నోటీసులు ఇచ్చిన లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ
లబోదిబో మంటున్న రైతులు
దిశ దశ, జగిత్యాల:
రుణ మాఫీ అమలు కాకపోవడంతో రైతులకు కొత్త తరహా ఇబ్బందులు మొదలయ్యాయి. ఇంతకాలం సర్కారు చూసుకుంటుందిలే అని ధైర్యంగా ఉన్న రైతుల గుండెల్లో రైళ్లు పరిగిత్తించేలా బ్యాంకులు వ్యవహరిస్తున్నాయి. దీంతో అడ్డగోలు వడ్డీతో సహా అసలు చెల్లించాలా ఇంకా ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మరో వైపున బ్యాంకులు లీగల్ గా ప్రొసీడ్ అయితే తమ పరిస్థితి ఏంటన్న భయం కూడా వారిని వెంటాడుతోంది. దీంతో ఆర్థిక భారమైనా మంచిదే కానీ అప్పు చెల్లిద్దామన్న భావన వారిలో స్టార్టయింది రైతుల్లో.
జగిత్యాల జిల్లాలో…
జిల్లాలోని మేడిపల్లి మంలం భీమారం గ్రామానికి చెందిన ఒకరిద్దరు రైతులకు బ్యాంకులు లీగల్ సర్విసెస్ అథారిటీ ద్వారా నోటీసులు పంపించింది. రుణ మాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులను బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోవడంతో తమపై ఇప్పుడు అదనపు భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు నోటీసు అందుకున్న ఓ రైతు రూ. 80 వేల అప్పు తీసుకోగా ఇప్పుడది రూ. 1.90 లక్షలు అయిందంటూ బ్యాంకు కోర్టు ద్వారా నోటీసు పంపించిందని రైతులు తెలిపారు. దీంతో సర్కారుపై నమ్మకం ఉంచిన తాము నట్టేట మునిగినట్టయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏక కాలంలో రుణ మాఫీని అమలు చేస్తే తమకు ఈ పరిస్థితి ఎదురు అయ్యేది కాదని రైతులు అంటున్నారు. ఉన్నట్టుండి రుణం చెల్లించాలని బ్యాంకులు నోటీసులు పంపిస్తుండడంతో తమ పరిస్థితి ఏంటోనన్న ఆందోళన మిగతా రైతుల్లో నెలకొంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని కోరుతున్నారు. ప్రధానంగా ఈ వేసవి కాలంలో వడగండ్ల బీభత్సం సృష్టించింది అంతా ఇంతా కాదు. ఈ సారి చేతికొచ్చిన పంట అకాల వర్షాల పాలైందని లబోదిబోమంటున్న రైతులకు తాజాగా బ్యాంకులు పంపిస్తున్న నోటీసులు మరో గుదిబండలా మారాయి.
సగం డబ్బు డిపాజిట్…
అయితే రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీకి సంబంధించిన సగం డబ్బును సంబంధిత బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టుగా తెలుస్తోంది. కమర్షియల్, నాన్ కమర్షియల్, అగ్రికల్చర్, కో ఆఫరేటివ్ బ్యాంకులన్నింటికి కూడా రుణ మాఫీకి సంబంధించిన డబ్బులో సగం వరకు డిపాజిట్ చేసినట్టుగా సమాచారం. అయితే మిగతా సగం డబ్బు చెల్లించకపోవడతో బ్యాంకర్లు నోటీసులు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టి ఉంటారని రైతులు భావిస్తున్నారు. ఇదే సమయంలో రైతులు తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లిస్తే బ్యాంకులు ఎలాంటి ఇబ్బందులు పెట్టడం లేదని, కమర్షియల్ లోన్ల విషయంలో అయితే మాత్రం వసూలు చేసేందుకు వెనకాడడం లేదని తెలుస్తోంది. వ్యవసాయ రుణాలకు సంబంధించిన రైతులు తీసుకున్న నగదుకు ఏటా వడ్డీ చెల్లిస్తే సరిపోతుందన్న అభిప్రాయాలు ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. కానీ అనూహ్యంగా బ్యాంకుల నుండి వ్యవసాయ రుణాలకు సంబంధించిన రైతులకే నోటీసులు వచ్చాయని బాధిత రైతాంగం చెప్తోంది. దీంతో అసలేం జరుగుతోంది అన్నదే అంతు చిక్కకుండా పోయింది. ఈ విషయంలో సర్కారు చొరవ తీసుకుని రైతంగానికి న్యాయం చేయాలన్న అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి.