మంచిర్యాల జిల్లాలో నకిలీ నక్సల్స్ కలకలం

అరెస్ట్ చేసిన పోలీసులు

దిశ దశ, మంచిర్యాల:

ఎయిర్ గన్స్ చూపిస్తూ నక్సలైట్లమని చెప్తూ బెదింరింపులకు గురి చేస్తున్న వారిని రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ రెమా రాజేశ్వరీ వివరాలను వెల్లడించారు. జిల్లాలోని సీసీసీ నస్పూర్ స్టేషన్ పరిధిలో నక్సల్స్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గురువారం అరెస్ట్ చేశామని తెలిపారు. లక్షెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన మేడి వెంకటేష్ (26), పెద్దంపేటకు చెందిన ఆరెందుల రాజేష్ (31)లు చిన్నప్పటి నుండి స్నేహితులు కాగా కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీరద్దరు కలిసి సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో నక్సల్స్ పేరిట బెదిరింపులకు పాల్పడాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ లో రెండు ఎయిర్ గన్స్ కొనుగోలు చేసుకొచ్చిన వీరు ఫిబ్రవరి 21వ తేది నస్పూర్ కాంతయ్య ఇంటి వద్ద రెక్కి నిర్వహించారు. అర్థరాత్రి సమయంలో కాంతయ్య ఇంటి ఆవరణలో తుపాకులు దాచిపెట్టి మరు నాడు రాజేష్, వెంకటేష్ లు కాంతయ్య, అతని కొడుకు నాగరాజులకు ఫోన్ చేసి తిర్యాణి అడవుల నుండి నక్సలైట్లం మాట్లాడుతున్నామని మీ ఇంటి ఆవరణలో తుపాకులు పెట్టామని చెప్పారు. రూ. 40 లక్షలు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులందరిని కాల్చి చంపేస్తామంటూ హెచ్చరించారు. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులను పట్టుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో సాంకేతికతతో నిందితులను గుర్తించారు. వారి నుండి రెండు ఎయిర్ గన్స్, పల్సర్ బైక్, ఓ మోబైల్ స్వాధీనం చేసుకున్నారు.

చిక్కుండా స్కెచ్ వేసినా…

పోలీసులు తమను పట్టుకుంటారన్న విషయాన్ని గమనించిన నిందితులు మొదటి నుండి కూడా పకడ్భందీగా వ్యవహరించారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండాలని కొత్త మొబైల్ ఫోన్ సిమ్ కార్డు కొనుగోలు చేశారు. అలాగే వీరు తరుచూ ఫోన్లో మాట్లాడితే కేసు నమోదయినప్పుడు పోలీసులు కూపీ లాగుతారని భావించారు. ఇందుకోసం వీరిద్దరు ఫోన్లలో మాట్లాడుకోవడం మానేసి వ్యక్తిగతంగా కలిసి ప్లాన్ చేసుకుంటు టార్గెట్ల నుండి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితులు వాడిన మొబైల్ ఫోన్ ను ట్రేస్ చేసి గుట్టు రట్టు చేశారు. చట్టానికి చిక్కకుండా జాగ్రత్త పడినప్పటికీ పోలీసులు టెక్నాలజీతో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసు టీంను సీపీ రెమా రాజేశ్వరీ అభినందించారు.

You cannot copy content of this page