ఎల్ఓఎస్ కమాండర్ అరెస్ట్

భద్రాద్రి ఎస్సీ డాక్టర్ వినిత్ జీ

దిశ దశ, దండకారణ్యం:

భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు మావోయిస్టుల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఓ వైపున లొంగుబాట్లను ప్రొత్సహిస్తూనే మరో వైపున అరెస్టుల పర్వం కొనసాగిస్తుండగా ఇంకో వైపున నక్సల్స్ రాష్ట్రంలోకి ఎంటర్ కాకుండా నిలువరించే చర్యలు చేపడుతున్నారు. చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఈ జిల్లా మీదుగా మావోయిస్టులు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో మావోయిస్టుల ఎత్తులు చిత్తవుతున్నాయి. తాజాగా ఎల్ఓఎస్ కమాండర్ ను అరెస్ట్ చేయడంతో పార్టీ కార్యకలాపాలను నిలవరించడంలో సక్సెస్ అయ్యారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం ఎస్సీ డాక్టర్ వినిత్ జీ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పామేడు దళ కమాండర్ కమల అలియాస్ బుజ్జీని అరెస్ట్ చేసి ఆమె నుండి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. కమలపై రెండు రాష్ట్రాల్లో 30 కేసులు నమోదయ్యాయని తెలిపారు. నక్సల్స్ కార్యకలాపాలను నిరోధించడంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వారిని ఎక్కడికక్కడ కట్టడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో ఓఎస్డీ టి సాయి మనోహర్, సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page