మేడిగడ్డ బాధిత రైతుల సరికొత్త వ్యూహం… ఘోష్ కమిషన్ కు వినతి పత్రం…

దిశ దశ, సిరొంచ:

మేడిగడ్డ బాధిత రైతులు జస్టిస్ ఘోష్ కమిషన్ ను ఆశ్రయించేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. తెలంగాణ రైతాంగానికి మాత్రమే లాభం చేకూర్చే మేడిగడ్డ బ్యారేజీ వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు అంటున్నారు. ఈ మేరకు మేడిగడ్డ బ్యారేజీ అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ కు దరఖాస్తు చేయాలని భావిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ బ్యారేజీ వల్ల మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని సుమారు 10 గ్రామాల రైతుల భూములు కూడా ముంపునకు గురయ్యాయి. అయితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి ముందు తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కై ముంపునకు గురయ్యే భూములు అంచనా వేసి తప్పుడు నివేదికలు ఇచ్చారని అక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో ఫుల్ రిజర్వాయర్ లెవల్ లో నీటిని నిలువ ఉంచినప్పుడు మొదట అంచనా వేసిన దాని కంటే ఎక్కువ  భూములు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్కువ భూమి ముంపునకు గురవుతుందని ఇచ్చిన నివేదికల వల్ల మేడిగడ్డ బ్యాక్ వాటర్ లో మునిగిపోతున్న భూమికి సంబంధించిన కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిందంటున్నారు.  అప్పటి ప్రభుత్వం, అదికారులు కావాలనే నష్టం తక్కువగా ఉందని అంచనా వేసి తమకు తీరని అన్యాయం చేశారంటున్నారు బాధిత రైతులు.
ADVT

కొత్త నినాదంతో…

ఇంతకాలం ముంపునకు గురైన భూములకు పరిహారం చెల్లించండి మహాప్రభో అంటు సిరొంచ తాలుకా రైతులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం నిధులను కెటాయించలేదని, దీనివల్ల తాము పరిహారం చెల్లించలేకపోతున్నామని గడ్చిరోలి జిల్లా అధికారులు బాధిత రైతాంగానికి వివరించారు. అంతేకాకుండా రైతుల ఒత్తిళ్లు తట్టుకోలేకపోయిన మహారాష్ట్ర అధికారులు కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు రాశారు. అయినా స్పందన లేకపోవడంతో సిరొంచ రైతులు నిరవధిక దీక్షలకు పూనుకున్నారు. పరిహారం చెల్లించాల్సిందేనని పట్టుబట్టడంతో పాటు నాగపూర్ లో అసెంబ్లీ సెషన్స్ కొనసాగుతున్న సమయంలో డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. గడ్చిరోలి జిల్లా ఇంఛార్జి మంత్రి కూడా అయిన ఫడ్నవిస్ మేడిగడ్డ బాధిత రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. ఆ తరువాత కాలయాపన జరగడంతో రైతులు నిరవధిక దీక్షలకు పూనుకోవడంతో తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేకుండా పరిహారం చెల్లించింది. అయితే అప్పటికే అదనంగా ముంపునకు గురవుతున్న భూముల గురించి కూడా మహారాష్ట్ర సర్కార్ సర్వే కూడా చేయించి మేడిగడ్డ బ్యారేజీ వల్ల జరుగుతున్న నష్టాన్ని అంచనా వేసింది.  ఇప్పుడు సిరొంచ తాలుకాలోని బాధిత రైతులు రెండో సారి సర్వే చేసిన భూములకు కూడా పరిహారం అందించాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. ఇప్పటికే సిరొంచ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించిన రైతులు, ఇటీవల ఆందోళన కూడా చేపట్టారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ ఘోష్ కమిషన్ కు తమ గోడు వినిపిస్తూ వినతి పత్రం అందించాలని రైతులు నిర్ణయించారు. అప్పటి అధికారులు, ప్రభుత్వం కావాలనే ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని తక్కువ చూపించి కుట్ర చేసిందని, దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని నివేదించాలని భావిస్తోంది. మేడిగడ్డ నిర్మాణం విషయంలోనే కాకుండా ముంపునకు గురయ్యే ప్రాంతాల విషయంలోనూ అన్యాయంగా వ్యవహరించి తమను రోడ్డు పాలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న తాము మేడిగడ్డ నిర్మాణంతో ఉపాధి కోసం వలస కూలీలుగా మారాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వల్ల తమకు ఏ మాత్రం లాభం లేకున్నప్పటికీ తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా… అంచనాలు వేసే విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించినందున జస్టిస్ ఘోష్ కమిషన్ తమ విన్నపాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించాలని నిర్ణయించారు. మేడిగడ్డ వల్ల జరుగుతున్న నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపించాలని కూడా కోరనున్నారు.

You cannot copy content of this page