దిశ దశ, హైదరాబాద్:
అవినీతి నిర్మూలన కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్న ప్రభుత్వాలు ఇందు కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలను పటిష్టపర్చే విషయంపై దృష్టి సారించడం లేదు. ప్రభుత్వ యంత్రాంగంలో వేళ్లూనుకున్న అవినీతిని పారదోలేందుకు అవినీతి నిరోధక శాఖ పనిచేసేందుకు అత్యంత పటిష్టమైన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ వాటిని అమల్లో పెట్టేందుకు ఏర్పాటు చేసిన విభాగంలో పనిచేసేందుకు ఆసక్తి చూపే వారు కరువయ్యారు. దీంతో వివిధ శాఖల నుండి డిప్యూటేషన్ పై వెళ్లాల్సిన ఏసీబీ మొక్కుబడి యంత్రాంగంతో సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విభాగంలోకి వెల్లిన వారిని మాతృ విభాగనికి తిరిగి పంపించడంలో జాప్యం జరుగుతుండడంతో ఏసీబీలోకి వెల్లేందుకు కూడా అధికార యంత్రాంగం ససేమిరా అంటోంది.
లూప్ లైన్ అయినా…
శాంతి భద్రతల విభాగంలో పనిచేస్తున్న అధికారులు ఏసీబీలో పనిచేసినంత కాలం కూడా లూప్ లైన్ గానే పరిగణిస్తారు. అయితే ఈ విభాగంలో పనిచేసేందుకు మాత్రం చాలా మంది ఆసక్తి చూపడం లేదు. ఈ విభాగానికి డిప్యూటేషన్ పై వెల్లిన వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతుండడంతో ఈ విభాగంలో చేరేందుకు ఆసక్తి చూపడం తాము చేసిన తప్పా అన్న మనోవేదన వ్యక్తం అవుతోంది కొంతమంది అధికారుల్లో. ఏసీబీలో రెండేళ్ల పాటు పని చేసిన తరువాత వారిని తిప్పి పంపించేందుకు అవసరమైన విధంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు అవసరమైన విధి విధానాలను కఠినంగా అమలు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల ఏసీబీలో పనిచేసేందుకు సుముఖత చూపే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఉన్నతాధికారులు నిబంధనల మేరకు నడుచుకుంటామని డిప్యూటేషన్ పై తీసుకున్న సమయంలో కింది స్థాయి అధికారులకు మాట ఇస్తున్నప్పటికీ తిప్పి పంపేప్పుడు వెకెన్సీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో ఈ విభాగంలోకి డిప్యూటేషన్ పై వెల్లిన వారు అక్కడే ఉండిపోవల్సిన వస్తోంది.
శాశ్వత పరిష్కారం…
ఏసీబీలో పనిచేసే వారిని ఖచ్చితంగా రెండేళ్లలో మాతృ విభాగానికి పంపించే విధంగా, ఏసీబీలో క్యాడర్ ను బట్టి పోలీసు అధికారులను ఖచ్చితంగా పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఈ విభాగంలోకి వచ్చేందుకు పోలీసు అధికారులు కూడా సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఏసీబీ చీఫ్ ఆఫీసర్లు ఖచ్చితంగా పాటించేందుకు ప్రయత్నిస్తున్నా ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారిని ఏసీబీలోకి పంపించే విషయంలో మీనామేషాలు లెక్కిస్తున్నారు. ఇందుకు వారు బాధ్యతల్లో ఉన్న విభాగంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, ఇతరాత్ర కారణాలు కావచ్చు… ఏసీబీకి పంపించే విషయంలో మాత్రం వెనక్కి తగ్గుతున్న సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఇతర లూప్ లైన్ వింగ్స్ లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న పోలీసు అధికారులు ఇందులో పనిచేసేందుకు మాత్రం ‘నో’ అని తేల్చి చెప్తున్నారు.
పలు విధాలుగా…
రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి డిప్యూటేషన్ పై పంపించే విషయంలో కఠినంగా వ్యవహరించినట్టయితే చాలా విధాలుగా సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అవినీతికి పాల్పడే వారిని పట్టుకునేందుకు తరుచూ ఫీల్డ్ లో ఉండే ఏసీబీ అధికారుల మీడియాలో కనిపించడంతో వారిని అవినీతికి పాల్పడుతున్న వారు గుర్తించే ప్రమాదం ఉంటుంది. ఇటీవల జగిత్యాల జిల్లా రాయికల్ ఎస్సైను రెడ్ హైండెడ్ గా ట్రాప్ చేసేందుకు ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అతన్ని పట్టుకునేందుకు రాత్రి వరకూ కాపు కాసినప్పటికీ ఆయన స్టేషన్ కు వస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులను గమనించి లంచం డబ్బులు తీసుకోకుండానే తప్పించుకున్నారు. అయితే ఏసీబీ అదికారులు మాత్రం మీడియేటర్ ను అరెస్ట్ చేసి ఎస్సైపై కూడా కేసు నమోదు చేశారు. ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏసీబీలో రెండెళ్ల పాటే డిప్యూటేషన్ అన్న విధానం ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇందులో పని చేస్తున్న అధికారుల ఉనికి బాహ్య ప్రపంచానికి తెలిసే లోపునే వారు అక్కడి నుండి రిలీవ్ అయి కొత్త వారు బాధ్యతల్లో చేరుతారు. దీనివల్ల దాడులు చేసినప్పుడు కానీ ఆరా తీసేప్పుడు కూడా ఇబ్బందులు తలెత్తవు.
మానసిక పరివర్తన…
మరో వైపున ఏసీబీలో చేరడం వల్ల మానసిక పరివర్తన కూడా చెందే అవకాశాలు కూడా లేకపోలేదు. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని పట్టుకునే క్రమంలో తరుచూ బాధితులతో మాట్లాడాల్సి ఉంటుంది. బాధితులు నేరుగా ఏసీబీ అధికారులను కలిసి తమ గోడు చెప్పుకున్న క్రమంలో వారి బాధలు, అవినీతికి పాల్పడుతున్న వారు పెడుతున్న ఇబ్బందులు కళ్లకు కట్టినట్టుగా తెలుస్తాయి. దీనివల్ల కరప్షన్ వల్ల సామాన్య కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు కూడా వారికి అర్థం అయి మాతృ సంస్థలోకి వచ్చిన తరువాత అవినీతి చేసేందుకు విముఖత చూపే అవకాశాలు ఉంటాయి. అవినీతితో సామ్రాజ్యాన్నే నిర్మించుకోవాలని ఆశపడే వారి విషయం మినహాయిస్తే మాత్రం సమాజంపై అవగాహన ఉండి సామాన్యుల కష్టాలను గమనించిన ప్రతి ఒక్కరు కూడా మానసిక పరివర్తన చెందే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలపై ఇందులో పనిచేసిన అదికారయంత్రాంగానికి సంపూర్ణ అవగాహన కూడా వస్తుంది. దీంతో శాంతి భద్రతల విభాగంలోకి తిరిగి వచ్చిన తరువాత ఆయా శాఖల్లో జరిగే నేరాల పరిశోధనకు కూడా ఏసీబీలో పని చేసిన అనుభవం అక్కరకు వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఏసీబీకి డిప్యూటేషన్ పంపించే విషయంలో అయినా అక్కడ పనిచేసే వారిని రిలివ్ చేసే విషయంలో అయినా కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.