దివాకరునికి చెక్ పెట్టే వ్యూహం…

మాజీ ఎమ్మెల్యేల భారీ స్కెచ్…

దిశ దశ, మంచిర్యాల:

దివాకరుడు ప్రకాషించకుండా అరవిందుడు’ వ్యూహాత్మక ఎత్తులు వేస్తున్నారా..? ఉన్నట్టుండి తెరపైకి బీసీ నినాదం తీసుకరావడానికి కారణం అదేనా..? మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీలో సరికొత్త చర్చ లేవనెత్తిన అంశం వెనక కారణాలు ఏంటీ..? ఇప్పుడివే ప్రశ్నలు మంచిర్యాల ప్రాంత వాసులను వెంటాడుతున్నాయి. దీంతో మంచిర్యాల అభ్యర్థిపై అధిష్టానం పునరాలోచనలో పడిపోయిందేమోనన్న చర్చ కూడా సాగుతోంది.

వ్యూహాత్మక ఎత్తులు…

రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ ను మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కలిసి మంచిర్యాలలో బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చినట్టయితే గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే సోమవారం మాజీ ఎమ్మెల్యేలు గోనె ప్రకాష్ రావు, అరవింద్ రెడ్డిలు మంచిర్యాలలో మీడియా ముందు కూడా ఇదే అంశాన్ని కుండబద్దలు కొట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావుపై ఉన్న వ్యతిరేకతను చెప్పకనే చెప్పిన అరవింద్ రెడ్డి బీసీ వ్యక్తికి టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. నియోజకవర్గంలో బీసీ నేతకు అవకాశం ఇస్తే గెలిపించి తీరుతామని కూడా చెప్తున్నారు. గతంలో లక్షెట్టిపేట నియోజకవర్గం నుండి కూడా తన తండ్రి బీసీ అభ్యర్థికి అవకాశం ఇప్పించి గెలిపించిన విషయాన్ని కూడా అరవింద్ రెడ్డి గుర్తు చేశారు. మరో వైపున పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గ గోనె ప్రకాష్ రావు కూడా ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాల్సిందేనన్నారు. బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినట్టయితే తన భూమిని విక్రయించి అతని ప్రచారం కోసం ఖర్చు పెట్టాలని కూడా కోరారు. భూమికి సంబంధించిన పాస్ బుక్కుతో పాటు అగ్రిమెంట్ పేపర్ ను కూడా అరవింద్ రెడ్డికి ఇచ్చారు.

వ్యతిరేకతకు చెక్…

అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావుపై ఉన్న వ్యతిరేకతకు చెక్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఈ స్థానాన్ని గెలుచుకోవాలంటే అభ్యర్థి మార్పు మాత్రం తప్పని సరి అన్న అభిప్రాయాన్ని అధిష్టానం ముందు అరవింద్ రెడ్డి ఉంచారు. స్థానికంగా నెలకొన్న పరిణామాలను గమనించడంతో పాటు వ్యతిరేకతను అధిగమించాలంటే ప్రత్యామ్నాయ అభ్యర్థి అవసరమని చెప్తూనే అగ్రవర్ణ నాయకత్వాన్ని పక్కనపెట్టేస్తే సానుకూలత వస్తుందంటున్నారు.

అలా అయితే..?

అయితే మంచిర్యాల విషయంలో అనాడు జరిగిన పరిణామాలు నేడు సిట్టింగ్ ఎమ్మెల్యేను నష్టం చేకూర్చాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంచిర్యాలను కార్పోరేషన్ చేయాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న ప్రతిపాదనలు సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు ఉంచారన్న ప్రచారంలో ఉంది. దీంతో మంచిర్యాల, నస్పూర్, క్యాతన్ పల్లిలు వేర్వేరు మునిసిపాలిటీలుగా ఏర్పడ్డాయని, లేనట్టయితే ఈ మూడు ప్రాంతాలు కలిపి కార్పోరేషన్ గా ఏర్పాటు చేస్తే అన్ని విధాల బావుంటుందని అధిష్టానం యోచించినట్టు సమాచారం. దీంతో పాటు అరవింద్ రెడ్డికి కూడా అధిష్టానం తొలి మేయర్ గా అవకాశం ఇచ్చినట్టయితే ఆయనకు కూడా సముచిత ప్రాధాన్యత కల్పించినట్టుగా ఉంటుందని భావించినట్టుగా తెలుస్తోంది. ఇందుకు అప్పుడే సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు అనుకూలంగా వ్యవహరించినట్టయితే ఇప్పుడు అరవింద్ రెడ్డికి వల్ల దివాకర్ రావుకు బలం పెరిగేదని దీనివల్ల వ్యతిరేకతను కొంతమేర తగ్గించుకున్నట్టుగా ఉండేదని అంటున్న వారూ లేకపోలేదు. ఏది ఏమైనా సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు అభ్యర్థిత్వం మార్పు విషయంలో సరికొత్తగా తీసుకొచ్చిన ప్రతిపాదనపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నదే చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page