వేములవాడ దర్గాకు తాళం

దిశ దశ, వేములవాడ:

దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో ఉన్న దర్గాకు తాళం పడింది. ఇరు వర్గాల మధ్య నెలకొన్న విబేధాల కారణంగా కోర్టులో కేసు విచారణలో ఉన్న దృష్ట్య దర్గా వద్ద ప్రార్థనలు చేయకూడదంటూ పోలీసులు తేల్చి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దర్గా ఉన్న సంగతి తెలిసిందే. రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు దర్గా వద్ద కూడా ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో దర్గాలో ప్రార్థనలు చేసే అధికారం తమకే ఉందంటూ రెండు వర్గాల వారు కోర్టును ఆశ్రయించారు. అయితే గురువారం దర్గాలో తామే ప్రార్థనలు చేస్తామంటూ ఇరు వర్గాలు వాగ్వాదం చేసుకోవడంతో పాటు తోపులాట కూడా చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న వేములవాడ టౌన్ సీఐ కర్ణాకర్ నేతృత్వంలో పోలీసులు రాజన్న ఆలయ ప్రాంగణంలోని దర్గా వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాల నుండి వివరాలు సేకరించిన పోలీసులు ఈ కేసు కోర్టులో విచారణలో ఉన్న దృష్ట్యా దర్గా వద్దకు ఎవరూ రాకూడదని తేల్చి చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రాజన్న ఆలయానికి భక్తులు వస్తుండడంతో శ్రావణ మాసం కూడా కావడంతో ఇలాంటి గొడవలు చోటు చేసుకుంటే మంచిది కాదన్న అభిప్రాయాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కూడా కోర్టు కేసులో విచారణ ముగిసే వరకు దర్గా సమీపంలోకి కూడా ఎవరూ రాకూడదంటూ పోలీసులు స్పష్టం చేశారు. అప్పటి వరకు దర్గాకు తాళం వేస్తామని స్పష్టం చేశారు.

You cannot copy content of this page