మానేరు రివర్ ఫ్రంట్… ఎన్జీటీ స్టే కొనసాగింపు…

దిశ దశ, కరీంనగర్:

మానేరు రివర్ ఫ్రంట్ ద్వారా కరీంనగరానికి పర్యాటక శోభ తీసుక రావాలన్న ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. రివర్ ఫ్రంట్ పేరిట చేపడుతున్న నిర్మాణాలు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్టే విధించింది. తిరిగి ఈ నెల 18న మరోసారి విచారించిన ఎన్జీటీ చెన్నై బెంచ్ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులు నివేదికలు ఇవ్వనందున డిసెంబర్ 2కు వాయిదా వేసింది. అయితే స్టే యాథావిధిగా కొనసాగిస్తున్నామని, స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశించింది.

టీఎస్టీడీసీ ఇచ్చిన నివేదిక ఇలా…

మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణానికి ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ లేదని ఎం వెంకటరెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించారు. ఈ మేరకు విచారించిన ఎన్జీటీ సంబంధిత విభాగాల అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ (TSTDC) ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. కార్పోరేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం… మానేరు రివర్ ఫ్రంట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం నాలుగు జోన్లుగా విభజించారని, రూ. 100 కోట్లతో వ్యూయింగ్ గ్యాలరీ, ఎంట్రీ ప్లాజా, మ్యూజికల్ ఫౌంటెన్ అభివృద్ది చేయాలని, రామగుంబం, హైదరాబాద్ బైపాస్ రోడ్డు నుండి బండ్ వరకూ ఫార్మేషన్ రోడ్డు, ల్యాండ్ స్కేపింగ్, ఇల్యూమినేషన్, పాత్ వేలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రూ. 4 కోట్లు వెచ్చించి రూ. 4 కోట్లతో రోడ్డు కోసం మట్టిని నింపాలని ప్రతిపాదించగా ఈ పనులను 2023 జూన్ నుండి నిలిచిపోయాయని, ఎల్ఎండీ నుండి 3.15 కి.మీ. చైనేజ్ లో 1.15 ఎకరాలలో బండ్ పై 800 సామర్థ్యంతో మ్యూజికల్ ఫౌంటెన్ వ్యూ గ్యాలరీ నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. అయితే ఈ పనులకు నీటి పారుదల శాఖ నుండి అనుమతులు రాకపోవడంతో అర్థాంతరంగా నిలిపివేయాల్సి వచ్చిందని ఇరిగేషన్ అధికారులు ఎన్జీటీ చెన్నై బెంచ్ కు ఇచ్చిన నివేదికలో వివరించారు. రూ. 60 కోట్లతో మ్యూజికల్ ఫౌంటెన్ నిర్మాణానికి సంబంధించిన పనులు చేపట్టగా పని ప్రారంభించామని, అయితే ప్రభుత్వ సంస్థలు సక్రమంగా డిజైన్లు, డ్రాయింగులు చెక్ చేయకపోవడంతో 2023 జూన్ నుండి పనులను నిలిపివేయాల్సి వచ్చిందని వివరించిన TSTDC అధికారులు నీటి పారుదల శాఖ నుండి అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నించామని వివరించారు. కానీ ఈ ప్రాజెక్టుకు ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ అవసరమా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. TSTDC అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులను కూడా ప్రతివాదిగా చేర్చాలని సుమోటోగా నిర్ణయించినట్టు ఎన్జీటీ బెంచ్ వెల్లడించింది. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్టు పేర్కొంది. మరో వైపున ఈ ఏడాది మే 17న కేంద్ర పర్యవారణ, అటవీ విభాగానికి చెందిన అధికారులు మానేరు రివర్ ఫ్రంట్ అంశం గురించి తనిఖీలు నిర్వహించినప్పటికీ నివేదికను బెంచ్ ముందు ఉంచలేదని, మానేరు రివర్ ఫ్రంట్ కు ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ అవసరమా లేదా..? EIA నోటిపికేషన్ 2006లో ఏ కేటగిరిలో వస్తుందో అన్న విషయంపై MOEF&&CC విభాగం తన నివేదికలో తెలియజేయాల్సి ఉందని ఎన్జీటీ బెంచ్ పేర్కొంది. TSTDC అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అయితే మానేరు రివర్ ఫ్రంట్ పనులు జరగడం లేదని పేర్కొన్నందున NGT ఆదేశాలు ఇచ్చే వరకు కూడా పనులను యథావిధిగానే ఉంచాలని, ఎలాంటి పనులు చేపట్టకూడదని బెంచ్ స్పష్టం చేసింది. తిరిగి ఈ కేసును విచారించేందుకు ఈ ఏడాది డిసెంబర్ 2కు వాయిదా వేసింది.

You cannot copy content of this page