ఓవర్ లోడ్ విధానం అథరైజ్ చేశారా… లారీల బాడీ సైజులు మార్చడం వెనక..?

దిశ దశ, కరీంనగర్:

అటు రహదారులకు, ఇటు వాహనదారులకు ఇబ్బందికరంగా మారిన ఆ విధానానంపై రవాణా శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు..? ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే చర్యలపై కట్టడి చర్యలు తీసుకోవడం లేదెందుకు..? ఓవర్ లోడ్ విషయంలో రవాణా శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది.

లారీల రీ డిజైనింగ్..

రాష్ట్రంలోని వేలాది లారీలు RC బుక్కులతో సంబంధం లేకుండానే వాహనాల సైజులు మారిపోతున్నాయి. రవాణా విభాగం అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండడం వల్లే ఈ పరిస్థితి తయారవుతోంది. నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న లారీ బాడీ సైజులు పెంచుతున్నప్పటికీ పట్టించుకున్న వారే లేకుండా పోయారు. రాష్ట్రంలోని ఇసుక రీచులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోని అన్ని రహదారుల్లో సంచరిస్తున్న లారీల్లో ఎక్కువ శాతం బాడీ సైజులను రీ డిజైన్ చేసినవే కావడం గమనార్హం. టైర్ల సామర్థ్యాన్ని బట్టి లారీ బాడీ సైజులు ఉండాలన్న నిబంధనలు ఉన్నప్పటికి లారీల యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా కట్టడి చేసే వారు లేకుండా పోయారు. దీంతో రాష్ట్రంలో ఓవర్ లోడ్ కు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మారిపోయింది. బాడీ లెవల్ దాడినా, టన్నేజీ కెపాసిటీ దాటినా రవాణా విభాగం అధికారులు దాడులు చేసి పెనాల్టీలు వేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో లారీల బాడీల సైజులు పెంచినట్టయితే వాటిని సీజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ అధికారులు మాత్రం వీటి గురించే పట్టించుకోవడం లేదు. ఫిట్ నెస్ జారీ చేసేప్పుడు కూడా ఈ విషయాలను విస్మరిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏండ్లుగా బాడీలను రీ డిజైన్ చేసిన లారీలు తెలంగాణ రోడ్లపై తిరుగుతున్నా వాటిపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం లేవని స్పష్టం అవుతోంది. 2017కు ముందు కొనుగోలు చేసిన లారీలు ఏడాది కోసారి ఫిట్ నెస్ పరీక్షలకు ఆర్టీఏ కార్యాలయానికి తీసుకెళ్లాల్సి ఉండగా, 2017 తరువాత కొనుగోలు చేసిన లారీలు రెండేళ్ల కోసారి ఫిట్ నెస్ పరీక్షలు చేయించుకోవల్సి ఉంటుంది. అంతేకాకుండా ఓవర్ లోడ్ విషయంలో రవాణా అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఓవర్ లోడ్ రవాణా చేస్తున్న లారీలను కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఉంది.ఈ సమయంలో RC బుక్స్ లో ఉన్న డిజైన్ కు లారీ రీ డిజైన్ ను పోల్చి వాటిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. కానీ రవాణా శాఖ అధికారులు మాత్రం ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఓవర్ లోడ్ తో…

ఓవర్ లోడ్ కారణంగా రహదారులు ధ్వంసం అవుతుండడంతో రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. ఇసుక రీచులు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో అయితే రోడ్ల పరిస్థితి మరీ అధ్వన్నంగా తయారైంది. ఇటీవల నిర్మాణం జరిపిన రహదారులు కూడా నాశనం అయిపోతున్నాయంటే ఓవర్ లోడ్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఓవర్ లోడ్ వల్ల దెబ్బతింటున్న రహదారుల మరమ్మత్తుల కోసం నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ఇందుకు తోడు లారీల్లో సామర్థ్యానికి మించి ఇసుక లోడ్ చేస్తుండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాయం కోల్పోతున్నది. లారీల్లో 35 టన్నులు రవాణా చేయాల్సిన లారీల్లో అంతకు రెట్టింపు ఇసుక లోడ్ చేయడం వల్ల ఒకటే వే బిల్లు జారీ చేయాల్సి వస్తోంది. దీంతో నిబంధనల ప్రకారం లోడింగ్ విధానం అమలు చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.అంతేకాకుండా ఓవర్ లోడ్ వల్ల దెబ్బ తింటున్న రహదారులను తరుచూ రిపేర్లు చేయాల్సి వస్తోంది. లారీల మోడల్ నంబర్లు బట్టి కూడా దాని సామర్థ్యం ఎంతో కూడా తెలిసే అవకాశం ఉన్నప్పటికీ రవాణా శాఖ అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓవర్ లోడ్ తో వెల్లే లారీలు అదుపు తప్పినప్పినట్టయితే ప్రమాదాల తీవ్రత ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం కూడా ఎక్కువ మొత్తంలో జరిగే అవకాశం ఉన్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు.

You cannot copy content of this page