దేవి నవరాత్రోత్సవాలకు ముస్తాబు…

శ్రీ మహాశక్తి ఆలయంలో ఘనంగా ఏర్పాట్లు

దిశ దశ, కరీంనగర్:

విజయ దశమి పర్వదినం పురస్కరించుకుని నిర్వహించనున్న దేవి నవరాత్రోత్సవాలు జరిపేందుకు ఉత్సవ కమిటీలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా అమ్మవారికి పూజలు చేసేందుకు నిర్వహాకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ క్షేత్రాలలో కూడా నవరాత్రోత్సవాల సందర్భంగా చండి హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కరీంనగర్ లో…

కరీంనగర్ లోని ముగ్గురు అమ్మవార్లు వెలిసిన శ్రీ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 15 ఆదివారం నుండి 23వ తేది సోమవారం వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతి రోజు రాత్రి 9 గంటల నుండి దాండియా కార్యక్రమం కూడా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. 20వ తేదిన మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారి పల్లకి సేవ, 22న సద్దుల బతుకమ్మ, 23న విజయదశమి కార్యక్రమాలు ప్రత్యేకంగా చేయనున్నారు. రోజూ రాత్రి 7 గంటల నుండి శ్రీమద్భాగవత ప్రవచనాలు చేయనున్నారు. నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ మహాశక్తి ఆలయంలోని శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహా సరస్వతి అమ్మవార్లు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చేవిధంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపుతులు, శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వాముల ఆశీస్సులతో దేవి నవరాత్రోత్సవాలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని నిర్వహాకులు తెలిపారు.

వివిధ రూపాలలో…

తొమ్మిది రోజుల పాటు అమ్మవార్లు భక్తులకు వివిధ రూపాలలో దర్శనం ఇవ్వనున్నారు. 15 ఆదివారం శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి (శైలపుత్రి) అవతారంలో దర్శనం ఇవ్వనుండగా నవరాత్రి తొలిరోజున స్వస్తి పుణ్యహవాచనం, గణపతి పూజ, మాతృకపూజ, నాంది, ఆంకురారోపణము, అఖండ దీపారాధనము, సర్వతోబధ్రమండలం, అమ్మవారికి ప్రతిరోజూ చతుషష్టి ఉపచారపూజ, మంత్రపుష్పము, సాయంత్రం 6 గం.లకు శ్రీ మహాదుర్గా అమ్మవారికి ఫలపంచామృత అభిషేక కార్యక్రమాలు జరుపుతారు. 16 సోమవారం శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిని) అవతారంలో కనిపించనుండగా అమ్మవారికి పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేస్తారు.
సాయంత్రం 6 గం.లకు లింగార్చన కార్యక్రమం చేపడతారు. 17 మంగళవారం శ్రీ అన్నపూర్ణ దేవి (చంద్ర ఘంట) అవతారంలో దర్శనం ఇవ్వనుండగా శాకాంబరీ అలంకరణ చేస్తారు. సాయంత్రం 6 గం.లకు సుహాసినులచే సామూహిక కుంకుమ పూజలు, కేబీ శర్మ బృందంతో భక్తి సంగీత విభావరి నిర్వహిస్తారు. 18 బుధవారం రోజున శ్రీ మహాలక్ష్మి దేవి (కూష్మాండ ) అవతారంతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. చీరలతో అలంకరణ చేయడం, సాయంత్రం 6 గం.లకు సౌందర్య లహరి, కనకధార స్తోత్ర పారాయణం చేస్తారు. 19 గురువారం శ్రీ మహాచండీ దేవి (స్కంద మాత) అవతారం – పండ్లతో అలంకరణ చేయనున్నారు. సాయంత్రం 6 గం.లకు చందనాభిషేక కార్యక్రమం చేస్తారు. 20 శుక్రవారం మూలా నక్షత్రం పురస్కరించుకుని శ్రీ సరస్వతి దేవి (కాత్యాయని) అవతారంలో దర్శనం ఇస్తారు. సాయంత్రం 6 గం.లకు విద్యార్థులచే సరస్వతీ పూజ, పల్లకి సేవ, శ్రీ రతన్ కుమార్ శిష్య బృందంచే శాస్త్రీయ నృత్య కార్యక్రమాలు ఉంటాయి. 21 శనివారం 8 గం.లకు శ్రీ లలితాదేవి (కాళరాత్రి) అవతారం, గాజులతో అలంకరణ చేస్తారు. సాయంత్రం 6 గం.లకు లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం ఉంటుంది. 22వ తేదీ ఆదివారం దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవి (మహాగౌరీ) అవతారం, రుద్రసహిత చండీ హోమం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గం.లకు అమ్మవారి సన్నిధిలో బతుకమ్మ పూజలు చేయనున్నారు. 23 సోమవారం విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. మహిషాసురమర్ధిని దేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవి (సిద్ధి రాత్రి) అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శమీ పూజ, వాహన పూజలు, సాయంత్రం 6 గం.లకు మహిషాసురమర్ధిని పూజలు నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో ప్రతిరోజు సాయంత్రం 7 గం.ల నుండి బ్రహ్మశ్రీ డా.గర్రెపల్లి మహేశ్వర శర్మ గారిచే శ్రీమద్భాగవత ప్రవచన కార్యక్రమం, రోజూ రాత్రి 9 గం.ల నుండి అమ్మవారి సన్నిధిలో దాండియా కార్యక్రమం నిర్వహిస్తారు. అమ్మవారి మాలాధారణ చేసుకునేందుకు వచ్చే భక్తుల కోసం, నవరాత్రోత్సవాల కోసం తరలివచ్చె భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారి దర్శనం సర్వ కష్ట నివారణం, మహాపుణ్యదాయకం అయినందున భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

You cannot copy content of this page