అడవులను కంటికి రెప్పలా కాపాడాల్సిన అటవీ ఉద్యోగుల ప్రాణాలకు గ్యారెంటీ లేదు. ఒంటిపై కాఖీ యూనిఫాం వేసుకుని కఠినమైన చట్టలాను అమలు చేసే ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ యంత్రాంగం సెల్ఫ్ ప్రొటెక్షన్ లేక డిఫెన్స్ లో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీకారణ్యాలకు పెట్టింది పేరయిన తెలంగాణ అడవుల్లో శత్రువుల బారి నుండి తప్పించుకుంటూ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి అటవీ యంత్రాంగానికి ఎక్కువే. వీరు నిరంతరం ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని అడవులను కాపాడుతూ కాలం వెల్లదీయాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మానవాళి మనుగడకు అత్యంత కీలకమైన అడవుల పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాద్యతతో ముడిపడి ఉన్నప్పటికీ తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించే వారే ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేయాల్నిన అటవీ యంత్రాంగం దూకుడుగా వ్యవహరించలేకపోతోంది. తమ చేతుల్లోని చట్టాలకు పని చెప్పలేని అచేతనావస్థకు చేరుకుంటోంది. నేరుగా అడవుల్లోకి వెల్లి స్మగ్లర్ల ఆగడాలను నిలువరించే సాహసం చేయలని పరిస్థితిలో అటవీ యంత్రాంగం కొట్టుమిట్టాడుతోందంటే వారిపై ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
1984 నుండి…
స్మగర్లు, నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోవడం తెలంగాణ జిల్లాల్లో 1984లో మొదలైంది. కామరెడ్డి సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అక్బర్ అలీని మార్చి 11, 1984లో రామారెడ్డి వద్ద నక్సల్స్ హతం చేశారు. అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఎడ్లబండ్లను పట్టుకున్నారని వాటిని వదిలేయాలన్న డిమండ్ విధించిన నక్సల్స్ అక్బర్ అలీని హత్య చేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న పద్మారావును 1984 అక్టోబర్ 7న కరీంనగర్ తూర్పు డివిజన్ అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు హత్య చేశారు. అటు స్మగ్లర్లు, ఇటు నక్సల్స్ చేతిలో రాష్ట్రానికి చెందిన అటవీ అధికారులు ఇప్పటి వరకు 22 మంది హత్యకు గురయ్యారు. తెలంగాణ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా పనిచేసిన పోలీసులు ఆయా విప్లవ సంస్థల నుండి మాత్రమే ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఎదుర్కోగా, అటవీ అధికారులు మాత్రం అటు నక్సల్స్, ఇటు స్మగ్లర్ల కారణంగా ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితులు నెలకొని ఉండేవి. మరో వైపున పోలీసులు, నక్సల్స్ ప్రత్యక్ష్య పోరులో కూడా అటవీ ఉద్యోగులు సమిధలుగా మారిన సందర్భాలూ లేకపోలేదు. 2001 జులై 29న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ను నక్సల్స్ పేల్చివేశారు. స్టేషన్ కు ఎదురుగా ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న వరంగల్ నార్త్ డివిజన్ కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పి రాజమౌళి ప్రాణాలు కోల్పోయారు.
లెక్కకు లేనన్ని దాడులు…
అటు అన్నల భయం… ఇటు స్మగ్లర్ల దాడుల నడుమ నాలుగు దశాబ్దాలుగా అటవీ అధికారులు ప్రాణాలు గుప్నిట పెట్టుకుని విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దశాబ్దానికి పైగా నక్పల్స్ ఉనికి గణనీయంగా తగ్గిపోవడంతో పోలీసులు స్వేచ్ఛగా తిరుగుతున్న పరిస్థితి నెలకొన్నప్పటికీ అటవీ అధికారులు మాత్రం భయంభయంగానే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. అటవీ ప్రాంతాల్లో నేటికీ కూడా ఫారెస్ట్ యంత్రాంగంపై దాడులు తగ్గడం లేదు. 1984 నుండి 2001 వరకు అటవీ అధికారులు అడవుల పరిరక్షణ విషయంలో ప్రాణాలు అర్పించకపోయినప్పటికీ స్మగర్లు, నక్సల్స్ చేతిలో దాడులకు గురైన సందర్భాలు లెక్కకు లేవనే చెప్పాలి. నక్సల్స్, స్మగ్లర్ల దాడులు, అడవులను కాపాడే ప్రయత్నంలో మరణించిన సంఘటనలే కాకుండా దాడులకు గురైన సందర్శాలు కోకొల్లలు. స్మగ్లర్ల గొడ్డళ్ల దాడుల్లో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న అటవీ అధికారులు చాలా మందే ఉన్నారు. రేంజ్ అధికారి స్థాయి నుండి కింది స్థాయి వరకు పనిచేసిన అటవీ ఉద్యోగులు స్మగర్ల దాడులే కాకుండా నక్సల్స్ చేతిలో చావు దెబ్బలు తిన్న సందర్బాలూ లేకపోలేదు. స్మగ్లర్ల దాడులు విపరీతంగా పెరిగిపోయిన క్రమంలో నక్సల్స్ ఏరివేతలో నిమగ్నం అయిన పోలీసు అధికారుల నుండి రక్షణ తీసుకోలేని పరిస్థితిలు ఏర్పడిన తరువాతే అడవుల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. అటు అన్నలు… ఇటు స్మగర్లు ఇద్దరూ కూడా దాడులకు పూనుకుంటున్న నేపథ్యంలో ప్రాణాలకు గ్యారెంటీ లేని భయానక వాతావరణంలో క్షేత్ర స్థాయి అటవీ యంత్రాంగం పని చేయడానికి ముందుకెల్లే సాహసం చేయలేకపోయిందన్నది వాస్తవం. ఈ కారణంగానే తెలంగాణాలో అడవుల నరికివేత యథేచ్ఛగా సాగడానికి కారణమైంది.
