బ్యారేజ్ గేట్ల కింది భాగంలో బుంగ
దిశ దశ, భూపాలపల్లి:
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో బ్యారేజ్ లో అపశృతి దొర్లింది. మేడిగడ్డ బ్యారేజ్ తరహాలోనే మరో అన్నారం సరస్వతి బ్యారేజ్ గేట్ల కింది భాగంలో బుంగ పడింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యల్లో మునిగిపోయారు. జిల్లాలోని మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలోని నిర్మించిన సరస్వతి బ్యారేజ్ 38, 40 గేట్ల మధ్యన బ్యారేజ్ దిగువ భాగంలో బుంగ ఏర్పడింది. దీంతో బ్యాక్ వాటర్ నీరు మొత్తం కూడా దిగువ ప్రాంతంలోకి వెల్లిపోతోంది. రెండు రోజుల క్రితం బ్యారేజ్ దిగువ భాగంలో నీరు ఉబికి వస్తున్న విషయాన్ని గమనించిని సైట్ ఇంఛార్జీలు ఇంజనీర్లకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఈ విషయం బయటకు పొక్కుకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్త పడుతున్నారు. నిన్నటి నుండి కూలీలచే పడవల్లో ఇసుక బస్తాలను నీరు ఉబికి వస్తున్న ప్రాంతంలో వేయిస్తున్నారు. దీంతో బ్యారేజ్ గేట్లకు దిగువన పడిన ఈ ప్రాంతం ప్యాక్ అవుతుందని అంచనా వేస్తున్నారు. బోట్ల సాయంతో ఇసుక బస్తాలను తరలిస్తూ బుంగ వద్ద వేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మూడేళ్ల క్రితమే…
అయితే ఈ బ్యారేజేలీ ఇలాంటి సమస్య మూడేళ్ల క్రితమే ఎదురయినట్టుగా తెలుస్తోంది. 2020లోనే గేట్ల దిగువ ప్రాంతంలో బుంగ ఏర్పడి నీరు దిగువకు వెల్లిపోతున్న విషయాన్ని గమనించిన అధికారులు హుటాహుటిన దిద్దుబాటు చర్యలకు దిగినట్టుగా సమాచారం. అప్పటికప్పుడు బుంగను పూడ్చడంతో ఈ విషయం బయటకు పొక్కలేదని సమాచారం. తాజాగా ఏర్పడిన బుంగ గురించి వెలుగులోకి రావడంతో అధికారులు బాగు చేసే పనిలో పడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిన నేపథ్యంలో అక్కడి నీరు దిగువ ప్రాంతంలోకి వదిలేయాల్సి వచ్చింది. లేనట్టయితే బ్యారేజ్ బ్యాక్ వాటర్ ఒత్తిడి కారణంగా ప్రాణహిత, గోదావరి నదులకు సంబంధించిన నీరు అన్నారం సరస్వతి బ్యారేజీ దిగువ వరుకు నిలువ ఉండేది. దీనివల్ల ఈ విషయం సకాలంలో వెలుగులోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. కానీ ప్రాణహిత నుండి వస్తున్న నీరు ఒత్తిడికి గురయ్యే అకవాశం లేకపోవడం, మేడిగడ్డ నీరు దిగువకు వెల్లిపోతుండడంతో అన్నారం సరస్వతి బ్యారేజీలో పుట్టుకొచ్చిన ఈ సమస్య వెలుగులోకి వచ్చింది.
బేస్ ఎలా పోతోంది..?
అయితే మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎదురైన సమస్యకు అన్నారం బ్యారేజ్ లో ఎదురైన సమస్యకు కొంత తేడా ఉన్నప్పటికీ రెండు చోట్ల కూడా ఎదురయిన సమస్య మత్రం వాటర్ లెవల్స్ లోపలే కావడం గమనార్హం. మేడిగడ్డ బ్యారేజ్ లో పిల్లర్ కుంగిపోవడంతో సమస్య ఎదురుకావడానికి కారణం బేస్ లెవల్స్ లో సమస్య ఎదురుకావడమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే విధంగా అన్నారం సరస్వతి బ్యారేజీలో కూడా గేట్లకు దిగువ నుండి బుంగ ఏర్పడినట్టుగా స్పష్టం అవుతోంది. అంటే రెండు బ్యారేజీల బేస్ విషయంలో జరిగిన తప్పిదాలే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.