దిశ దశ, వరంగల్:
ప్రకృతి ప్రకోపంతో స్తంభించిపోయిన జనజీవనాన్ని అక్కున చేర్చుకుంటున్నారు ఆయా ప్రాంతాల వాసులు. సుదూర ప్రాంతాలకు చెందిన వారు గమ్యస్థానాలకు చేరేందుకు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. శనివారం అర్థరాత్రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా రైళ్లను నడపడం బావ్యం కాదని అధికారులు భావించారు. దీంతో సమీప స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. శనివారం అర్థరాత్రి నుండి ఆయా స్టేషన్లలోని ఆగిపోయిన రైళ్లలో ప్రయాణిస్తున్న వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అన్న పానియాలు దొరకక అవస్థలు పడుతున్న వారికి బాసటనిస్తున్నారు స్థానికులు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని నెక్కొండ, మహబూబాబాద్, కేసముద్రం తదితర స్టేషన్లలో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆయా ట్రైన్లలో ప్రయాణం చేస్తున్న వారికి సేవ చేసేందుకు స్థానికులు ముందుకు వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో భోజన సదూపాయలు కల్పిస్తే, మరికొన్ని ప్రాంతాల్లో టిఫిన్, స్నాక్స్, వాటర్ అందించి వారికి చేదోడుగా నిలుస్తున్నారు. శనివారం అర్థరాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు పదుల సంఖ్యలో రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. ఆయా ప్రాంతాల్లోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానికులు వారికి సేవ చేసే పనిలో నిమగ్నం అయ్యారు.
మహబూబాబాబాద్ లో…
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిలిచిపోయిన రైళ్లలోని ప్రయాణీకులకు టీ, స్నాక్స్, వాటర్ అందించారు స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు. స్టేషన్ లో ఉన్న కొంతమంది మహిళలు విషాదంతో ఉన్న విషయాన్ని గమనించిన పట్టణ వాసులు వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కు చెందిన 11 మంది మహిళలు రాజేష్ అనే వ్యక్తికి ఆతిథ్యం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు మహబూబాబాద్ లోని నేతాజీ స్కూల్ కాలనీ వాసి. వారితో పాటు మరో 10 మంది మహిళలను కూడా తమ ఇంటికి తీసుకెళ్లి వారికి ఆతిథ్యం ఇస్తున్నారు. జోరుగా కురుస్తున్న వర్షానికి తోడు రాకపోకలు సాగించే పరిస్థితి లేదని గమనించిన మహబూబాబాద్ వాసులు వారికి ఆశ్రయం కల్పించారు. జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ కు చెందిన మహిళలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో మహబూబాబాద్ లో ఆగిపోవల్సి వచ్చింది.