మల్కాన్ గిరి TO టీఎస్… ఎంఎస్

మల్కాన్ గిరి TO టీఎస్… ఎంఎస్

అన్నల ఇలాకాలో గంజాయి ఘాటు

పొరుగు రాష్ట్రాలకు స్మగ్లింగ్

దిశ దశ, స్పెషల్ కరస్పాండెంట్:

మావోయిస్టుల ఇలాకాలో గంజాయి ఘాటు మత్తెక్కిస్తోంది. అన్నల మాటున గంజాయి సాగు తీవ్రంగా సాగుతోంది. తాజాగా వెలుగులోకి వస్తున్న ఘటనలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

ప్రాబల్య ప్రాంతాలే…

మూడు దశాబ్దాల కాలంగా గంజాయి సాగవుతున్న ప్రాంతాలను గమనిస్తే అవన్ని కూడా నక్సల్స్ ప్రభావితంగా ఉన్నవే కావడం గమనార్హం. తాజాగా ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా కూడా మావోయిస్టుల ఇలాకా కావడం గమనార్హం. గతంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విపరీతంగా గంజాయి సాగు అవుతుండేది. కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని మారుమూల పల్లెల్లో గంజాయి సాగు విపరీతంగా సాగేది. ఇప్పుడు కూడా మావోయిస్టుల ప్రభావం ఉన్న ఒడిశా, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో గంజాయి సాగవుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఒడిశా పల్లెల్లో సాగవుతున్న ఈ గంజాయిని దేశంలోని వివిధ రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలకు చెందిన వేలాది మంది గంజాయి సాగు, స్మగ్లింగ్ ప్రధాన ఆదాయ వనరుగా ఏర్పర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల తెలంగాణలోని పలు జిల్లాల్లో పట్టబడ్డ గంజాయి ముఠాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు. ఆయా ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ అంతగా లేకపోవడం, మావోయిస్టుల ప్రాబల్యం కారణంగా పోలీసుల గస్తీ తక్కువగా ఉండడంతో కొంతమంది గంజాయి సాగు వైపు ఆకర్షితులు అయిపోయినట్టుగా తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం నామమాత్రంగా ఉన్న గంజాయి సాగు నేడు ప్రధాన పంటగా కొన్ని గ్రామాల్లో సాగవుతుందంటే అక్కడి పరిస్థితులు ఎలా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు.

యువత బలి…

ఒడిశాలోని మల్కాన్ గిరి ప్రాంతంలో పండిస్తున్న గంజాయి తెలంగాణ, మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాలకు స్మగ్లింగ్ అవుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులు గంజాయి కిక్కెంచేందుకు యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని పల్లెలతో పాటు ప్రధాన నగరాలకు కూడా గంజాయి తరలిస్తున్నారు. దీంతో గంజాయి అమ్మకాలు అనుమతి ఉన్న వ్యాపారాన్ని మరిపిస్తున్నాయి. సిగరెట్లతో పాటు వివిధ రకాలుగా గంజాయి అమ్మకాలు చేస్తున్నారు. దీని మత్తు మాయలో పడ్డ యువత తమ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటోంది.

You cannot copy content of this page