దిశ దశ, ఒడిషా:
ఒడిషాలో జరిగిన రైల్ ప్రమాదంలో క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగిస్తున్నారు. 300 మంది వరకూ మృత్యువాత పడిన ఈ ఘటనలో గాయాల పాలైన వారి ప్రాణాలకు భరోసా కల్పించేందుకు ముందుకు వస్తోంది అక్కడి యువత. శుక్రవారం రాత్రి ఒడిషాలోని బాలేశ్వర్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో తమ వంతు బాధ్యతలను నెరవేర్చేందుకు యువకులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కిక్కిరిసిపోయిన జనం అంతా రైలు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ వారు కాదు… వారికి రక్త దానం చేసేందుకు క్యూ కట్టిన యవతరం. నాలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ఈ ఘటనలో చిక్కుకోగా 300 మంది వరకు మృత్యువు ఒడిలోకి చేరిపోయారు. మరో వెయ్యి మంది వరకు క్షతగాత్రులుగా మిగిలిపోగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక యువత వందల సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని రక్తం అవసరం ఉన్న వారికి తాము రక్త దానం చేస్తామని ముందుకు వచ్చారు. వందలాది మంది యువత నేరుగా ఆసుపత్రికి వచ్చి రక్తాన్ని అందించేందుకు రావడం ఆదర్శప్రాయమనే చెప్పాలి. ఒడిషా రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేస్తున్న సమయంలో స్థానిక యువత చూపుతున్న ఔదార్యన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post