తెలంగాణ బిడ్డలతో మన్మోహన్ సింగ్ అనుబంధం…
దిశ దశ, వరంగల్:
డాక్టర్ కావాలనుకుని ఆర్థికవేత్తగా ఎదిగి… దేశ ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ కు తెలంగాణకు వైవిద్యమైన అనుబంధం ఉంది. దేశంలో ఎంతోమంది ఆర్థిక వేత్తలు ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ తీరు డిఫరెంట్ స్టైల్ లో దేశానికి సేవలందించి చరిత్ర సృష్టించారు. రిజర్వూ బ్యాంకు గవర్నర్లుగా పని చేసిన వారు రాష్ట్రాలకు గవర్నర్లుగా సేవలందించిన చరిత్ర ఉంది కానీ ఏకంగా దేశ ప్రధానిగా ఎదిగిన చరిత మాత్రం మన్మోహన్ సింగ్ సొంతమనే చెప్పాలి. అయితే ఆయనతో తెలంగాణ ప్రాంతానికి ఉన్న అనుబంధం అత్యంత బలమైనదని చెప్పక తప్పదు.
ఆర్థికవేత్తలుగా…
తెలంగాణ స్వరాష్ట్రం కావాలని కలలు కన్న ప్రొఫెసర్ జయశంకర్ కు, ఆర్థికశాస్త్రంలో నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ కు మధ్య సన్నిహిత సంబధాలు ఉండాయి. ఇద్దరు కూడా ఎకనామిక్స్ లో నిపుణులు కావడంతో సాన్నిహిత్యం ఏర్పడింది. హైదరాబాద్ లోని సెంట్రల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ (సీఫెఎల్) రిజిస్ట్రారర్ గా ప్రొఫెసర్ జయశంకర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు యూజీసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ లు సమావేశాల్లో కలుసుకునే వారు. ఈ సాన్నిహిత్యం ఏ స్థాయికి చేరిందంటే జాతీయ స్థాయి కమిటీల్లో మెంబర్ గా జయశంకర్ ను నియమించడమే కాకుండా ఒక్క ఫోన్ కాల్ తో కాకతీయ యూనివర్శిటీ స్నాతకోత్సవానికి దేశ ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న మన్మోహన్ సింగ్ హాజరయ్యేంతగా. కేంద్ర మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ కు కాకతీయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అయిన జయశంకర్ ఫోన్ చేసి KU స్నాతకోత్సవానికి మిమ్నల్ని ఆహ్వానించేందుకు ఢిల్లీ వస్తానని అంటే వద్దు వద్దు… తానే వస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం 1992లో జరిగిన స్నాతకోత్సవానికి హాజరయ్యారు. అంతకు ముందు రిజర్వూ బ్యాకు గవర్నర్ గా ఉన్నప్పుడు రిసెర్చ్ చేసే స్టూడెంట్స్ కోసం నిధులు ఇవ్వాలని జయశంకర్ చేసిన ప్రతిపాదన మేరకు మన్మోహన్ సింగ్ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. దాదాపు 30 ఏళ్ల అనుబంధం ఉన్న వీరిద్దరు చాలా సందర్బాల్లో కూడా కలుసుకుని చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్బంలో కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలుసుకున్నప్పుడు ఇద్దరి మధ్య అప్యాయతతో కూడిన పలకరింపులు ఉండేవి.
పివి కారణంగా…
భారత ఆర్థిక పితామహుడు పివి నరసింహరావు 1991లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రాజకీయాలతో సంబంధం లేని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను తన క్యాబినెట్ లోకి తీసుకుని ఆర్థిక మంత్రిని చేశారు. అయితే అంతకు ముందు ఓ సందర్బంలో పివి నరసింహరావును మన్మోహన్ సింగ్ కలిసినప్పుడు ఆర్థిక విధానాలపై చర్చించారు. భారత ఆర్థిక రంగంపై మన్మోహన్ సింగ్ కు ఉన్న విజన్ ను గుర్తించిన పివి నరసింహరావు ప్రధానమంత్రి పీఠం ఎక్కాల్సిన ఆవశ్యకత ఎదురైనప్పుడు… మన్మోహన్ సింగ్ సేవలు దేశానికి అవసరమని గుర్తించారు. ఆయనలోని మేథో సంపత్తి దేశ ఆర్థిక స్థితి గతులను మార్చుతుందని భావించిన పివి… మన్మోహన్ సింగ్ కు కీలక బాధ్యతలు అప్పగించి చరిత్ర సృష్టించారు. యూజీసీ ఛైర్మన్ గా ఉన్న మన్మోహన్ సింగ్ ను క్యాబినెట్ లోకి తీసుకుంటున్నామని ఫోన్ చేసి చెప్పే వరకు కూడా ఊహించలేకపోయారు. సాధారణంగా రాజకీయాల్లో తన అనచరులకో, వారసులకో ప్రాధాన్యత ఇచ్చేందుకే మొగ్గు చూపుతుంటారు నాయకులు. ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచించిన పివి పాలిటిక్స్ తో ఏ మాత్రం సంబంధం లేని మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిని చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. స్వార్థ రాజకీయాలతో తన కుటుంబం పెత్తనం ఉండాలన్న ఆకాంక్ష కన్నా దేశ భవిష్యత్తు ముఖ్యమని భావించిన పివి, మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రి చేశారన్నది వాస్తవం. పివి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దివాళా వైపు పయనిస్తున్న భారత్ సువర్ణ భారత్ ఎదగడానికి కారణమైంది. అంతేకాకుండా రెండు సార్లు ప్రదానిగా సేవలందించే అవకాశం ఆయనకు దక్కడం కూడా పివి నిర్ణయం వల్లే.
మన్మోహన్ సింగ్ తో ఉన్న సాన్నిహిత్యంతో ప్రొఫెసర్ జయశంకర్ ప్రొఫెషనల్ రిలేషన్స్ కొనసాగించడమే కాకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తనవంతుగా సలహాలు సూచనలు అందించగా, ఆయన ఆర్థిక సంస్కరణల విధానం భారత దేశానికి ఎంతో అవసరమని గుర్తించారు పివి నరసింహరావు. ఆయన జీవితంలో అత్యంత కీలక భూమిక పోషించిన వారిలో ఇద్దరు కూడా తెలంగాణ బిడ్డలే కావడం విశేషం.