పది రోజుల్లో పరిహారం ఇస్తాం…

అదనంగా ముంపునకు గురవుతున్న భూములకు న్యాయం చేస్తాం

మేడిగడ్డ బాధితులకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ హామీ

దిశ దశ, దండకారణ్యం:

మేడిగడ్డ బ్యారేజీ బాధితులకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తీపి కబురు అందించారు. పది రోజుల్లో నోటిఫై చేసిన భూములకు రావల్సిన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గడ్చిరోలి జిల్లా ఇంఛార్జి మంత్రి కూడా అయిన ఫడ్నవిస్ మంగళవారం జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ విషయం తెలుసుకున్న సిరొంచ తాలుకా మేడిగడ్డ బ్యారేజ్ బాధిత రైతులు గడ్చిరోలిలో డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ను కలిసి వినతి పత్రం అందించారు. తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం కోసం మొదటి విడుతలో సేకరించిన భూమిలో 128 హెక్టార్ల భూమికి సంబంధించిన పరిహారం నేటికీ తమకు అందలేదని రైతులు వివరించారు. గతంలో నాగపూర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పుడు కలిసి విన్నవించినప్పుడు కూడా పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ తరువాత సిరొంచ తహసీల్దార్ తమతో ప్రత్యేకంగా సమవేశమై వివరాలు సేకరించి జిల్లా అధికారులకు నివేదిక ఇచ్చారన్నారు. ఈ మేరకు గడ్చిరోలి కలెక్టర్ కూడా తమతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని చెప్పారన్నారు. అయితే పరిహారం అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ స్పందించడం లేదని అధికారులు చెప్తున్నారని కూడా డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ కు బాధిత రైతులు తెలిపారు. గతంలో డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీ మేరకు తాము చేపట్టిన నిరవధిక నిరసనలను కూడా నిలిపివేశామని, నేటికి తమకు మాత్రం పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వినతి పత్రం కూడా ఫడ్నవిస్ కు అందించగా ఆయన సానుకూలంగా స్పందించారు. పది రోజుల్లో నోటిఫై అయిన పరిహారం తాలుకు డబ్బులు రైతులకు అందేవిధంగా చొరవ తీసుకుంటామని, తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసే వరకు చూడకుండా తమ ప్రభుత్వమే ఇందుకు అవసరమైన చర్యలు చేపడుతుందని వివరించారని మేడిగడ్డ బాధిత రైతులు తెలిపారు. అయితే నోటిఫై చేసిన భూములకు కాకుండా అదనంగా కూడా భూములు ముంపునకు గురవుతున్నాయని ఇందుకు సంబంధించిన సర్వేలు జరిపి బాధిత రైతులకు కూడా పరిహారాం ఇప్పించాలని బాధిత రైతులు వేడుకున్నారు. ఈ వ్యవహారంపై కూడా తనకు నివేదికలు పంపించాలని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ గడ్చిరోలి కలెక్టర్ ను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సేకరిస్తామని కలెక్టర్ సిరొంచ రైతులకు హామీ ఇచ్చారు.

You cannot copy content of this page