వీణవంక ఎక్స్ ప్రెస్ కు స్పీడ్ బ్రేకర్లు వేసినట్టేనా..?

దిశ దశ, కరీంనగర్:

వీణవంక ఎక్స్ ప్రెస్ గా ప్రసిద్ది గాంచిన ఆ ఫాస్ట్ బౌలర్ పాలిటిక్స్ లోనూ అదే స్పీడ్ గా వ్యవహరించడమే ఆయనను పుట్టి ముంచుతోందా..? బౌలింగ్ లో బౌన్సర్లు వేసి బ్యాట్స్ మెన్ ను ముప్పు తిప్పలు పెట్టిన ఆయన పాలిటిక్స్ లో వేస్తున్న బౌన్సర్లపై ప్రత్యర్ధులు హెలిక్యాప్టర్ షాట్స్ కొట్టి సిక్సర్లుగా మల్చుకుంటున్నారా..? హైదరాబాద్ తరుపున రంజీ క్రికెట్ ఆడి సక్సెస్ అయిన ఈ ఫాస్ట్ బౌలర్ హుజురాబాద్ పాలిటిక్స్ లో మాత్రం ఫెయిలవుతున్నారా..? ఇప్పుడిదే టాపిక్ సాగుతోంది బీఆర్ఎస్ వర్గాల్లో…

పాడి కౌశిక్ రెడ్డి ప్రస్థానం…

ఐపీఎల్ కు పోటిగా ఏర్పడిన ఐసీఎల్ కు ఎంపికయినప్పటికీ బీసీసీఐ ఇండియన్ క్రికెట్ లీగ్ పై అభ్యంతరాలు చెప్పడంతో అర్థాంతరంగా బ్రేకులు పడ్డాయి. ఐసీఎల్ క్రికెట్ కు ఫాస్ట్ బౌలర్ గా ఎంపికయిన పాడి కౌశిక్ రెడ్డికి వీణవంక ఎక్స్ ప్రెస్ అని పేరు కూడా ఉంది. రంజీ క్రికెట్ మ్యాచ్ లో 5 వికెట్లు తీసిన హిస్టరీ క్రియేట్ చేసిన ఆయన పాలిటిక్స్ లో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తుండడమే ఆయనకు మైనస్ గా మారిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తనకు గాడ్ ఫాదర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌశిక్ రెడ్డిని తెలంగాణ రాజకీయాల్లో క్రీయాశీలక భూమిక పోషించాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒకప్పుడు ఏఐసీసీ ముఖ్యనేత రాహుల్ గాంధీ రథ సారథ్యం వహించిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తారని భావించారంతా. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన ఈటల రాజేందర్ పై పంచ్ లు వేసిన తీరు హాట్ టాపికగా మారింది. ఆ తరువాత రాజకీయ సమీకరణాల మార్పుతో ఈటల బీఆర్ఎస్ పార్టీని వీడడం, కౌశిక్ రెడ్డి గులాభి జెండా కప్పుకోవడం ఉప ఎన్నికలు ముగియడం జరిగిపోయాయి. ఆ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుబట్టి మరీ కౌశిక్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యం కల్పించారనే చెప్పాలి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలన్న ప్రతిపాదనలను గవర్నర్ పెండింగ్ లో పెట్టడంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి మండలి విప్ హోదా కూడా కల్పించారు సీఎం. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో పాటు ముఖ్య నేతలంతా కూడా కౌశిక్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యత కల్పించారనే చెప్పాలి.

దూకుడుతో బ్రేకులు…

కౌశిక్ రెడ్డిని హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జిగా కూడా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. జమ్మికుంట సభలో ప్రకటించిన మంత్రి ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను కాదని పాడికి అవకాశం కల్పించారు. దీంతో హుజురాబాద్ లో పార్టీ రూపు రేఖలు మారిపోతాయని, ప్రత్యర్ధులు తమను అందుకునే అవకాశం కూడా ఉండదని బీఆర్ఎస్ అధిష్టానం వేసుకున్న అంచనాలు తలకిందులు అయ్యాయి. లీడర్ నుండి క్యాడర్ వరకు, అన్ని శాఖల అధికార యంత్రంగంతోనూ ఆయన వ్యవహరించిన తీరే ఇంత దూరం తెచ్చిందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఆయన ప్రత్యర్థులు కూడా ఇదే అదనుగా అధిష్టానం పెద్దల ముందు మొరపెట్టుకోవడంతో ముఖ్య నాయకత్వం హుజురాబాద్ తీరుపై దృష్టిసారించింది. మొదట జడ్పీ ఛైర్ పర్సన్ కనుమల్ల విజయతో పాటు పలువురు హుజురాబాద్ లీడర్లు మంత్రి గంగులకు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు విన్నవించినప్పటికీ సీరియస్ గా తీసుకోలేదు. ఆ తరువాత హుజురాబాద్ లో ఏర్పడిన వాతావరణం అధిష్టానన్ని తట్టిలేపడంతో పాటు నిఘా వర్గాల నివేదికలు, పార్టీ తీసిన ఆరాలో కౌశిక్ రెడ్డి వ్యవహారం పుట్టి ముంచుతోందని తేలిందని సమాచారం. ఇదే సమయంలో ముదిరాజ్ లపై ఆయన చేసిన వ్యాఖ్యల దుమారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దారి తీసింది. ఈ విషయంలో ఆయన తాను అలా అనలేదని వివరణ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మంత్రి కేటీఆర్ కూడా కౌశిక్ రెడ్డితో మాట్లాడి డిసిప్లేన్ గా ఉండాలని స్పష్టం చేశారు. అయినప్పటికీ చిలికి చిలికి గాలి వానలా మారడంతో సీఎం కేసీఆర్ కూడా అసహనం వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయనను ఇంఛార్జిగా తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకున్నప్పటికీ దిద్దుబాటు చర్యలు చేపట్టి, కౌశిక్ ను మార్చేందుకు చర్యలు తీసుకుంటారాన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

You cannot copy content of this page