గ్రామమంతా నిద్దురలోనే ఉందా..?

వారెందుకు అరవలేదో..?

ఓ వైపున సింగరేణి కోల్ మైన్… దానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామం అంతా అర్థరాత్రి కావడంతో గాడ నిద్రలోకి జారుకుంది. పిచ్చుక కిచ కిచమని అరిచినా అల్లంత దూరంలో వినపడేంత నిశ్వబ్దం ఆవహించింది. అదే సమయంలో ఓ ఇంటి వద్దకు చేరుకున్న అగంతకులు పెట్రోల్ పోసి నిప్పటించి కాలి బూడిద చేసి దర్జాగా తప్పించుకుని పారిపోయారు. మంటల తీవ్రతతో వచ్చిన పొగకు పక్కిటి వ్యక్తి లేవడంతో మంటలంటుకున్న విషయం సమాజానికి తెలిసింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ గుడిపల్లి గ్రామంలో జరిగిన ఆరుగురి సజీవ దహనం కేసులో అనుమానాలు ఎన్నో వస్తున్నాయి. నిందితులు పద్మ ఇంటినే లక్ష్యంగా చేసుకుని నిప్పు పెట్టి దగ్దం చేయడంతో ఆరుగురు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు ముందు నిందితులు వేసిన స్కెచ్… అమలు చేసిన విధానంలోనే వెంటాడుతున్న అనుమనాలు ఎన్నెన్నో.

అర్థరాత్రి ఏలా జరిగింది..?

శుక్రవారం అర్థరాత్రి ప్లాన్ అమలు చేసిన క్రమంలో నిందితుల కదలికలు గురించి వెలుగులోకి రాకపోవడం ఏంటన్నదే మిస్టరీగా మారింది. పోలీసులు ప్రాథమికంగా నిర్దారించిన విషయాలను బట్టి గమనిస్తే నిందితులు ఆటోలో వచ్చారని, వచ్చేప్పుడు ఓ బంకులో పెట్రోల్ నింపుకున్నారని సీసీ ఫుటేజ్ ను బట్టి అనుమానిస్తున్నారు. సుమారు 100 ఇండ్ల వరకూ ఉన్న గుడిపెల్లి గ్రామంలోకి నిందితులు ఎలా ఎంటర్ అయ్యారు..? ఆటోతో వెల్లినట్టయితే ఆ అర్థరాత్రి నిశ్వబ్దం ఆవహించిన ఆ సమయంలో వినిపించే ఆ శబ్దాన్ని గ్రామస్థుల చెవిలో పడకపోవడం ఏంటీ..? ఒక వేళ నిందితులంతా కూడా నడుచుకుంటూ వచ్చినట్టయితే ఇంటిని తగులబెట్టేందుకు ఉపయోగించిన పెట్రోల్ ను అక్కడి వరకు ఎలా తీసుకెళ్లారు.? బరువుతో ఉన్న పెట్రోల్ క్యాన్లను తీసుకెల్తున్న క్రమంలో అయినా నిందితులు తిరుగుతున్న సమయంలో జరిగే అలికిడి కూడా ఆ వేళల్లో పెద్దగానే వినిపిస్తుంది కదా ఈ చప్పుడు కూడా ఎవరికీ వినిపించకపోవడం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. అంతేకాకుండా ఇంటి వద్దకు చేరుకున్న నిందితులు చుట్టూ పెట్రోల్ పోస్తున్న క్రమంలో కూడా చుట్టు పక్కల వారికి వినిపించకపోవడం గమనార్హం. ఇల్లు దగ్దం అవుతున్న క్రమంలో సమీపంలోని ఇండ్లలోకి పొగబారడం వల్ల ఇరుగుపొరుగున ఉండే వారు నిద్ర లేచి ఈ విషయాన్ని గమనించారని తెలుస్తోంది. అంటే నిందితుల్లో కొంతమంది గుడిపెల్లి గ్రామానికి ముందుగానే చేరుకుని స్కెచ్ అమలు చేసినట్టయితే అర్థరాత్రి వరకు వారు ఎక్కడ షెల్టర్ తీసుకున్నారు..? చుట్టపు చూపుగా వచ్చి ఎవరి ఇంట్లో అయినా ఉండి ఆ ప్లాన్ ను అమలు చేశారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే షెల్టర్ ఇచ్చిన వారికొ హత్యకు పాల్పడేందుకు వచ్చారన్న విషయం తెలుసా తెలియాదా..? ఒక వేళ తెలియకపోతే అర్థరాత్రి వేళ షెల్టర్ ఇచ్చిన వారి ఇంటి నుండి ఎలా బయటకు వచ్చారు..? ఒక వేళ నిందితులు అందరూ కూడా అర్థరాత్రే ఘటనా స్థలానికి చేరుకుని ప్లాన్ అమలు చేసినట్టయితే ఆ చప్పుడుకు చుట్టు పక్కల వారిలో ఎవరో ఒకరు నిద్రలేచే అవకాశం కూడా ఉంటుంది కదా..? గ్రామంలో కుక్కలు కానీ ఇతరాత్ర జంతువులు ఎవీ లేవా..? అర్థరాత్రి వేళ నిందితుల మూవ్ మెంట్ గమనించి అవి అరిచేవి కదా వాటి అరుపులతో ఊర్లో ఎవరో ఒకరు నిద్ర లేచే అవకాశం ఉంటుంది కదా అన్న అన్న అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఎవరి కంట పడకుండా, ఎవరి చెవిన పడకుండా స్కెచ్ ఎలా అమలు చేశారన్నదే మిస్టరీగా మారింది.

