అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..?
మరో పిటిషన్ ను స్వీకరించిన ఎన్జీటీ
28న హియరింగ్
దిశ దశ, పెద్దపల్లి:
చిలికి చిలికి గాలి వానలా ఆఇష్యూ తయారవుతోందా..? అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..? మానేరు ఇసుక తవ్వకాల వెనక అసలేం జరుగుతోంది. తాజాగా మరో పిటిషన్ ను కూడా ఎన్జీటీ స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది.
మరో కేసు బుక్…
ఇప్పటి వరకు పెద్దపల్లి జిల్లా మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు వేసిన పిటిషన్ పై మాత్రమే చెన్నైలోని సౌత్ జోన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ బెంచ్ వద్ద విచారణ నడుస్తోంది. స్థానిక బీజేపీ నాయకుడు, ఎన్ ఆర్ ఐ గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధి కర్ణాకర్ రెడ్డిలు వేసిన ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. ఎన్నిరాన్ మెంట్ క్లియరెన్స్ (ఈసీ) అంశం విషయంలో అధికారులు పెండింగ్ లో ఉంచడంతో వాయిదాలు పడుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ విభాగం అధికారులు ఇందుకు సంబందించిన రికార్డ్స్ బెంచ్ ముందు ఉంచకపోవడంతో వాయిదా పడుతూ వస్తోందని సమాచారం. తాజాగా ఈ నెల 15న జరిగిన విచారణను వాయిదా వేయాలని రెస్పాండెట్స్ కోరడంతో ఈ నెల 28కి హియరింగ్ డేట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త ట్విస్ట్…
అయితే మానేరు నదిలో ఇసుక విషయంలో తాజాగా మరో పిటిషన్ ను ఎన్జీటీ స్వీకరించినట్టు తాజాగా వెల్లడి అయింది. ఇప్పటి వరకు ఎంపీసీ ప్రతినిధులు వేసిన ఓఏ నెంబర్ 123/2020(SZ) నడుస్తుండగా తాజాగా ఎన్జీటీ ఇచ్చిన ఆర్డర్స్ లో కొత్తగా మరో పిటిషన్ ను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు అర్థం అవుతోంది. ఓఎ నెంబర్ 146/2022(SZ) పిటిషన్ ను కూడా ఈ నెల 28కే వాయిదా వేసినట్టు అందులో పేర్కొన్నారు. రెండు పిటిషన్లు కూడా ఒకే స్వారుప్యత కలిగినవి కావడంతోనే రెండింటిని కలిపి విచారించాలని ఎన్జీటీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే 146/2022(SZ) పిటిషన్ నాగినేని జగదీశ్వర్ రావు ఎన్జీటీలో దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ రెండో పిటిషన్ ద్వారా అప్లికెంట్స్ ఏఏ ఆధారాలు సమర్పించారోనన్న విషయంపై క్లారిటీ రావల్సి ఉంది. దీంతో అధికార యంత్రాంగం మళ్లీ సమస్యల్లో ఇరుక్కున్నట్టుగా అర్థమవుతోంది. రెండు కేసులకు సంబందించిన అంశాలు ప్రధానంగా పర్యావరణ సంబందించిన విషయాలే అయితే మాత్రం త్వరలోనే ఎన్జీటీ జడ్జిమెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే టీఎస్ఎండీసీ ఈసీ తీసుకోలేదని చెప్పడం, కేంద్ర పర్యావరణ చట్టాలు మాత్రం ఈసీ కంపల్సరీ అని చెప్తుండడంతో ఎన్జీటీ సౌత్ జోన్ బెంచ్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందోనన్నదే కీలకంగా మారింది.