ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగిస్తోంది. తాజాగా గూగుల్ లేఆఫ్‌లు కేవలం ఉద్యోగులకే కాదు.. రోబోలకు సైతం ప్రకటించింది. కేఫిటేరియాల్లో పనిచేస్తున్న రోబోలను తొలగిస్తూ గూగుల్ నిర్ణయం తీసుకుంది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ రోబోల అభివృద్ధి, శిక్షణ కోసం ఎవ్రీడే రోబోట్స్ పేరిట ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిలిపివేసింది. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా గూగుల్ కార్యాలయాల్లోని కేఫిటేరియాలో టేబుళ్లు శుభ్రం చేయడంతో పాటు పలు పనులు చేయడానికి రోబోలను వినియోగించేవారు.
ఎవ్రీడే రోబోట్స్ ప్రాజెక్టులో 200 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా చక్రాలపై నడిచే వన్ ఆర్మ్‌డ్ రోబోలను 100కు పైగా అభివృద్ధి చేస్తున్నారు. వీటని కేఫిటేరియాలో టేబుళ్లు శుభ్రం చేయడం, చెత్తను సేకరించి వేరు చేయడం, తలుపు తెరవడం వంటి పనులు చేసేందుకు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. కరోనా సమయంలో వీటితో కాన్ఫరెన్స్ రూములు కూడా శుభ్రం చేయించినట్లు ‘వైర్‌డ్’ కథనంలో వెల్లడించింది.
అయితే రోబోలతో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణకు చాలా ఖర్చు అవుతుంది. ఒక్కోదాని నిర్వహణకు లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని రోబోటిక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యయ నియంత్రణ పరిస్థితుల్లో అంత ఖర్చును భరించడానికి ఆల్ఫాబెట్ సిద్ధంగా లేదు. అందుకే ఎవ్రీడే రోబోట్స్ ప్రాజెక్ట్ లాభదాయకం కాదన్న భావనతో దాన్ని నిలిపేసింది. ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసే సిబ్బందిని ఇతర రీసెర్చ్ ప్రాజెక్ట్‌లలోకి బదిలీ చేసింది.