మామ్నూరు ఎయిర్ పోర్టు ఏర్పాటు సాధ్యమేనా..?

క్లియరెన్స్ ఇస్తేనే సరిపోతుందా..?

సమస్యలను పరిష్కరించడం ఎలా..?

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రంలో రెండో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు అవాంతరాలు అదిగమించినట్టయింది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఎయిర్ పోర్టును ఏర్పాటు చేసేందుకు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మార్గం సుగమం అయినట్టే కనిపిస్తోంది. అయితే ప్రతక్ష్యంగా ఎదురయ్యే సవాళ్లు అధిగమించడం ఎలా అన్నదే అసలు సమస్యగా మారింది. సుమారు 690 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎయిర్ పోర్టును అభివృద్ది చేయాలంటే మరో 250 ఎకరాలకు పైగా భూమి అవసరం పడే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న రన్ వేలు 1800 మీటర్ల పొడవు మాత్రమే ఉండగా వాటిని 2800 మీటర్ల వరకు విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి కింజారపు రాంమోహన్ నాయుడు వెల్లడించారు. దీంతో ఇప్పుడున్న స్థలానికి అదనంగా భూమి అవసరం అని ఇందుకు సంబంధించిన భూ సేకరణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ ఆథారిటీకి అప్పగించాల్సి ఉంటుంది.

1200 ఎకరాలు…

మామ్నూరు బెటాలియన్ సమీపంలో ఉన్న ఈ ఎయిర్ పోర్టు గతంలో 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని తెలుస్తోంది. అయితే విమానయాన సేవలు లేకపోవడంతో క్రమక్రమంగా దురక్రామణకు గురైందని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్వే చేయిస్తే 694 ఎకరాల మేర భూమి మాత్రమే ఉందని తేలింది. దీంతో అప్పటికప్పుడు ఉన్న భూమిని కాపాడేందుకు రక్షణ చర్యలు చేపట్టారు. గతంలో వరంగల్ నగరానికి శివారు ప్రాంతంగా ఉన్న మామ్నూరు ఎయిర్ పోర్టు స్థలం చుట్టూ జనవాసాలు పెరిగిపోయాయి. ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఎయిర్ పోర్టు రన్ వేకు కొద్ది దూరంలోనే కూడా లేఅవుట్ చేసి విక్రయించిన వెంచర్లతో పాటు, గాడిపల్లి, నక్కపల్లి, గుంటూరు పల్లిలకు చెందిన భూములను సేకరించాల్సి ఉంది. ఇటీవల అధికారులు గాడిపల్లి, నక్కపల్లి, గుంటూరుపల్లికి చెందిన 233 మంది భూములు ఉన్నాయని వారికి పునరావాసం కల్పించాల్సి ఉందని నిర్దారించారు. ఈ సందర్బంగా భూమికి భూమి ప్రత్యామ్నాయంగా ఇస్తామని చెప్పడంతో నిరాశ్రయులు సమ్మతించినప్పటికీ ఆ తరువాత ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లిస్తామనడంతో వారు భూ సేకరణకు సమ్మతించేది లేదని తేల్చి చెప్పారు. మామ్నూరు ఎయిర్ పోర్టును విస్తరించేందుకు అత్యంత కీలకమైన ఘట్టం భూసేకరణ కాగా ఈ ప్రాంతం అంతా కూడా గ్రేటర్ వరంగల్ పరిధిలో కలిసిపోయింది. సమీప గ్రామాల్లో వెంచర్లు కూడా వెలవడంతో వ్యవసాయ భూములతో పాటు కమర్షియల్ ప్లాట్లుగా మారిపోయాయి. దీంతో పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కెటాయించిన రూ. 205 కోట్లు సరిపోయే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. మరిన్ని నిధులు కెటాయించాల్సి ఉన్నప్పటికీ వ్యవసాయ భూములకు ఇచ్చే పరిహారం కంటే నివేశన స్థలాలు, నిర్మాణాలకు సంబంధించిన పరిహారం చాలా ఎక్కువ కానుంది. ఇందుకు సంబంధించి భారీగా నిధులు కెటాయించాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