ఇప్పుడు పోడు వంతు…
పోడు వ్యవసాయం పేరిట అడవులను నరికి భూములు లేని గిరిజనలు సాగు చేసుకునే విధానం ఉండేది. ఈ పోడు వ్యవసాయం ద్వారా సాగవుతున్న భూములకు పట్టాలు ఇచ్చే సంస్కృతిని కొనసాగిస్తామని ప్రభుత్వం ఓ వైపున చెప్తూనే మరో వైపున హరిత హారం పేరిట మొక్కలు నాటే విధానానికి శ్రీకారం చుట్టింది. కోట్లాది మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఫారెస్ట్ అధికారులు అడవుల్లోకి వెల్లినప్పుడల్లా ప్రచ్ఛన్న యుద్దమే సాగుతోంది. ఈ పరిస్థితి దాదాపు అన్ని జిల్లాల్లోనూ నెలకొనడంతో అటవీ అధికారులపై దాడులూ జరిగిన సంఘటనలూ లేకపోలేదు. దీంతో ఫారెస్ట్ ఏరియా పరిరక్షణ అటవీ యంత్రాంగానికి ఓ పెద్ద సవాల్ గా మారిందని చెప్పకతప్పదు. కొన్ని జిల్లాల్లో అయితే అటవీ అధికారులపై ముప్పేట దాడులు జరిపిన సందర్బాలు కూడా లేకపోలేదు. కాగజ్ నగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చాలా వరకూ జరిగాయి. ఓ వైపున పోడు కోసం అడువుల్లో సాగు చేస్తున్న వారే కాకుండా మరో వైపున గొత్తి కోయల నుండి కూడా ఎదురు దాడులు ఎదుర్కొవలసి వస్తోంది. దాదాపు 15 ఏళ్ల క్రితం చత్తీస్ గడ్ దండకారణ్యం నుండి వలస వచ్చిన గొత్తికోయలు అడవుల్లో మకాం వేసుకుని జీవనం సాగించడం ఆరంభించారు. ఇప్పుడు వారిని ఖాలీ చేయించడం అటవీ అధికారులకు సవాల్ గా మారిపోయింది. గోదావరి పరివాహక ప్రాంతాలైన భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సరిహద్దు అడవుల్లోకి వలస వచ్చి షెల్టర్ తీసుకుని జీవనం సాగిస్తున్నారు. పరివాహక ప్రాంత జిల్లాల్లో సుమారు లక్ష వరకూ గొత్తికోయ కుటుంబాలు ఉంటాయని ఓ అంచనా. ఇప్పుడు వీరు కూడా అటవీ అధికారుల ప్రాణాలను తీసే స్థాయికి చేరుకోవడం ఆందోళన కల్గిస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకంగా రేంజ్ అధికారిని హత్య చేశారంటే గొత్తికోయల తిరుగుబాటు ఏ స్థాయికి చేరింతో అర్థం చేసుకోవచ్చు.
విధులు నిర్వర్తించడం సాధ్యమేనా..?
నాలుగు దశాబ్దాల కాలంగా తెలంగాణలోని అటవీ అధికారులు పలు విధాలుగా ఎదురుదెబ్బలు తింటున్నట్టుగా ఇప్పటి వరకూ జరిగిన సంఘటనలు ప్రధాన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విధులు నిర్వర్తించడం అటవీ అధికారులు సాహసం చేస్తున్నట్టుగానే మారిపోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురీదుకుంటూ డ్యూటీలు చేయడమంటే అటవీ అధికారుల్లో నైరాశ్యం నెలకొంటున్నది. ఇలాంటి పరిస్థితులకు పుల్ స్టాప్ పెట్టాలంటే ప్రభుత్వాలు కూడా అటవీ చట్టాలకు పకడ్భందీగా అమలు చేసే స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా వారి స్వీయ రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.