తెలుగు సినీ ప్రపంచం విషాదంలో కూరుకపోయింది. వైవిద్యమైన నటన.. వినూత్నమైన సినిమాలతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సూపర్ స్టార్ ఇకలేరు. ఎనిమిది పదుల వయసులో ఆ ధృవతార నింగికెగిసి టాలీవుడ్ తో పాటు దక్షిణాది సిని ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు సినిమా రంగాన్ని దిగ్గజాలు ఏలుతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో వందాలది రోజుల పాటు తన నటనతో ప్రేక్షకులను వెండితెర ముందు కట్టిపడేసిన ఘట్టమనేని కృష్ణ ఘట్టం మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు.
ఏఎన్నార్ సన్మానంతో…
డిగ్రీ చేస్తున్న సమయంలో ఏలూరులో అక్కినేని నాగేశ్వర్ రావు (ఏఎన్నార్)కు జరిగిన సన్మానంలో ఆయనకున్న జనాదరణ చూసి సిని రంగం వైపు అడుగులు వేయాలని ధృడంగా నిశ్చయించుకున్న కృష్ణ మొదట చిన్న చిన్న పాత్రలతో తెరంగ్రేట్రం చేసి సినిమా రంగంలో రారాజుగా నిలిచారు. తెలగు సినిమా రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకుని తీసిన సినిమాలు కూడా సూపర్ స్టార్ వే కావడం విశేషం. జేమ్స్ బాండ్ సినిమా గుఢాచారి 116, కౌబాయ్ మూవి మోసగాళ్లకు మోసగాడు, ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామా రాజు, 70 ఎంఎం మూవీ సింహాసనంలో నటించి తెలుగునాట తొలి ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది ఘట్టమనేనే కావడం గమనార్హం. పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు నటించి సరికొత్త రికార్డులు సృష్టించిన ఘనత కూడా ఆయనదే. 1976-1985 కాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత శిఖరాల వైపు సాగి తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన గుర్తింపును తెచ్చిపెట్టుకున్నారు.
ఏడాదికి 10 సినిమాలు…
సాంకేతికత అంతగా లేని కాలం.. సమాచార వ్యవస్థ కూడా అంతంతే ఉన్నా అయన మాత్రం ఏడాదికి సగటున పది సినిమాల్లో నటించారు. 1964 నుండి 1995 వరకు సగటున పదేళ్ళకు వంద, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేశారంటే ఆ కాలంలో ఆయన మూవీలకు ఎంతటి క్రేజీ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మూడు షిఫ్టులు చొప్పున నటించిన ఆదర్శవంతమైన కళా జీవితంతో ఆదర్శంగా నిలిచారు. మరో వైపున కృష్ణకు 2400కు పైగా అభిమాన సంఘాలు కూడా ఆ కాలంలోనే ఏర్పడ్డాయంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. సింహాసనం మూవీ వంద రోజుల వేడుకలు చెన్నైలో నిర్వహించినప్పుడు ఆంధ్ర నుండి 30కి పైగా బస్సుల్లో అభిమానులు మద్రాసుకు తరలివెల్లడం సంచలనం సృష్టించింది.
ఎంపీగా…
1942 మే 31న జన్మించిన ఘట్టమనేని సిని నిర్మాతగా కూడా వ్యవహరించడంతో పాటు ప్రజా ప్రస్థానంలో తనవంతు సేవలు అందించారు. తెరంగ్రేట్రం నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఓ సారి లోకసభకు కూడా ప్రాతినిథ్యం వహించారు. 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమానికి బహిరంగ మద్దతు ఇచ్చిన కృష్ణ, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు సినిమా ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో వెండితెరపై తేనే మనసులుతో హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. రికార్డుల రారాజు ఘట్టమనేని కృష్ణ మంగళవారం తెల్లవారు జామున (నవంబర్ 15 2022)న దివికేగి సిని ప్రపంచాన్ని, అభిమాన లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేశారు.