ఇసుక క్వారీల్లో నిరసన

లోడింగ్ చేయవద్దని డిమాండ్

సుప్రీం ఆదేశాలు అమలు చేయాలంటున్న స్థానికులు

దిశ దశ, హుజురాబాద్:

డిసిల్ట్రేషన్ పేరిట మానేరు నదిలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలకు బ్రేకులు వేయాల్సిందేనని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. సుప్రీం కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కమర్షియల్ అవసరాలకు ఇసుక ఎలా అమ్ముతారంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు ఇసుక రీచు స్టాక్ యార్డు వద్దకు చేరుకున్న స్థానికులు ఆందోళన చేపట్టారు. సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇసుక తరలించవద్దని చెప్తున్నా వినిపించుకోకుండా ఎలా అమ్మకాలు చేస్తారంటూ గ్రామస్థులు రీచు నిర్వహాకులను నిలదీశారు. తమ గ్రామం నుండి ఇసుక ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించవద్దని, లారీలను ఇక్కడి నుండి కదలనివ్వమంటూ స్థానికులు రీచు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రీచుల్లో పనిచేస్తున్న వారికి గ్రామస్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇసుక రవాణానున అడ్డుకునేందుకు మీకు అర్హత లేదని, సుప్రీం కోర్టు ఆదేశాలు అయినా సరే తమకు మైనింగ్ అధికారులు చెప్పాలని, అప్పటి వరకు తాము ఇసుక తరలిస్తామని తేల్చి చెప్తున్నారు. దీంతో గ్రామస్థులు సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నందును ఇసుకను ఇక్కడి నుండి తరలించకుండా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.

వ్యూహం అదా..?

మరో వైపున టీఎస్ఎండీసీ అధికారులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇసుక వ్యాపారం చేసే విషయంలో తప్పించుకునేందుకు ఇప్పటికే ఓ ఎత్తుగడతో ముందుకు సాగుతున్నట్టుగా సమాచారం. మొదట ఎన్జీటీ పెద్దపల్లి జిల్లా మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిలో రీచులను మూసి వేయాలని స్పష్టం చేసిన నేపథ్యంలో కొంతకాలం యథావిధిగా లారీలను నడిపించారని, ఆ తరువాత ఎన్జీటీ బెంచ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో రీచులను పొరుగు జిల్లా పరిధిలోకి తరలించి అక్కడి నుండి ఇసుక విక్రయాల పరంపరను కొనసాగించారు. అయితే ఇదే విధంగా ఆలోచిస్తున్న అధికారులు సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇంకా తమకు అధికారికంగా అందలేదన్న సాకు చూపిస్తూ క్రయవిక్రయాలు కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా మానేరు నదిలో మైనింగ్ కార్యకలాపాలపై మాత్రం కఠినంగా వ్యవహరించాలని పరివాహక ప్రాంత గ్రామాలకు చెందిన వారు, మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు భావిస్తున్నారు. దీంతో ఇసుక క్రయ విక్రయాలపై ధిక్కరణ పిటిషన్ కూడా వేసేందుకు సమాయాత్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page