లిక్కర్ స్కామ్​: డిప్యూటీ సీఎంకు సీబీఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ కేసులో తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం ఆదివారం ఉదయం సీబీఐ కేంద్ర కార్యాలయానికి రావాలని అందులో పేర్కొంది. అయితే ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సిసోడియా పేరు లేదు. ఈ కేసులో దొరికిన తాజా ఆధారాలపై ప్రశ్నించేందుకు ఆయనకు సమన్లు జారీ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

సీబీఐ జారీ చేసిన సమన్లపై మనీశ్ సిసోడియా స్పందించారు. కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు విచారణకు రావాలని సీబీఐ తనను మరోసారి పిలిచిందని వివరించారు. తనకు వ్యతిరేకంగా సీబీఐ, ఈడీలు పూర్తి స్థాయి అధికారాలను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. సీబీఐ, ఈడీ అధికారులు గతంలో తన ఇంట్లో పలుమార్లు సోదాలు చేశారని చెప్పారు. తన బ్యాంకు లాకర్‌ను సైతం తనిఖీ చేశారని.. అందులో వారికి ఏం దొరకలేదని తెలిపారు. ఢిల్లీలోని పిల్లలకు ఉత్తమ విద్యను అందించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. తాను విచారణకు ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటానని సిసోడియా వెల్లడించారు.

ఈ కేసులో మనీశ్ సిసోడియాను సీబీఐ గతంలోనూ విచారించింది. గతేడాది అక్టోబరులో తొమ్మిది గంటల పాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సిసోడియా సన్నిహితుడైన విజయ్‌ నాయర్‌ను అరెస్టు చేసింది. ఆయనతో పాటు అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌ బాబు, సమీర్‌ మహేంద్రు సహా ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. మరోవైపు ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది.

You cannot copy content of this page