ఫీల్డ్ ఛానెల్స్ ను ధ్వంసం చేశారు. దీంతో దిగువ ప్రాంత భూములకు నీరందే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విషయంపై స్థానికులు ఇరిగేషన్ అదికారులకు చెప్పడంతో కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ లిఖిత పూర్వకంగా లెటర్ నెంబర్ తో సహా 2022 మే 5న ఫిర్యాదు చేస్తే కరీంనగర్ రూరల్ పోలీసులు ఇందుకు సంబంధించిన రికార్డులు కూడా మెయింటెన్ చేయలేదని తేలింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయంపై కరీంనగర్ రూరల్ పోలీసులను అడగగా ఈ ఫిర్యాదు గురించి జనరల్ డైరీ (జీడీ)లో కూడా ఎంటర్ చేయలేదని, ఇందుకు సంబంధించిన రికార్డులే లేవని సమాధానం ఇచ్చారు. ఇకపోతే కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 సెప్టెంబర్ 30న మరో డిప్యూటీ ఈఈ జె సంతోష కుమార్ ఫిర్యాదు చేశారు. రేకుర్తి శివార్లలో ఎస్సారెస్పీ భూమి కబ్జాకు గురవుతోందని, నిర్మాణాలు చేస్తున్న వారి వివరాలను కూడా ఆ ఫిర్యాదులో పొందుపర్చారు. అయితే ఈ విషయంలో కూడా పోలీసులు అప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిశీలేన చేశారే కానీ చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ ఆస్తుల విషయంలో ఇంజీనిరింగ్ అదికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇస్తేనే పోలీసుల నుండి స్పందన కరువైందంటే ఆనాడు ఏ స్థాయిలో ఒత్తిళ్లకు గురి చేశారో అర్థం చేసుకోవచ్చు. సామాన్యుల విషయంలో విచారణల పేరిట పక్కన పెట్టామని చెప్పే అవకాశం ఉన్నప్పటికీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇచ్చిన ఫిర్యాదులో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన నష్టాల గురించి ఫిర్యాదు చేస్తే కూడా క్రిమినల్ చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది.

ఇరిగేషన్ అధికారులదో రీతి…

ఇరిగేషన్ విభాగానికి చెందిన ఆస్తులు, భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సినప్పటికీ… వారు కూడా మొక్కుబడి చర్యలకు పరిమితం అయినట్టుగా స్పష్టం అవుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కూడా చొరవ తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నగునూరు వెంచర్ విషయంలో పోలీసులు తీసుకున్న చర్యల వివరించాలని సమాచార హక్కు చట్టం ద్వారా ఇరిగేషన్ అధికారులను అడిగితే అప్పటి పోలీసు అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, వెంచర్ కు ఇచ్చిన లే ఔట్ పర్మిషన్ నిలుపుదల చేయాలని ‘సుడా’కు లేఖ రాశామని వెల్లడించారు. కెనాల్ ఛానెల్స్ ను కూడా బాగు చేశామని కూడా ఇరిగేషన్ అధికారులు వివరించారు. తమ పరిధిలోని  శాఖకు చెందిన ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. ప్రైవేటు వ్యాపార సంస్థ రియల్ ఎస్టేట్ కోసం చేసిన విధ్వంసంపై క్రిమినల్ చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నది ఇప్పటికీ అంతు చిక్కుకుండా పోయింది. వ్యవసాయ భూములకు సాగునీరందించాల్సిన చానెల్స్ ను ధ్వంసం చేస్తే ఇందుకు బాధ్యులను చేసి వారి నుండి నష్టాన్ని రికవరీ చేసేందుకు అధికారులు చొరవ తీసుకోకపోవడమూ విచిత్రంగా ఉంది. గతంలో సాగు నీరు రావడం లేదని ఎస్సారెస్పీ కెనాల్స్ ను ధ్వంసం చేసిన కేసుల్లో ఎమ్మెల్యేలపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకున్న ఇరిగేషన్ అధికారులు ఈ విషయంలో మాత్రం ఎందుకిలా వ్యవహరించారో అన్నది అంతుచిక్కకుండా పోయింది. రైతాంగం కోసం కెనాల్స్ ధ్వంసం చేసిన వారు క్రిమినల్స్ గా చూపించిన చరిత్ర ఉన్న ఇరిగేషన్ అధికారులు వ్యాపారం కోసం ఛానెల్స్ ను ధ్వంసం చేసిన వారి విషయంలో ఎందుకు మిన్నకుండి పోయారన్నదే అంతుచిక్కకుండా పోయంది. మరో వైపున కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుర్తిలో ఎస్సారెస్పీ భూ కబ్జాకు సంబంధించిన విషయంలో కూడా ఇలాగే వ్యవహరించడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగానే రిసివిడ్ కాపీ తీసుకుని హమ్మయ్య అనుకున్నట్టుగా ఉంది కానీ, దురక్రామణకు సంబంధించిన కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు చొరవ ఎందుకు చూపలేదన్నదే పజిల్ గా మారింది.

You cannot copy content of this page