వైద్య ఆరోగ్య శాఖలో ‘బాణామతి’ ఫీవర్

అజ్ఞాత లేఖల కలకలం

దర్యాప్తు చేస్తున్న కరీంనగర్ టూ టౌన్ పోలీసులు

దిశ దశ, కరీంనగర్:

వైద్య ఆరోగ్య శాఖలో అజ్ఞాత వ్యక్తులు రాసిన లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. అల్లోపతి వైద్య సేవలతో రోగులకు చికిత్స అందించే ఆ శాఖలో మూఢనమ్మకాల పేరిట రాసిన లెటర్స్ సంచలనంగా మారాయి. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బాణామతి చేస్తాం…

రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అడ్మినిస్ట్రేషన్ వింగ్ లో పని చేస్తున్న ఓ ఉద్యోగి కుటుంబ సభ్యులు కరీంనగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి పోస్ట్ ద్వారా పంపించిన ఈ లేఖల్లో ఏముందంటే..? మీ భర్త, కొడుకు, కోడళ్లు అనారోగ్యం బారిన పడతారు… మరియు వారి వివాహ జీవితం, సంతానం విషయంలో ‘బాణామతి’ అనే చేతబడి యంత్రం (block magic) చేయడానికి గురువు గారితో ఒప్పందం కుదిరినది. ఈ సమాచారం మా గురువు గారికి తెలియకుండా మీ చిరునామా తీసుకుని ఇస్తున్నాను. కొంతమంది మా గురువు గారి వద్దకు వచ్చి ‘భాణామతి’ అనే అతి ఘోరమైన మంత్రం మీ భర్తకు, మీకు, మీ కొడుకులు, కొడలు ప్రాణాపాయం చేయుటకు ఒప్పందం చేసుకున్నారు. మీ భర్త చేసే తప్పుడు పనులు లంచగొండి తనం, తప్పుడు కోర్టు కేసులు పెట్టి సిబ్బందికి పదోన్నతులు రాకుండా చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడు. దీని బారి నుండి తప్పించుకోవాలంటే లంచగొండి తనం మానేయాలని, కోర్టు కేసులు విత్ డ్రా చేసుకోవాలని లేనట్టయితే జులై 17న అమవాస్యన ఈ ప్రాణహానికరమైన యంత్రం ఆరంభం అవును. వెంటనే ఈ తేదిలోపు కోర్టు కేసు విత్ డ్రా చేసుకుంటే ఈ అపాయమును అపవచ్చు. ఇలా చేసినట్టయితే మా గురువు గారికి చెప్పి అపాయము ఆపగలము. పైన ఉన్న ఉపాయమును ఒప్పుకుంటే మీ భర్త, మీ సెల్ ఫోన్ లలో నమస్కారం పెడుతున్నట్టుగా డీపీలు పెట్టండి. నేను మీకు ఈ సహాయం చేయుటకు కారణం తర్వాతి లేఖలో చెబుతాను. త్వరపడండి… సమయం దాటితే ఏమీ చేయలేం. అని రాసిన ఆ లేఖలో గాయత్రి మంత్రాన్ని కూడా రాసిన అజ్ఞాత వ్యక్తులు ఇందులో రాస్తున్నది ఫేక్ అడ్రస్ అని కూడా వివరించారు. ఇదే లేఖను ట్రూ కాపీ చేసి బాదితురాలి కోడలి పేరిట కూడా ఇదే అడ్రస్ కు పంపించడం గమనార్హం. గతంలో కూడా బాధిత కుటుంబ సభ్యులకు అజ్ఞాత వ్యక్తుల పేరిట ఫోన్ కాల్స్ బెదిరింపులు కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

కేసు నమోదు…

ఈ మేరకు బాధితురాలు కరీంనగర్ టూటౌన్ పోలీసులను ఆశ్రయించగా ఎఫ్ఐఆర్ నెంబర్ 356, ఐపీసీ 506 సెక్షన్ లో కేసు నమోదు చేశారు. ఈ నెల 15న నమోదయిన ఈ కేసుపై సీఐ రామచందర్ రావు నేతృత్వంలో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితులను విచారించడంతో పాటు లెటర్ పోస్ట్ చేసిన పోస్టాఫీస్ ద్వారా కూడా సమాచారం సేకరించే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన కరీంనగర్ టూ టౌన్ పోలీసులు నేడో రేపో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

You cannot copy content of this page