దిశ దశ, న్యూ ఢిల్లీ:
కెనడాలో స్థిరపడ్డ పంజాబీ శుభ్ భారత పర్యటనకు బ్రేకులు పడ్డాయి. ఖలీస్తానీ ఉద్యమానికి అనుకూలంగా పోస్టులు పెట్టడంతో ఆయన టూర్ ను రద్దు చేసుకుంటున్నట్టు బుక్ మై షో ప్రకటించింది. ఆయన షో కోసం టికెట్స్ బుక్ చేసుకున్న వారికి 10 పని దినాల్లో మొత్తం డబ్బును పంపిస్తామని సంస్థ ప్రకటించింది. ఖలీస్తానీ వేర్పాటువాదులను ప్రోత్సహించే విషయంలో కెనడా, భారత్ మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే. మంగళవారం కెనడాలోని భారత దౌత్యవేత్తలను తిప్పి పంపడంతో భారత విదేశాంగ శాఖ కూడా అదే స్థాయిలో కెనడా దౌత్యవేత్తలను తిప్పి పంపించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు చేసిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య విబేధాలు మొదలయ్యాయి. తాజాగా ఈ నెల 23 నుండి 25న ముంబైలో జరిగే క్రూయిజ్ కంట్రోల్ ఈవెంట్ లో కెనడాలో స్థిరపడ్డ పంజాబీ సింగర్ శుభనీత్ హాజరు కావల్సి ఉంది. తన ప్రదర్శనలతో అభిమానులను సంపాదించుకున్న శుభ్ ఇటీవల ఖలీస్తాన్ ఉద్యమానికి అనుకూలంగా పోస్టులు పెట్టడంతో ఆయన ప్రోగ్రామ్ ను రద్దు చేసుకుంటున్నట్టు బుక్ మై షో ప్రకటించింది.
కోహ్లీ అన్ ఫాలో…
తన ఫేవరేట్ ఆర్టిస్ట్ శుభ్ అని ప్రకటించిన ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన వైఖరేంటో ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా తేటతెల్లం చేశారు. ఆయన్ని అన్ ఫాలో చేసి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారత దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారి పట్ల తన నైజం ఇదని చేతల్లోనే చూపించారు విరాట్ కోహ్లి. ఈ విషయం తెలుసుకున్న ఇతర క్రికెటర్లు కేఎల్ రాహుల్, హర్థిక్ పాండ్యా, సురేశ్ రైనాతో పాటు పలువురు భారత క్రికెటర్లు విరాట్ కోహ్లి బాటలోనే నడుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభనీత్ పై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తీరు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతర్జాతీయ సింగరే అయినప్పటికీ ఆయన వేర్పాటు వాదులకు అనుకూలంగా ఉన్నాడన్న విషయంలో భారతీయులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శుభ్ నీత్ ను వ్యతిరేకిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.
అలెర్ట్ గా ఉండండి: విదేశాంగ శాఖ
మరోవైపున కెనడాలోని భారతీయ పౌరులను విదేశాంగశాఖ అప్రమత్తం చేసింది. అక్కడ నివసిస్తున్న విద్యార్థులతో పాటు ఇతరులు అంతా కూడా భారత్ వ్యతిరేక కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ద్వేషపూరితమైన ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో కెనడాలోని భారతీయులంతా కూడా ప్రయాణాలు చేసే ప్రాంతాలపై ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుని ముందుకు సాగాలని సూచించింది. అక్కడి భారత్ వ్యతిరేక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలకు వెల్లకుండా ఉండడమే మంచిదని పేర్కొంది. కెనడాలోని భారతీయులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కోరింది.