దిశ దశ, మంథని:
ప్రారంభ దశలోనే రెండో సారి గడ్డర్లు కుప్ప కూలిపోయాయి. నిర్మాణంలో ఉన్న వంతెనకు చాలినన్ని నిధులు లేకపోవడంతో అర్థాంతరంగా వదిలేశారు. అయితే దీని ఆలనా పాలనా చూడాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడంతో మూడు నెలలు గడవక ముందే మరోసారి వంతెన గడ్డర్లు కూలిపోవడం విస్మయానికి గురి చేస్తోంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు సమీపంలోని మానేరు నదిపై నిర్మించిన వంతెన గడ్డర్లు గాలి దుమారానికి కుప్ప కూలిపోయాయి. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడెడు నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మీుదుగా ప్రవహిస్తున్న మానేరు నదిపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2016లో ఇక్కడ బ్రిడ్జి నిర్మించేందుకు రూ. 49 కోట్లు ప్రభుత్వం కెటాయించింది. అయితే ఈ నిధులు చాలకపోవడంతో అర్థాంతరంగా పనులను నిలిపివేశారు. 9 ఏళ్లుగా వంతెన గురించి పట్టించుకున్న వారే లేకపోవడంతో అదనపు నిధుల కెటాయింపు ప్రక్రియ అటకెక్కింది. గత ఏప్రిల్ 22వ తేది అర్థరాత్రి ఓడెడు గ్రామం వైపునకు ఉన్న వంతెన గడ్డర్లు నాలుగు కూలిపోయాయి. ఈ ఘటన జరిగిన వెంటనే సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి నివేదిక ఉన్నతాధికారులకు పంపించారు. తిరిగి తాజాగా మంగళవారం సాయంత్రం 17, 18వ పిల్లర్ల మధ్యన వేసిన నాలుగు గడ్డర్లు కూలిపోయాయి.
నిర్మాణంలో లోపాలా..?
పట్టుమని పదేళ్లు కాకముందే వంతెన గడ్డర్లు కుప్పకూలిపోవడం వెనక అసలు కారణం ఏంటన్నదే మిస్టరీగా మారింది. నిధులు చాలని కారణంగా వంతెన అసంపూర్తి నిర్మాణంలో వదిలేసినప్పటికీ గడ్డర్లు కూలిపోవడం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతున్నది. ఒక వేళ వంతెన పూర్తయి దాని మీదుగా వాహనాల రాకపోకలు సాగించినట్టయితే ప్రాణ నష్టం సంభవించే అవకాశాలు కూడా ఉండేవన్న ఆందోళన స్థానికంగా వ్యక్తం అవుతోంది. మంథని ప్రాంతం మీదుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేరుకునేందుకు అతి సమీపంలో ఉన్న రహదారి కావడంతో ఓడేడు వంతెన మీదుగా వాహనాల రాకపోకలు కూడా తీవ్రంగా ఉండేవి. ఆ సమయంలో గడ్డర్లు కుప్పకూలిపోయినట్టయితే ఎలాంటి పలితాలను చవి చూడాల్సి వచ్చేదో అర్థం చేసుకోవచ్చు. గడ్డర్ల నిర్మాణంలో వాడిన మెటిరియల్ క్వాలిటీ లేకపోవడం వల్ల అవి కుప్ప కూలిపోయాయా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీయాల్సి ఉంది. ఒక వేళ నిర్మాణ స్థలం ఎంపికలో తప్పిదాలు జరిగడం వల్లే గడ్డర్లు కూలిపోయాయని భావించినట్టయితే వంతెన పిల్లర్లు కూడా దిగువకు జారీ పోయే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే వంతెన నిర్మించ తలపెట్టిన ప్రాంతం సరైంది కాదన్నట్టయితే నిపుణులు అక్కడ నిర్మాణానికి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న విషయం తేలాల్సి ఉంది. గడ్డర్లు వేసేందుకు ఉపయోగించిన స్టీల్, సిమెంట్, కాంక్రీట్ విషయంలోనే తప్పిదాలు జరిగి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏప్రిలో 22న గడ్డర్లు కూలిపోయిన సంఘటనపై అధికారులు క్షేత్ర స్థాయిలో జరిపిన విచారణలో తేలిన అంశాన్ని బట్టి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.