ఏపీని తాకిన అరెస్టుల పర్వం

లిక్కర్ స్కాం వ్యవహారం

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంతో తెలుగు రాష్ట్రాలకు సంబందించిన ప్రముఖులు ఉండడంతో ఈడీ ఎప్పుడు ఎలాంటి చర్యలకు పూనుకుంటుందోనన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తెలంగాణాకు సంబందించిన పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ ఇప్పుడు ఏపీ ఎంపీ తనయుడిని అరెస్ట్ చేయడం గమనార్హం. దీంతో తెలంగాణలో ప్రముఖులను అరెస్ట్ చేసే సంకేతాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఇచ్చిందా అన్న చర్చ కూడా సాగుతోంది.

మాగుంట రాఘవ అరెస్ట్…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవను ఈడీ అరెస్టు చేసింది. బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్న రాఘవను ఢిల్లీలోని ఈడీ మెయిన్ ఆఫీసులో కొన్నిగంటలు ప్రశ్నించిన ఈడీ అధికారులు అరెస్టు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ ఇద్దరిని అరెస్టు చేయగా… సీబీఐ ఒకరిని అరెస్టు చేయడం గమనార్హం. సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వద్ద గతంలో పని చేసిన చార్టెడ్ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని, హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్న సమాచారం ఇచ్చారు. మద్యం పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారన్న అభియోగంపై గౌతమ్‌ మల్హోత్రాను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. మద్యం వ్యాపారులతో గౌతమ్ మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈడీ అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో రాజేశ్‌ జోషిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు, ఈ వ్యవహారంలో నగదును ఒక చోట నుండి మరోచోటకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్‌ కు సంబందించిన అనుబంధ ఛార్జిషీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పంజాబ్, గోవా ఎన్నికల ప్రచారం నిధుల కోసమే ఆప్ నేతలు మద్యం కుంభకోణానికి తెరలేపినట్లు ఈడీ ఛార్జిషీట్ లో పేర్కొంది. కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఆప్‌ మీడియా వ్యవహారాల ఇంచార్జి విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడని వెల్లడించిన ఈడీ విజయ్ నాయర్ ఆదేశాల మేరకు ఇండోస్పిరిట్‌లో 65 శాతం కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డిలకు ఇచ్చినట్టు కూడా ఆరోపించింది. కవిత రూ. 3 కోట్ల 40 లక్షలు, మాగుంట 5కోట్లు ఇండో స్పిరిట్‌లో పెట్టుబడి పెట్టినట్లు ఈడీ పేర్కొంది. కవిత తరపున అరుణ్‌పిళ్లై మాగుంట తరపున ప్రేం రాహుల్ ఇండోస్పిరిట్‌లో ప్రతినిధులుగా ఉన్నట్లు ఈడీ అందులో వివరించింది. సమీర్ మహుంద్రుతో వీడియోకాల్ మాట్లాడటంతో పాటు హైదరాబాద్‌లో కలిశారని, కవిత ఆదేశాల మేరకు కోటి రూపాయలను అరుణ్ పిళ్లైకి ఇచ్చినట్లు ఆమె అనుచరుడు శ్రీనివాసరావు వాంగ్మూలమిచ్చారని ఛార్జిషీట్ లో కోర్టుకు సమర్పించింది. మద్యం వ్యాపారంపై కవిత ఆప్ లీడర్లతో చర్చించారని, సౌత్‌ గ్రూపు ద్వారా వంద కోట్లు ఇచ్చేందుకు డీల్ కుదిరిందని అరుణ్ పిళ్లై విచారణలో వెల్లడించినట్టు పేర్కొంది. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన చర్చల్లో కవిత పాల్గొన్నారని, ఇండోస్పిరిట్​కు వచ్చిన లాభాల్లో కోటి 70 లక్షలు మాగుంట గౌతమ్ తీసుకున్నారని వివరించింది. శరత్ చంద్రారెడ్డి వేర్వేరు పేర్లపై ఆరు రిటైల్ జోన్లను దక్కించుకున్నారని, కవిత సహా 36 మంది మొబైళ్లు, డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది.

You cannot copy content of this page