దిశ దశ, మహదేవపూర్:
చదువుకునేందుకు అవసరమైన ప్రోత్సాహం… చదవు కోవాలన్న ఆశయం ఉన్నట్టయితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు. మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న ఆ ప్రాంత విద్యార్థులు మారుమూల బిడ్డలమే అయినా జాతీయ స్థాయిలోనూ రాణిస్తామంటున్నారు. తమలోని క్రియేటివిటీకి పదును పెట్టిన విద్యార్థులు ఇప్పటికే ఢిల్లీ గడ్డమీద ప్రదర్శనలతో నేషనల్ లెవల్ గుర్తింపు పొందారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఇచ్చే స్కాలర్ షిప్ స్కిమ్ కోసం నిర్వహించిన పరీక్షల్లోనూ తమ సత్తా చాటారు ఈ ప్రాంత సర్కారు పాఠశాలల విద్యార్థులు. 8వ తరతగతి నుండి విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ స్కీం ఎగ్జామినేషన్ నిర్వహించింది. గత డిసెంబర్ నెలలో జరిగిన ఈ ఎగ్జామ్ లో భూపాలపల్లి జిల్లాకు చెందిన 25 మంది విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హత సాధించారు. వీరంతా కూడా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వారు మాత్రమే కాగా ఇందులో ఆరుగురు విద్యార్థులు ఒక్క మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన వారు కావడం విశేషం. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ స్కీంలో అర్హత సాధించినట్టయితే తమ చదువులకయ్యే ఖర్చులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని తెలుసుకున్న విద్యార్థులు తమలోని ఆసక్తిని మరింత పెంపొందించుకున్నారు. ఇందుకు పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయ బృందం దిలీప్ కుమార్, శ్రీనివాస్, ఓలిపాషా, సుధారాణి, సతీష్, సరితా దేవి, మడ్క మధుల నేతృత్వంలోని బృందం ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్ ఇచ్చే ఈ స్కీంలో విద్యార్థులచే దరఖాస్తు చేయించి వారిని ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చామని మహదేవపూర్ పాఠశాల టీచర్ మడ్క మధు తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన ఎల్జిబిలిటీ ఎగ్జామ్స్ లో తమ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఎంపిక కావాలన్న లక్ష్యంతో ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. దీంతో మహదేవపూర్ గర్ల్స్ హై స్కులో లో చదువుతున్న ఐదుగురు, బాయ్స్ హైస్కూల్ లో చదువుకుంటున్న ఒక విద్యార్థి ఎంపికయ్యారన్నారు. వీరికి నాలుగు సంవత్సరాల పాటు ఏడాదికి రూ. 12 వేల చొప్పున స్కాలర్ షిప్ వస్తుందని మధు వివరించారు. ఇలాంటి పథకాలకు సంబంధించిన అర్హత పరీక్షల్లో విద్యార్థులు తరుచూ పాల్గొనే విధంగా చొరవ తీసుకోవడం వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరగడంతో పాటు కాంపిటిటీవ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావడం ఎలా అన్న అంశంపై కూడా ప్రాక్టికల్ గా అవగాహన రానుంది. స్కాలర్ షిప్ రావడం వల్ల ఆయా కుటుంబాలపై విద్యార్థుల చదువుకు సంబంధించిన ఆర్థిక భారం కూడా కొంతమేర తగ్గనుంది. మహదేవపూర్ గర్ల్స్ హై స్కూల్ కు చెందిన వారిలో చిటికేశి అన్విత, రింషా, రిత్విక, విష్ణు ప్రియ, పావనిలు ఎంపిక కాగా, బాయ్స్ హైస్కూలుకు చెందిన అరెందల రాజశేఖర్ ఎంపింకయ్యారని టీచర్ మధు వివరించారు. తాడిచర్ల, కాటారం, మహాముత్తారం మండలాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ స్కీం కింద ఎంపిక కావడం గమనార్హం. మారుమూల ప్రాంతంగా ముద్ర పడిపోయిన తూర్పు డివిజన్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమలోని ప్రతిభా పాటవాలకు పదును పెడుతున్న తీరుపై స్థానికంగా ఆనందం వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయి స్కాలర్ షిప్స్ కు తమ పాఠశాల విద్యార్థులు జిల్లాలోనే ఎక్కువ మంది ఎంపిక కావడం పట్ల మహదేవపూర్ గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సరిత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అలాగే స్టూడెంట్స్ ను వెన్నుతట్టి ప్రోత్సహించిన ఉపాధ్యాయ బృందాన్ని హెడ్ మాస్టర్ సరిత అభినంధించి, ఇలాంటి ఫలితాలను మరిన్ని రాబట్టేవిధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.