గతంలో…

ఉమ్మడి రాష్ట్రంలో పలుచోట్ల ఎయిర్ పోర్టుల నిర్మాణం చేసేందుకు ఎయిర్ పోర్టు అథారిటీ , రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎంఓయూ జరగగా, మామ్నూరు వద్ద సర్వే కోసం రూ. 6 కోట్లు కేంద్రం కెటాయించగా ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ ఎయిర్ పోర్టుల వద్ద మౌళిక సదూపాయాలు కల్పించందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ. 59 కోట్లు కూడా వెచ్చించింది. అయితే ఈ సమయంలో మామ్నూరు ఎయిర్ పోర్టు వద్ద మాత్రం మౌళిక వసతుల కల్పన అంశం మరుగున పడిపోయింది. 2020లో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మామ్నూరు పోర్టు గురించి సర్వే చేశారు. రన్ వే పనితీరు, ఎయిర్ పోర్టు విస్తీర్థణం తదితర అంశాలపై నిపుణులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఫిజుబులిటీ ఎంతమేర ఉంది అన్న విషయంపై జరగిన సర్వే రిపోర్టును అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మామ్నూరు ఎయిర్ పోర్టు ఫస్ట్ గ్రేడ్ లో లేదన్న ప్రచారం జరిగింది కానీ అధికారికంగా మాత్రం ఎవరూ ప్రకటించలేదు. స్వరాష్ట్రం వచ్చిన తరువాత ఉడాన్ స్కీం కింద మామ్నూరును చేర్చాలని కోరుతూ కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర మంత్రికి వినతి చేశారు. అయితే ఇందుకు సంబంధించిన డీపీఆర్ ఇవ్వాలని కేంద్రం అడిగగా ఇందుకు సంబంధించిన ప్రక్రియ అర్థాంతరంగా ఆగిపోయింది. 2002లో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం మామ్నూరు ఎయిర్ పోర్టును ఉడాన్ స్కీంలో చేర్చాలని వినతి చేయగా జీఎంఆర్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 150 కిలో మీటర్ల దూరం వరకు ఎయిర్ పోర్టుల నిర్మాణం చేపట్టరాదని ఒప్పందం ఉందని మామ్నూరులో విమానాశ్రయం కట్టవద్దని తేల్చి చెప్పింది. ట్రైపార్టీ ఒప్పందం మేరకు కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటు సరికాదని జీఎంఆర్ ప్రతినిధులు అభ్యంతరం తెలపడంతో తెలంగాణలో రెండో ఎయిర్ పోర్టు నిర్మాణం చేయాలన్న ప్రతిపాదనలకు బ్రేకులు పడ్డాయి. 5.2 క్లాజ్ మినహాయింపు ఇవ్వాలని తాజాగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం జీఎంఆర్ ముందు ప్రతిపాదన పెట్టగా ఇందుకు సమ్మతించింది. దీంతో జీఎంఆర్ సంస్థ నిర్ణయానికి సంబంధించిన డాక్యూమెంట్లు విమానయాన శాఖకు చేరాయి. ఎయిర్ పోర్ట్ అథారిటీ కూడా ఇందుకు సమ్మతిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపడంతో కేంద్రం ఇందుకు మామ్నూరు ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజగా తీసుకున్న నిర్ణయంతో మామ్నూరు ఎయిర్ పోర్టుకు మోక్షం కలిగినప్పటికీ భూ సేకరణ అంశమే సవాల్ గా మారనుంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కెటాయించాల్సిన అవసరం అయితే ఉంటుంది కానీ, 2020లో నిపుణులు ఇచ్చిన ఫిజుబులిటీ సర్టిఫికెట్ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నట్టయితే అసలు విషయం తేలనుంది.

You cannot copy content of this page