రాష్ట్రాల్లో వరస విజయాలతో దుందుభి మోగిస్తూ సుపరిపాలన అందిస్తున్నాయి కొన్ని పార్టీలు. ఆయా రాష్ట్రాలలో తమ పట్టు నిలుపుకుంటూ అక్కడి ప్రజలను అక్కున చేర్చుకుంటూ విజయాల పరంపర కొనసాగిస్తున్నాయి. ఓటరు మనోగతానికి అనుగుణంగా పార్టీలు ముందుకు సాగాలంటే ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయని చెప్పవచ్చు. అసెంబ్లీల్లో ఆదిపత్యం సాధించాలంటే మెజార్టీ ప్రజలకు అనుగుణంగా పరిపాలన అందించడంతో పాటు ప్రతిపక్షల ఎత్తులకు చిక్కకుండా వ్యూహాత్మక ఎత్తగడలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. దశాబ్దం క్రితం వరకు ఉన్న పరిస్థితులకు ఇప్పుడు నెలకొన్న పరిస్థితులకు చాలా భిన్నమనే చెప్పాలి. అప్పుడు మీడియా అంటే పత్రికలు, టీవీలు వాటిలో ప్రసారం అయ్యే వార్తలు విశేషాలు మాత్రమే ఓటర్లకు చేరేవి. కానీ దశాబ్ద కాలంగా సాగుతున్న సామాజిక మాధ్యమాల విప్లవం అంతా ఇంతా కాదు. మారుమూల పల్లెలకు సైతం ఇంటర్ నెట్ సేవలు అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారమే ఎక్కువ అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆయా రాజకీయ పార్టీలు ప్రధాన మీడియాలో వస్తున్న ప్రచారాలను తిప్పి కొట్టే చర్యల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్, పోస్టులకు కౌంటర్ అటాక్ చేయాల్సిన పరిస్థితి తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో వరస విజయాలతో దూసుకపోయే పరిస్థితి రాజకీయ పార్టీలకు సవాలే. దేశంలో సుస్థిర పాలన అందిస్తూ సుదీర్ఘ కాలం అధికారంలో కూర్చున్న పార్టీలు రికార్డులు క్రియేట్ చేశాయి. ఇందులో పశ్చిమ బెంగాల్ లో జ్యోతిబసు వరస విజయాలతో అత్యధిక కాలం రూలింగ్ లో ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో కూడా చాలా కాలం ప్రభుత్వాలను నడిపించిన చరిత్ర పార్టీలకు ఉంది. అందులో ఏఏ పార్టీలు ఎంత కాలం రూలింగ్ లో ఉన్నాయంటే…?
ఎర్ర జెండా మెరుపులు
వెస్ట్ బెంగాల్ లో సుదీర్ఘ కాలం పరిపాలన అందించింది మాత్రం కమ్యూనిస్టులే. ఇక్కడ 1977 నుండి 20011 వరకు సీపీఎం అధికారాన్ని కొనసాగించింది. 34 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ ను పరిపాలించిన సీపీఎం తరుపున మొదట జ్యోతిబసు 2000 వరకు సీఎంగా వ్యవహరించగా ఆయన స్థానంలో బుద్దదేవ్ భట్టాచార్య సీఎం పీఠాన్ని అధిష్టించారు. అయితే భట్టాచార్య పదేళ్ల పాటు సీఎంగా పనిచేసినప్పటికీ 2011 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎర్రజెండా పార్టీని గద్దె దింపిన తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ వరస విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు. అయితే ఇక్కడ సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన జ్యోతిబసు 23 సంవత్సరాల 137 రోజుల పాటు సేవలందించారు.
గుజరాత్ కమల వికాసం…
అయితో తాజా ఎన్నికల్లో విజయం అందుకున్న బీజేపీ కూడా 27 ఏళ్ల పాటు అక్కడ అధికారంలోకి వచ్చింది. మధ్యలో కొంత కాలం గ్యాప్ ఇచ్చినప్పటికీ అక్కడ బీజేపీ తన ఆదిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. ఈ సారి కూడా విజయం సాధించడంతో ఒకే రాష్ట్రంలో 32 ఏళ్ల పాటు పరిపాలన సాగించిన రికార్డును అందుకుంటున్న రెండో పార్టీగా అవతరించింది. పశ్చిమ బెంగాల్ లో 34 ఏళ్ల పాటు కమ్యూనిస్టులు గెలుపును అందుకుంటే బీజేపీ గుజరాత్ లో 32 ఏళ్ల పాటు పరిపాలన అందించబోతోంది. 1995 నుండి వరసగా విజయాలను అందుకుంటున్నప్పటికీ మధ్యలో 27 రోజుల పాటు రాష్ట్రపతి పాలన, రెండేళ్ల పాటు రాష్ట్రీయ జనతా పార్టీ అధికారాన్ని చేజిక్కుంచుకోవడంతో మద్యలో గ్యాప్ ఏర్పడింది. 2001 నుండి ఇప్పటి వరకు వరస విజయాలతో ముందుకు సాగుతోంది కమలం పార్టీ.
