దిశ దశ, దండకారణ్యం:
ఎగువ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వస్తున్న వరద ఉధృతి నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలు హై అలెర్ట్ గా ఉన్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలో పోలీసు బలగాలతో పాటు రెస్య్క ఆపరేషన్స్ కోసం స్పెషల్ ఫోర్స్ ను కూడా మోహరించారు అధికారులు. సిరొంచ తాలుకా మీదుగా ఓ వైపున ప్రాణహిత, మరోవైపు గోదావరి, దిగువన ఇంద్రావతి నదులు ప్రవహిస్తున్నాయి. మరట్వాడ, విధర్భ ఏరియాల్లో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా దిగువ ప్రాంతాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపున తెలంగాణాలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి నదిలో వరద నీరు పోటెత్తుతోంది. దీంతో పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండేందుకు గడ్చిరోలి జిల్లా యంత్రాంగం ప్రత్యేక బృందాలను సిరొంచ తాలుకాలో మోహరించింది. తాలుకాలోని సిరొంచ ఛోట బజార్, సూర్యరావుపల్లి, నగరం, చింతలపల్లి, రామకృష్ణాపూర్, జానంపల్లి, మేడిగుంట, మూగాపూర్, మృదుక్ఫష్ణాపూర్, పెంటిపాక, అరడ, ఆయపేట, తూమ్నూర్ మాల్, చింతరేవుల, నడికుడ, అంకీస, ఆసరెల్లి, ముట్టాపూర్ మాల్, సోమన్ పల్లి, పెండాయాలయ, రాయగూడెం, సోమ్నూర్ జూనా తదితర గ్రామాల్లో హె అలెర్ట్ ప్రకటించారు. ఆయా గ్రామాల్లో వివిధ శాఖల అధికార యంత్రాంగం కూడా పరిస్థితులను సమీక్షిస్తూ బాధిత గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే పనిలో నిమగ్నం అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ నుండి 13 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండడంతో సిరొంచ జగ్దల్ పూర్ నేషనల్ హైవే సమీపంలోని వరద నీరు వచ్చి చేరింది. దీంతో పరివాహక గ్రామాల్లోని పంట భూములు మునకకు గురయ్యాయి. మరో వైపున మేడిగడ్డకు ఎగువన ఉన్న పలు గ్రామాల్లోని భూములు బ్యాక్ వాటర్ లో ముంపునకు గురయ్యాయి. ఈ నేఫథ్యంలో వరద ఉధృతి మరింత తీవ్రతరం అయితే ప్రాణ నష్టం వాటిల్ల కుండా ఉండేందుకు రెస్క్యూ ఆపరేషన్ టీమ్స్ ను కూడా సిద్దంగా ఉంచింది. గురువారం నుండే స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాయి.