సర్కారు ఉద్యోగాల ఎర…

నకిలీ పత్రాలతో వసూళ్ల జాతర

దిశ దశ, మానకొండూరు:

సర్కారు ఉద్యోగాలు ఇప్పిస్తాను, అపాయింట్ మెంట్ కూడా వస్తుంది మీకేం ధోకాలేదు నాకు పెద్ద తలకాయలతో పరిచయం ఉంది అంటూ పలువురిని బోల్తా కొట్టించాడో ప్రభుద్దుడు. అతని మాయమాటలు విని అడిగినంత డబ్బు ముట్టజెప్పి నట్టేట మునిగిపోయారు కొందరు. కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. మండలంలోని చెంజర్ల గ్రామానికి చెందిన గొడిశాల వెంకటేష్(30) సర్కారు విభాగాల్లో శాశ్వత ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసానికి పాల్పడ్డాడు.

అపాయింట్ మెంట్ లెటర్లూ…

ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుల నుండి డబ్బులు వసూలు చేసిన నిందితుడు తన సచ్ఛీలతను నిరూపించుకునేందుకు ఏకంగా అపాయింట్ మెంట్ లెటర్స్ కూడా పంపించేశాడు. పశు సంవర్దక శాఖలో ఉద్యోగానికి రూ. 20 లక్షలు వసూలు చేసిన ఈ ఘనుడు మరో వ్యక్తికి దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా అధర్మంగా జాబ్ ఇప్పించేశాడు. ఇందుకు రూ. 9 లక్షలు కూడా తీసుకున్న ఈ నిందితుడు ఫేక్ నియామక పత్రాలను క్రియేట్ చేసి మరీ బాధితులకు ఇచ్చాడు. ఉద్యోగాలు వచ్చాయంటూ ఇచ్చిన లేఖలు నకిలీవని తెలిసిన బాధితులు మానకొండూరు పోలీసులను కలిసి విన్నవించగా నిందితుడు వెంకటేష్ పై ఛీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఒక్కడేనా..?

అయితే నిందితుడు వెంకటేష్ ఇచ్చిన ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్స్ ను గమనిస్తే ఈ వ్యవహారంలో అతనొక్కడే ఉన్నాడా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అపాయింట్ మెంట్ లెటర్ తయారు చేయడం, ఇందులో అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయడాన్ని గమనిస్తే ఇంకా వేరే వ్యక్తులతో సంబంధాలు ఉండి ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది.

You cannot copy content of this page