బెంగుళూరులో ఘటన…
దిశ దశ, బెంగుళూరు:
జీవిత భాగస్వామి కోసం ఓ వివాహ పరిచయ వేదికలో తన వివరాలను అప్ లోడ్ చేసిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి హనీ ట్రాప్ కు గురై ఏకంగా రూ. 1.14 కోట్లు సమర్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి కోసం మహిళ వలలో పడి చేతి చమురు వదిలించుకున్న ఘటనపై బెంగుళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… లండన్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్న ఆయన బెంగుళూరుకు శిక్షణ కోసం వచ్చారు. ఇక్కడే పెళ్లి చేసుకోవాలని భావించిన సదరు సాఫ్ట్ వేర్ ఉన్నత ఉద్యోగి ఓ ప్రైవేట్ వివాహ పరిచయ వేదికను అప్రోచ్ అయి తన వివరాలను అందులో అప్ లోడ్ చేశారు. సాన్వి అరోరా అనే మహిళ ఆయనకు పరిచయం అయి జులై 7న వీడియో కాల్ చేసింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వీడియో కాల్ చేసినప్పుడు అతన్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు అవసరమైన రికార్డింగ్ చేసుకుని మరుసటి రోజు నుండి సాఫ్ట్ వేర్ ఉన్నత ఉద్యోగిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. వీడియో కాల్ చేసినప్పడు తన మొబైల్ లో రికార్డ్ చేసుకున్న చిత్రాలను, బాధితునికి వాట్సప్ లో షేరి చేసింది. దీంతో ఖంగుతున్న సదరు వ్యక్తి తన పరవు తీయవద్దని వేడుకోవడంతో ఇదే అదనుగా భావించిన ఆ మహిళ రూ. 1.14 కోట్లు అతని అకౌంట్ నుండి తన అకౌంట్ కు బదిలీ చేయించుకుంది. అయినప్పటికీ అతన్ని పట్టి పీడిస్తూ మరిన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో విసుగెత్తిన బాధితుడు స్థానిక వైట్ పీల్డ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలి బ్యాంకు అకౌంట్ ను బ్లాక్ చేయాలని కోరడంతో రూ. 80 లక్షలు అందులో నిలిచిపోయాయి. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితురాలిని పట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు.