దిశ దశ, హైదరాబాద్:
బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నాయకులు సరికొత్త చర్చను లేవనెత్తుతున్నాయి. పార్టీ మారుతున్నాం అంటూనే ఆ పార్టీలో మాత్రం అంతా బావుంది అన్నరీతిలో వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో అసలు పార్టీ ఫిరాయించడానికి కారణమేంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నామని తమకు అవకాశం కల్పించిన అధినేతకు ధన్యవాదాలు అంటూ రాజీనామా లేఖలు రాస్తున్నారు సీనియర్ నాయకులు. అయితే తాము మాత్రం పార్టీ మారేందుకే నిశ్చయించుకున్నామని కూడా బీఆర్ఎస్ తాజా మాజీ నాయకులు చెప్తుండడం మాత్రం విచిత్రంగా మారింది.
మార్పు కోసమా..?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలోని సాధారణ ఓటర్ల నోట వెలువడిన పదం మార్పు కావాలి అని. అయితే ఎన్నికల తరువాత ఓటర్లు కూడా తమ మనోగాతాన్ని ఓటు ద్వారా చూపించారు. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగాల్సి రాగా… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికలు ముగిసి అంచనాలు తారుమారైనప్పటికీ మనో నిబ్బరాన్ని ప్రదర్శించిన ముఖ్య నేతలంతా కూడా గులాభి జెండాకు బైబై చెప్పి ఇతర పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో సింహ భాగం నేతలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అయితే వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడుతున్నారన్నదే పజిల్ గా మారిపోయింది. అధినేత కేసీఆర్ కు రాసి పంపించిన రాజీనామా పత్రంలో కానీ బయటకు వచ్చిన తరువాత కానీ తమకు అన్యాయం జరిగిందనో… లేక పార్టీలో ప్రాతినిథ్యం కల్పించలేదనో… నాయకత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తుందన్న కామెంట్స్ మాత్రం చేయడం లేదు. అవకాశం ఇఛ్చిన మీకు ధన్యవాదాలు అంటూ రాజీనామా లేఖ రాస్తున్నారు. బయటకు వచ్చిన తరువాత కూడా కాంగ్రెస్ లోనో బీజేపీలోనో చేరుతామని ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ మారిన తరువాత కొద్ది రోజులకు మాత్రం ఎమ్మెల్యే డి నాగేందర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి. బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నట్టుగా కేటీఆర్ తనతో అన్నారని అందుకే తాను పార్టీ వీడానని నాగేందర్ వివరించారు. అనంతరం జరిగిన టీవీ డిబేట్ లో కూడా కాంగ్రెస్ లో ఉన్న స్వేచ్ఛ బీఆర్ఎస్ పార్టీలో లేదని వ్యాఖ్యానించారు. పార్టీ సెక్రటరీ జనరల్ గా చేసిన కేకే కూడా కేసీఆర్ వల్లే రాష్ట్రం అభ్యున్నతి చెందిందని మీడియా ముందు వ్యాఖ్యానిస్తూనే బీఆర్ఎస్ లో డర్టీ పాలిటిక్స్ కొనసాగుతున్నాయని అందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మరో వైపున కడియం శ్రీహరి తనయ కావ్య మాత్రం తనకు ఎంపీ టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూనే ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఇతరాత్ర ఆరోఫణల కారణంగా తాను పార్టీ వీడుతున్నానని కావ్య వ్యాఖ్యానించారు.
బలమైన కారణాలేంటో..?
ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నాయకులంతా కూడా డైరక్ట్ గానో ఇండైరక్ట్ గానో కేసీఆర్ తీరును మెచ్చుకున్నట్టుగానే మాట్లాడారు తప్పా… ఫలనా బలమైన కారణంగానే తాము పార్టీని వీడుతున్నామన్న వ్యాఖ్యలు మాత్రం చేయడం లేదు. ఇటు రాజీనామా చేసి అటు పార్టీ మారుతున్నామని చెప్తున్నవారే ఎక్కువ కానీ అసలు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు ఏంటీ అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. వలస వెల్తున్న నాయకుల తీరు చూస్తుంటే అధికార మార్పిడీ కారణంగానే పార్టీ మారుతున్నట్టుగా ఉంది తప్ప గులాభి జెండా వీడడానికి అసలు సిసలు కారణాలు ఏంటన్నది అంతు చిక్కడం లేదు. ముఖ్య నాయకత్వం వ్యవహరించిన తీరుపై కూడా విమర్శలు చేసిన దాఖలాలు అంతగా కనిపించడం లేదు.