దిశ దశ, మంథని:
మంథని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వం కోసం రెండు దరఖాస్తులు చేసుకోవడం సంచలనంగా మారింది. నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న నేతతో పాటు మరో దరఖాస్తు చేసుకోవడంతో పార్టీలో మరో కొత్తపేరు తెరపైకి వచ్చింది. అయితే తనకు కూడా అవకాశం ఇవ్వాలని దరకాస్తు చేసుకున్న నాయకుడు కూడా ఇంఛార్జి కుటుంబానికి సన్నిహితుడు కావడం సంచలనంగా మారింది.
తండ్రికి హితుడిగా… తనయుడితో పోటీగా
జనశక్తి ఆర్గనైజేషన్ లో పనిచేసి టీడీపీలో క్రీయాశీలకంగా పనిచేసిన బండం వసంతరెడ్డి కూడా తనకు టికెట్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన బండం వసంతరెడ్డి బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డికి అత్యంత సన్నిహితునిగా ఉన్న వసంత్ రెడ్డి ఆయన తనయుడు సునీల్ రెడ్డిని కాదని తనకు టికెట్ ఇవ్వాలంటూ అభ్యర్థించడం హాట్ టాపిక్ గా మారింది. మంథని నియోజవకర్గ రాజకీయాల్లో వసంత్ రెడ్డి ముఖ్య నేతలతో టచ్ లో ఉండడమే కాకుండా నియోజకవర్గంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పరిచయాలు కూడా ఉన్నాయని తనకు అవకాశం ఇస్తే గెలుస్తానంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి వివరించినట్టుగా తెలుస్తోంది. అయితే రాంరెడ్డితో పాటు బీజేపీలో చేరిన వసంత్ రెడ్డి ఇంతకాలం సైలెంట్ గా ఉండి ఇప్పుడు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం వెనక కారణాలు ఏంటీ అన్న చర్చ సాగుతోంది. మంథని నుండి పోటీ ఉండదని సునీల్ రెడ్డి అభ్యర్థిత్వం ఖాయమని ప్రచారం జరిగిన నేపథ్యంలో వసంత్ రెడ్డి అప్లికేషన్ పెట్టడం గమనార్హం. అధిష్టానం మొగ్గు ఎవరి వైపు ఉంటుందోనన్న విషయం అలా ఉంచితే అసలు పోటీనే ఉండదన్న చోట రెండో దరఖాస్తు రావడమే హాట్ టాపిక్ గా మారింది.