మ్యాన్ ఈటర్ టైగర్ పట్టివేత…

దిశ దశ, చంద్రపూర్:

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో గడగడలాడించిన పులి ఎట్టకేలకు పట్టుబడింది. 15 రోజుల్లోనే నలుగురిని బలి తీసుకున్న T83 పెద్దపులిని పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు అటవీ అధికారులు. మూడేళ్లలో 11 మందిని హతమార్చిన ఈ పులిని పట్టుకునేందుకు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. తాడోబా అటవీ ప్రాంతంలోని ముల్ పరిధిలోని అంధారి టైగర్ రిజర్వ్ (TATR) ఏరియాలోని వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది టీ83 పెద్దపులి. మ్యాన్ ఈటర్ గా మారిపోయిన ఈ పులి ఆచూకి లభ్యం అయ్యేందుకు డ్రోన్ కెమరాలను వినియోగించారు. ప్రముఖ షూటర్ అజయ్ గన్ సాయంతో మత్తు మందు ఇవ్వడంతో సృహ కోల్పోయిన ఈ పులిని బోనులో బంధించారు. దీనిని చంద్రపూర్ లోని టైగర్ కేర్ సెంటర్ కు తరలించేందుకు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు.

అత్యంత అరుదే…

అయితే కీకారణ్యాల్లో తిరిగే పెద్ద పులులు అనగానే సాధారణ మనషులు భయంతో కంపించిపోతుంటారు. కానీ వాస్తవంగా పెద్ద పులులు మనుషులను వేటాడేందుకు సాహసించవన నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా అడవుల్లో సంచరించే వన్యప్రాణులన్ని కూడా నాలుగు కాళ్లతోనే ఉంటాయి దీంతో రెండు కాళ్లతో నడిచే మనుషులను చూసి తమకు సంబంధం లేనివనే భావిస్తుంటాయి. దీంతో అడవుల్లో తిరిగే వారిని పెద్ద పులి చాలా సార్లు చూసినా అది ఏమీ చేయదని, నాలుగు కాళ్ల జంతువుల కోసం మాత్రమే అన్వేషిస్తాయని వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు కూడా పదే పదే చెప్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో తన ప్రాణాల మీదకు వస్తుందని భావించినప్పుడు మాత్రమే పెద్దపులి మనిషిపై దాడి చేస్తుందని అంచనా వేస్తున్నారు. తాడోబా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న టీ83 పెద్ద పులి కూడా మూడేళ్ల క్రితం మొదటి సారి మనిషిని హతం చేసిన తరువాత మ్యాన్ ఈటర్ గా మారిపోయిందని అంటున్నారు. టీ83 టైగర్ సంచారం గురించి వెలుగులోకి రాగానే తాడోబా ఫారెస్ట్ ఏరియాలో నివసించే వారంతా కూడా భయంతో కంపించిపోయారు. కొంతకాలం తరువాత కనుమరుగై పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అక్కడి జనం. తిరిగి మళ్లీ ఇదే ప్రాంతంలో సంచరిస్తూ నలుగురిని హతం చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం టీ83ని పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాలని ఆదేశించింది. ఇందులో భాగంగా అటవీ అధికారులు, షూటర్ అజయ్ లు అడవుల్లో మ్యాన్ ఈటర్ పులిని ట్రేస్ చేసి పట్టుకోవడంలో సఫలం అయ్యారు.

You cannot copy content of this page