దిశ దశ, హైదరాబాద్:
ఐజీ స్థాయిలో పనిచేసి రిటైర్డ్ అయిన అధికారికి లుక్ ఔట్ సర్క్యూలర్ (ఎల్ఓసి) నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. పోలీసు విభాగంలో ఉన్నత స్థాయి అదికారిగా పనిచేసి పదవి విరమరణ పొందిన ఐపీఎస్ ఆఫీసర్ పై ఎల్ఓసి నోటీసులు ఇవ్వడం అత్యంత అరుదేనని చెప్పాలి. ఇంటలీజెన్స్ వింగ్ లో కీలక అధికారికగా పని చేసిన ప్రభాకర్ రావుతో పాటు మరో రిటైర్డ్ అధికారి రాధాకిషన్ రావులకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారు. ఎస్ఐబీ కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణిత్ రావును కస్టడీకి తీసుకున్న పోలీసు అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఆయన మొబైల్ రిట్రైవ్ చేయడంతో అందిన సమాచారం ఆధారంగా ఒక్కో పోలీసు అధికారిని విచారించడం మొదలు పెట్టారు. ఈ కేసులో సిటీ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్న అడిషనల్ డీసీపీ తిరుపతన్న, భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్ భుజంగరావులను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ కేసుకు సంబంధం ఉందని గుర్తించిన పోలీసు అదికారులు విదేశాల్లో ఉన్న రిటైర్ట్ అధికారులు ఇద్దరితో పాటు ఐ న్యూస్ ఎండీ అరువెల శ్రవణ్ కుమార్ రావులకు లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడం గమనార్హం. వీరు దేశంలోకి అడుగు పెట్టిన వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం వస్తుందని వెంటనే వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
వారి కనుసన్నల్లోనే…
అయితే కొంతమంది పోలీసు అధికారులు అప్పటి ప్రభుత్వంలో చెలాయించిన తీరు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో లోతుగా దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగంలో అప్పటి పరిస్థితులపై చర్చ మొదలైంది. సబార్డినేట్ స్థాయిలో ఉన్న అదికారి వద్దకు సీనియర్ ఆఫీసర్లు, ఐపీఎస్ లు కూడా అపాయింట్ మెంట్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉండేవని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఆయన కనుసన్నల్లోనే వ్యవహారం అంతా చక్కబెడుతుండడంతో ఆయన వద్దకు వచ్చి కలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని… దీంతో ఉన్నతాధికారులు కూడా ఆయనను కలవాల్సిన పరిస్థితులు తయారయ్యాయని అంటున్నారు. మరో అధికారి టాస్క్ ఫోర్స్ వ్యవహారాలను చక్కబెట్టే విషయంలో అన్ని తానై వ్యవహరించారని హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో కోడై కూస్తోంది. ఆ అధికారి క్లియరెన్స్ ఇస్తేనే టాస్క్ ఫోర్స్ టీమ్స్ మూవ్ మెంట్ చేయాల్సి ఉండేదని, ఆయన నో అంటే యంత్రాంగం అంతా కూడా సైలెంట్ కావల్సి వచ్చేదని పోలీసు వర్గాల సమాచారం.
డాటా అక్కడి నుండేనా..?
మరో వైపున మీడియా సంస్థ ద్వారా ప్రత్యర్థి పార్టీలకు అండదండలు అందిస్తున్న వారి డాటాను సేకరించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఐ న్యూస్ లో పనిచేస్తున్న తమ కింది స్థాయి ఉద్యోగుల ద్వారా క్షేత్రస్థాయి లీడర్ల డాటా సేకరించినట్టుగా అనుమానిస్తున్నారు. వీరి ద్వారా సేకరించిన ఈ డాటా అంతా కూడా ఎస్ఐబీ ఎస్ఓటీ వింగ్ కు చేరగానే వారి ఫోన్లపై నిఘా వేసి ఎప్పటికప్పుడు వివరాలను సేకరించే వారని తెలిసింది. ఆ వివరాలను ఆధారం చేసుకుని గ్రౌండ్ లెవల్లో పనిచేస్తున్న బీఆర్ఎసేతర పార్టీల నాయకులకు వార్నింగ్స్ వెల్లేవని, ఆ తరువాత వారిని బీఆర్ఎస్ కు అనుకూలంగా మల్చుకునే వ్యూహం సాగించేవారని కూడా దర్యాప్తు అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం.