మా సమస్య పరిష్కరించండి
జర్నలిస్టులు అభ్యర్థన
దిశ దశ, కాళేశ్వరం:
రెవెన్యూ అధికారులు తమకు నివేశన స్థలాలు ఇస్తే అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు చెప్తున్నారని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన భూములకు హధ్దులు చూపించాలని అటు రెవెన్యూ అధికారుల చుట్టు, తమ సమస్య పరిష్కరించాలని ఇటు ఫారెస్ట్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు కూడా వినతి పత్రం ఇచ్చారు. మహదేవపూర్ మండలంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో 12 మంది వర్కింగ్ జర్నలిస్టులకు అక్టోబర్ 6 2023న తహసీల్దార్ నివేశన స్థలాలు ఇస్తూ పట్టాలు ఇచ్చారని, ఒక్కో జర్నలిస్టుకు 121 గజాల చొప్పున మొత్తం 12 మందికి కెటాయించారని వివరించారు. అయితే ఇట్టి భూమి అటవీ శాఖ పరిధిలో ఉందని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరపకూడదని అటవీ అధికారులు అభ్యంతరం చెప్తున్నారన్నారు. దీంతో తమకు పట్టాలు ఇచ్చి లాభం లేకుండా పోయిందని ఈ విషయంపై పలుమార్లు మహదేవపూర్ తహసీల్దార్ కు కూడా విన్నవించామని జర్నలిస్టులు తెలిపారు. అంతేకాకుండా భూపాలపల్లిలోని సీసీఎఫ్ ను కలిసి కూడా తమ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కూడా వినతి చేసినా ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, అటవీ శాఖలకు చెందిన అధికారులు జాయింట్ సర్వే చేసినట్టయితే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కాళేశ్వరం ప్రెస్ క్లబ్ సభ్యులు అంటున్నారు. తమకు కెటాయించిన నివేశన స్థలాల్లోకి వెళ్లే పరిస్థితి లేనందున సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని వారు జిల్లా కలెక్టర్ ను కోరారు.