ప్రమాదం లేదు సరే… సమస్యలు రావడానికి కారణం ఏంటీ..?

మెయింటనెన్స్ కంపెనీ బాధ్యతే అయినా…

జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయినట్టా… కదా..

దిశ దశ, భూపాలపల్లి:

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎదరవుతున్న సమస్యలపై అధికారులు ఇస్తున్న వివరణలు అత్యంత విచిత్రంగా ఉంటున్నాయా…? రోజుకొకటిగా వెలుగులోకి వస్తున్న అంశాల విషయంలో ఇంజనీర్లు చెప్తున్న తీరు వాస్తవాలకు దగ్గరగా ఉంటున్నాయా..? అసలు కాళేశ్వరం లోపాల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై జరుగుతున్న చర్చ ఏంటో తెలుసా..?

నాటి నుండి నేటి వరకు…

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం అయిన తరువాత ఎదురయిన ప్రతి సమస్యను అధిగమించేందుకు మెయింటనెన్స్ ఆ కంపెనీలదే అని చెప్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. గతంలో భారీగా వచ్చిన వరదల వల్ల కన్నెపల్లి, సిరిపురం పంప్ హౌజ్ లో నీట మునిగిపోయాయి. ప్రొటెక్షన్ వాల్ కూడా కూలిపోయినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో అప్పుడు అధికారులు ఊహించని విధంగా క్రౌడ్ బ్రస్ట్ జరిగడంతో మోటార్లు వరదల్లో మునిగిపోయాయని దీని మెయింటనెన్స్ అంతా కూడా ఏజెన్సీ చూసుకుంటుందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారం ఏమీ లేదని అధికారులు ప్రకటించారు. ఇటీవల కాళేశ్వరానికి ఆయువు పట్టుగా నిలిచే మేడిగడ్డ బ్యారేజ్ లో పిల్లర్ కుంగిపోవడం దాని ప్రభావం ఇతర పిల్లర్లపై పడడం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కూడా ఎల్ అండ్ టి కంపెనీ ప్రతినిధులను కూడా రంగంలోకి దింపిన ఇరిగేషన్ అధికారులు ఈ బ్యారేజ్ కాంట్రాక్ట్ తమదే అయినందున తామే బాగు చేయిస్తామని చెప్పించారు. తాజాగా అన్నారం బ్యారేజీ గేట్లకు దిగువ భాగాన పడిన బుంగ విషయంలో కూడా ఈ బ్యారేజ్ కాంట్రాక్టు తీసుకున్న కంపెనీ అఫ్కాన్స్ కంపెనీ అని మెయింటనెన్స్ చేసే బాధ్యత ఆ కంపెనీపైనే ఉంటుందని ఈఈ యాదగిరి పేరిట ఓ ప్రకటన వెలువడింది.

మెయింటనెన్స్ ముఖ్యమా..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్న తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సాధారణంగా ఇంజనీరింగ్ విభాగం నుండి పని చేపట్టినప్పుడు ఎస్టిమేట్స్ తో పాటు అక్కడి భూ పరీక్షలు చేయించడంతో నిర్మాణం సమయంలోనే జాగ్రత్తలు తీసుకుని భవిష్యత్తులో ఎలాంటి డ్యామేజీ కాకుండా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. కాంట్రాక్టు కంపెనీ ఏ స్థాయిలో ఉన్న ఇందుకు సంబంధించిన పనులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం తరుపున ఇంజనీర్లు అప్రూవల్ చేస్తుంటారు. ఇందుకోసం గ్రౌండ్ లెవల్లో విజిట్ చేసే వర్క్ ఇన్స్ పెక్టర్ నుండి ఈఎన్సీ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే స్టేజ్ వైజ్ వర్క్ అప్రూవల్ జరగాల్సి ఉంటుంది. అంతేకాకుండా క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ డిపార్ట్ మెంట్స్ కూడా ఈ విషయంలో రంగంలోకి దిగి నిబంధనల మేరకు పనులు జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షిస్తాయి. కాంట్రాక్టు కంపెనీ నిర్మాణంలో తప్పిదాలు చేసినట్టయితే ఇందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని కూడా అగ్రిమెంట్లలో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటుంది. ఇన్ని రకాల కఠినమైన అంశాలు దాటుకున్న తరువాతే సదరు కాంట్రాక్టు పనులకు ఫైనల్ ఆమోదం తెలుపుతారు. అయితే కాళేశ్వరంలో లోపాలు వెలుగులోకి వచ్చిన ప్రతిసారి మెయింటనెన్స్ కాంట్రాక్టు కంపెనీదే కాబట్టి ఆ కంపెనీయే బాధ్యత వహిస్తుందని, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడడం లేదన్న అభిప్రాయాలను పరోక్షంగా వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

అంతవరకూ బాగానే…

అయితే మెయింటనెన్స్ అంశం వరకు బాగానే ఉన్నా నిర్మాణంలో జరిగిన తప్పిదాలు లేవని యాధృచ్ఛికంగా జరిగినవేనన్న రీతిలో ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు కూడా. కాంట్రాక్ట్ కంపెనీ నిర్మాణంలో నిబంధనల మేరకు పనలు చేసినట్టయితో కొత్తగా ఎదురవుతున్న సమస్యలకు ఎందుకు బాధ్యత తీసుకుంటుందన్నదే అంతుచిక్కకుండా పోతోంది. అలాగే నిర్మాణాలన్ని సజావుగా సాగాయని సంబంధిత విభాగాల అధికారులు సర్టిఫై చేసిన తరువాతే ప్రాజెక్టు ప్రారంభించాల్సి ఉంటుందన్నది వాస్తవం. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం అధికారులు వెనకాముందు చూసుకోకుండా ఓకె చెప్పేశారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. నిరంతరం నీటి ప్రవాహం ఉండే నదుల్లో నిర్మాణాలు చేపట్టేప్పుడు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తరువాత కన్సట్రక్షన్స్ జరుగుతాయని అలాంటప్పుడు ఓ చోటో మోటర్లు మునిగిపోవడం, మరో చోట పిల్లర్ కుంగి పోవడం, ఇంకో చోట బుంగ పడడం వంటి సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయన్నదే మిస్టరీగా మారింది.

You cannot copy content of this page