ఆ ఇంట్లోనూ…

ఈ ఘటనలో మరో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. నిప్పంటించిన సమయంలో ఇంట్లో శివయ్య అతని భార్య పద్మ అలియాస్ రాజ్యలక్ష్మీ, శాంతయ్య, మౌనిక ఆమె కూతుళ్లు స్వీటీ, హిమబిందులు నిద్రిస్తున్నారు. ఇంటిని దగ్దం చేసిన తరువాత మంటల వేడి తీవ్రతతో ఇంట్లో పడుకున్న వారెవరూ లేచి అరవకపోవడం వెనక కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వేడి తాళలేక కనీసం నాలుగేళ్ల స్వీటీ కానీ రెండేళ్ల హిమ బిందు కానీ లేచి అరిచే అవకాశం ఉంటుంది. ఇంటిని చుట్టుముట్టిన అగ్ని కీలల్లో చిక్కుకున్నామన్న విషయాన్ని ఇద్దరు చిన్నారులతో ఉన్న తల్లి మౌనిక కూడా గ్రహించలేనంత నిద్రలోకి ఎలా జారుకుందనేది అంతుచిక్కకుండా పోతోంది. సజీవ దహనానికి ముందు నిందితులు పాయిజన్ కలిపిన ఆహారం పంపించి ఉంటారా..? ఆ ఆహారం తిన్న తర్వాత నిద్రలోకి జారుకోవడంతో మంటలను గమనించలేకపోయి ఉంటారేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులు విషాహారం నేరుగా ఇస్తే మాత్రం ఆ ఇంట్లో ఉన్న వారు తినే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఇంతకు ముందే శాంతయ్య, పద్మలపై రెక్కీ నిర్వహించడంతో పాటు తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని సహచర ఉద్యోగులతో సింగరేణిలో సర్దార్ గా పని చేస్తున్న శాంతయ్య చెప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇటీవల వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన రూ. 18 లక్షల గురించి, అతని ఉద్యోగం డిపెండెంట్ గా ఎవరి పేరు ఇవ్వాలోనన్న విషయం గురించి గొడవలు జరుగుతున్నాయని కూడా శాంతయ్య చెప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిందితులు విషం కలిపిన ఆహారం మాస శివయ్య ఇంటికి నేరుగా వెల్లి ఇచ్చే అవకాశాలు లేవు… ఒక వేళ అలా జరిగినా ఆ ఇంట్లో ఉన్న వారు మాత్రం అనుమానంతో ఆహారాన్ని తినేందుకు సాహసించరని స్ఫష్టం అవుతోంది. విషంతో కలిపిన ఫుడ్ ను మాస పద్మ ఇంటికి వేరే వారితో పంపిచినట్టయితే నిందితులకు మరి కొంతమంది సహకారం అందించే అవకాశాలు ఉన్నట్టు అనుమానించక తప్పదు. అయితే మరో ట్విస్ట్ ఏంటంటే ముందుగానే విషంతో కలిపిన ఫుడ్ ఆ ఇంట్లోకి పంపించినట్టయితే ఆ సమయంలోనే ఇంట్లో ఎవరెవరు ఉన్నారో ఆహారం తీసుకెళ్లిన వారు గమనించే అవకాశాలు ఉంటాయి కదా..? ఇంట్లో మౌనిక పిల్లలయినా కనిపించే వారు కదా..? ఈ విషయం స్కెచ్ వేసుకున్న వారికి చెప్పినట్టయితే తమ లక్ష్యానికి సంబంధం లేని వారు ఆ ఇంట్లో ఉన్నారని ప్లాన్ ఛేంజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయన్నది నిజం. ఇప్పటి వరకు పోలీసులకు వచ్చిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి గమనిస్తే ఆ ఇంట్లో కేవలం శాంతయ్య, పద్మలు మాత్రమే ఉన్నారన్న ఉధ్దేశ్యంతో మాత్రమే నిప్పంటిచారని తెలుస్తోంది. ఒక వేళ ఇదే నిజమైతే ఆ ఇంట్లోకి విషాహారం పంపించనట్టేనని, అయితే సాధారణ భోజనమే చేస్తే ఇంట్లో పడుకున్న ఆరుగురిలో ఒక్కరు కూడా మంటల వేడికి నిద్ర నుండి లేవకపోవడం వెనక కారణాలు ఏంటోనని అంతుచిక్కకుండా పోతోంది. కాలిపోతున్న ఇంటి తాలుక పోగ తమ ఇండ్లలోకి కూడా చూరడం వల్లే నిద్ర నుండి లేచాం తప్ప ఇంట్లో ఉన్న వారి అరుపులు ఎవరివి కూడా వినిపించలేదని స్థానికులు పోలీసులకు చెప్పడాన్ని బట్టి చూస్తే ఆరుగురి సజీవ దహనం కేసును విభిన్న కోణాల్లో దర్యాప్తు చేసయాల్సిన ఆవశ్యకత అయితే ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఏది ఏమైనా విధి ఆడిన నాటకంలో ఆరుగురి సజీవ దహనం కావడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తే ఈ కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్ గా మారిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page