దివ్యాంగురాలిని దోపిడీ చేసిన ఘనురాలు

జగిత్యాల ఎస్సీకి ఫిర్యాదు..

దిశ దశ, జగిత్యాల:

దివ్యంగా బ్రతకాలనుకున్న ఓ దివ్యాంగురాలిని నిండా ముంచేసిందో యువతి. బాసట ఇస్తున్నట్టుగా నటించి భరోసా ఇచ్చినట్టే ఇచ్చి ఆమె వద్ద ఉన్న డబ్బులన్ని వసూలు చేసుకుని దాడి చేయించిందో ఘనురాలు. జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుట్టుకతోనే దివ్యంగురాలైన ఓ యువతి మనో ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. దివ్యాంగురాలిని అన్న బాధకు దూరంగా జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కిరాణం దుకాణం పెట్టుకుని స్వయం ఉపాధి పొందుతున్న తనను మచ్చిక చేసుకుని నిండా ముంచేసిందంటూ బాధితురాలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండకు చెందిన ఓ దివ్యాంగురాలైన ఓ యువతి కిరాణం దుకాణం పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. తల్లి తండ్రులు చనిపోయిన తరువాత తన చేతికి వచ్చిన డబ్బుతో పాటు తాను చేస్తున్న వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పోగు చేసుకుంటున్నారు. ఆమె వద్ద పెద్ద మొత్తంలో డబ్బులున్న విషయం గమనించిన మరో యువతి దివ్యాంగురాలితో సాన్నిహిత్యంగా ఉండడం ఆరంభించింది. సమాజంతో సంబంధం లేదని మనమిద్దరం సహజీవనం చేద్దామంటూ మాయమాటలతో లోబర్చుకుని రూ. 35 లక్షలు వసూలు చేసుకుంది. వీటిలో రూ. 11.70 లక్షలు ఫోన్ పే ద్వారా ఆమె అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసుకోగా, రూ. 23.30 లక్షల రూపాయలు నేరుగా తీసుకుందని బాధితురాలు ఆరోపిస్తున్నారు. సదరు యువతికి పెళ్లి నిశ్చయం కాగా అప్పుడు కూడా రూ. లక్షతో పాటు తులం బంగారం తీసుకుని ఇద్దరి సాంగత్యం ఇలాగే కొనసాగిద్దామని మాయమాటలు చెప్పినట్టు దివ్యాంగురాలు వివరించారు. తన భర్త లేని సమయంలో సహజీవనం చేస్తానని మాట ఇచ్చిందని కూడా బాధితురాలు అంటున్నారు. పెండ్లి అయిన తరువాత తనను విస్మరించిందని, తనకు ఇవ్వవలసిన డబ్బులు అయినా ఇవ్వాలని కోరితే వాల్గొండలోనే కొంతమంది గుండాలతో కొట్టించిందని తెలిపారు. ఈ మేరకు మల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దివ్యాంగురాలిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. బాధితురాలు దివ్యాంగుల హక్కుల సంక్షేమ పోరాట సమితి అద్యక్షుడు లంక దాసరి శ్రీనివాస్ ను సంప్రదించగా ఆయన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page