నిబంధనలకు విరుద్ధంగా లీజ్…
దిశ దశ, హైదరాబాద్:
వడ్డించే వారు మన వాళ్లయితే బంతిలో ఏమూలన కూర్చున్నా లాభమే అన్న నానుడికి అనుగుణంగా నడుస్తోంది.దేవాదాయ శాఖలో తీరు. అత్యంత విలువైన భూములు లీజు పేరిట కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖకు చెందిన సుమారు 15 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చేందుకు అవసరమైన ప్రక్రియ మొదలైనట్టుగా ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాల్లోని మంచిరేవులలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి సుమారు 50 ఎకరాల వరకూ భూములు ఉన్నాయి. ఇందులో చాలా వరకు ఆక్రమణకు గురి అయినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ లో కేసు కూడా విచారణలో ఉంది. అయితే ఈ ఆలయ భూములను లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైలు దేవాదాయ శాఖతో పాటు సంబధిత విభాగాలలో చకాచకా పరుగులు పెడుతున్నట్టు సమాచారం. ఉన్నతాధికారుల క్లియరెన్స్ కోసం సదరు ఫైల్ ఎదురు చూస్తున్నట్టుగా దేవాదాయ శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది.
లీజ్ @ 99 ఏళ్ళు..?
అయితే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ భూములు అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఉండడంతో వాటిని కైవసం చేసుకునేందుకు సరికొత్త ఎత్తుగడలు సాగుతున్నట్టు సమాచారం. సుమారు 15 ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనలు చేస్తూ ఫైల్ సిద్ధమైనట్లు సమాచారం. ట్రిబ్యునల్ లో జరుగుతున్న విచారణ అంశానికి కూడా పుల్ స్టాప్ పెట్టించేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు సమాచారం. గుట్టు చప్పుడు కాకుండా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ భూముల లీజు ప్రక్రియకు సంబంధించిన ఫైల్ ను క్లియర్ చేయించాలన్న పనిలో ప్రముఖులు నిమగ్నం అయినట్టు తెలుస్తోంది.
నిబంధనల మేరకేనా?
అయితే దేవాదాయ శాఖ భూములు లీజుకు ఇచ్చేందుకు నిబంధనలు అనుకూలిస్తాయా లేదా అన్న విషయంపై అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకే సారి 99 ఏళ్ల పాటు భూములు లీజుకు ఇవ్వడం సరికాదని అంటున్న వారే ఎక్కువ. సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ భూములు లీజుకు ఇచ్చేందుకు సంబంధించిన ఫైల్ తయారయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపున 99 ఏళ్ల లీజు విధానం ఆమోదించేందుకు ప్రభుత్వ నిబంధనలు కూడా అనుకూలించవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వందల కోట్లు?
రూ. వందల కోట్ల విలువ చేసే ఈ భూములను లీజు పేరిట 99 ఏళ్ళు ఇవ్వాలన్న యోచనకు రావడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. అత్యంత డిమాండ్ ఉన్న ఏరియాలో, ప్రధాన రహదారి సమీపంలో ఈ భూములు ఉండడంతో సీక్రెట్ గా లీజ్ ఫైల్ కు మోక్షం కల్గించేందుకు పావులు కదులుతున్నట్టు సమాచారం. ఓపెన్ బిడ్డింగ్ కు నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చే అవకాశం ఉన్నందునే సీక్రసీ మెయింటెన్ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.