మహా… సర్కార్…
27 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం మహారాష్ట్రలో అధికారం దక్కించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. అక్కడ 1962 నుండి వరసగా విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ 1978లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదర్కొవలసి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చీలిపోవడంతో కాంగ్రెస్ (య), కాంగ్రెస్ (ఐ)లుగా చీలిపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దాదా పాటిల్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ (యు) తరుపున మంత్రిగా వ్యవహరిస్తున్న శరద్ పవార్ బయటకు వచ్చి కాంగ్రెస్ (ఎస్)ను ఏర్పాటు చేసి జనతా పార్టీ మద్దతుతో ఏడాదిన్నర పాటు సీఎంగా పని చేశారు. 1986లో తిరిగి కాంగ్రెస్ పంచన శరద్ పవార్ చేరడంతో వరసగా రెండేళ్ల పాటు మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.
సి‘క్కింగ్’
సిక్కిం రాష్ట్రంలో కూడా డెమెక్రటిక్ ఫ్రంట్ వరస విజయాలతో పరిపాలన అందించారు. పవన్ కుమార్ చామ్లింగ్ 1994 నుండి వరసగా ఐదు సార్లు గెలిచి 24 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో క్రాంతికారీ పార్టీ పీకె చామ్లింగ్ ను గద్దె దింపి అధికారంలోకి రావడంతో ఆయన సుదీర్ఘ పాలనకు పుల్ స్టాప్ పడింది. 24 ఏళ్ల 165 రోజుల పాటు సీఎంగా సేవలందించిన రికార్డు మాత్రం దేశంలో పీకే చామ్లింగ్ కే దక్కింది.
ఒడిషా బాద్షా…
ఒకపోతే ఒడిషా బాద్షాగా నవీన్ పట్నాయక్ చరిత్ర సృష్టిస్తున్నారు. వరస విజయాలతో ఆయన ఇప్పటికీ సీఎంగా ఒడిషా ప్రజలకు సేవలందిస్తున్నారు. 2000 నుండి బీజేడీ పార్టీ అధ్యక్షుడైన నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా అక్కడి ప్రజలకు సేవలందిస్తున్నారు.
సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రులుగా వ్యవహరించింది వీరే…
సిక్కీం సీఎంగా పీకే చామ్లింగ్ 24 ఏళ్ల 165 రోజులు
పశ్చిమ బెంగాల్ సీఎంగా జ్యోతిబసు 23 ఏళ్ల 137 రోజులు
ఒడిషా సీఎంగా నవీన్ పట్నాయక్ 2000 మార్చి 5 నుండి కొనసాగతున్నారు
అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా అపాంగ్ 22 ఏళ్ల 250 రోజులు
మిజోరాం సీఎంగా లాల్ తన్వాల 21 ఏండ్ల 55 రోజులు
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా వీరభద్ర సింగ్ 21 సంవత్సరాల 11 రోజులు
త్రిపురలో ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్ 19ఏండ్ల 363 రోజులు
తమిళనాడులో కరుణానిధి 18 సంవత్సరాల 360 రోజులు
పంజాబ్ లో ప్రకాష్ సింగ్ బాదల్ 18 సంవత్సరాల 350 రోజులు
హిమాచల్ ప్రదేశ్ లో యశ్ంత్ సింగ్ ప్రమార్ 18 ఏళ్ల 30 రోజులు
బీహార్ లో శ్రీ కృష్ణ సిన్హా 17 ఏండ్ల 14 రోజులు
రాజస్థాన్ మోహన్ లాల్ సుకాడియా 16 సంవత్సరాల 194 రోజులు
బీహార్ సీఎంగా నితీష్ కుమార్ 16 ఏండ్లపై బడి కొనసాగుతున్నారు.
నాగాలాండ్ సీఎంగా రియో 15 సంవత్సారాల 286 రోజులు
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 15 ఏండ్ల 279 రోజులు
గోవా సీఎంగా ప్రతాప్ సింగ్ రాణే 25 సంవత్సరాల 250 రోజులు
నాగాలాండ్ సీఎం ఎస్ సి జమీర్ 15 ఏండ్ల 200 రోజులు
ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ 15 సంవత్సరాల 25 రోజులు
మణిపూర్ సీఎంగా ఒక్రం సింగ్ 15 ఏండ్ల 8 రోజులు
అస్సాం ముఖ్యమంత్రిగా తరుణ్ గగోయ్ 15 సంవత్సరాల 7 రోజులు
చత్తీస్ గడ్ సీఎం రమణ్ సింగ్ 15 సంవత్సరాల 4 రోజులు
వెస్ట్ బెంగాల్ సీఎంగా చంద్ర రాయ్ 14 ఏండ్ల 159 రోజులు
తమిళనాడులో జయలలిత 14 సంవత్సరాల 124 రోజులు
మేఘాలయాలో సంగ్మా 14 ఏండ్ల 87 రోజులు
దేశలోని వివిధ రాష్ట్రాలలో మొత్తం 10 ఏళ్లకు పైగా 46 మంది ముఖ్యమంత్రులుగా తమ తమ రాష్ట్రాల్లో సేవలందించారు.