జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ పై సంచలన నిర్ణయాలు
దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ విషయంలో పోలీసు అధికారులు చకాచకా చర్యలకు పూనుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది. గంటల వ్యవధిలోనే అనిల్ పై తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. ముచ్చటగా మూడో రోజు ఆయన అఫిషియల్ క్వార్టర్ లో ఉండకూడదంటూ స్పస్టం చేసి పోలీసు అధికారులు ప్రత్యేకంగా లాక్ కూడా వేసినట్టుగా తెలుస్తోంది. దీంతో అనిల్ జగిత్యాలను వదిలి వెల్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అసలేం జరిగింది..?
నాలుగు రోజుల క్రితం కరీంనగర్ నుండి జగిత్యాలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సులో సీటు గురించి జరిగిన చిన్న రభస కాస్తా ఎస్సై అనిల్ పై శాఖాపరంగా చర్యలు తీసుకునే స్థితికి చేరింది. మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు జగిత్యాల పట్టణంలో ముస్లిం మైనార్టీలు ఆందోళన చేయడంతో పాటు వీడియోలను ట్విట్టర్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు ట్యాగ్ చేయడంతో అతన్ని ఎస్సీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరునాడు ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ జగిత్యాలకు వచ్చి బాధితురాలిని పరమార్శించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మల్టీజోన్ ఐజీ. అయితే తన భర్తను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఎస్సై భార్య గురువారం మీడియాకు వివరించారు. అలాగే ఎస్సై తల్లి కూడా తన కొడుకును సస్పెండ్ చేయడం సరికాదంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పటి వరకు బాధితురాలికి మాత్రమే కనిపించిన అనుకూలమైన వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా ఎస్సై అనిల్ ను సస్సెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే యాదవ సంఘాలతో పాటు హిందూ ఆర్గనైజేషన్స్ కూడా గురువారం నుండి పోలీసు అధికారుల తీరును తప్పు పడుతూ ట్రోల్స్ చేయడం ఆరంభించాయి. ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ కూడా శనివారం జగిత్యాల బంద్ కు పిలుపునిచ్చింది. ఈక్రమంలో పోలీసు అధికారులు అనిల్ ను క్వార్టర్ లో ఉండొద్దంటూ హుకూం జారీ చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆయన ఉంటున్న క్వార్టర్ కు లాక్ చేయించడంతో అనిల్ తన ఫ్యామిలీతో కలిసి జగిత్యాల పట్టణం వదిలి వెల్లిపోయారని సమాచారం. ఆర్థికంగా ఉన్నట్టయితే ఎస్సై అనిల్ తన భార్యను ఆర్టీసీ బస్సులో ఎందుకు ట్రావెల్ చేయిస్తారని, కారులో తీసుకెళ్లేవారు కదా అని అంటున్న వారూ లేకపోలేదు.
ఆ సీటేమయింది..?
ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆర్టీసీ ఇటీవల గర్భిణీలకు, పసిబిడ్దల తల్లులకు కూడా సీటు కెటాయించే విధానం అమలు చేస్తోంది. ఇలాంటి వారికి సీటు ఇచ్చినట్టయితే వారు ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేస్తారన్న యోచనతో ఈ పద్దతిని పాటిస్తున్నారు. అయితే ఎస్సై అనిల్ భార్య తన 14 నెలల కొడుకుతో సహా బస్సులోకి ఎక్కినప్పుడు వారికి ప్రత్యేకంగా అలాట్ చేసి ఉన్న సీటు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. అలాగే పసి బిడ్డను ఎత్తుకుని వచ్చిన ఎస్సై భార్య విషయంలో వేరే వాళ్లు చూసి సీటివ్వాల్సిందిపోయి సీటు అడగడం పాపం అయిందా అని అంటున్నారు పలువురు. బస్సులో ప్రయానిస్తున్న మిగతా వారు మానవత్వంతో వ్యవహరించకపోవడంపై కూడా విస్మయం వ్యక్తమవుతోంది.