దిశ దశ, మేడిగడ్డ:
పెద్ద కాళే్శ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును మరుగున పడేశారని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మూడు బ్యారేజీలు మంథని నియోజకవర్గంలోనే నిర్మించినా ఇక్కడి రైతాంగానికి మాత్రం ఎలాంటి లాభం లేకుండా పోయిందన్నారు. ఇక్కడి నుండి నీటిని ఎగువకు తీసుకెళ్లారు కానీ ఈ ప్రాంతానికి చెందిన ఒక్క ఎకరాకు కూడా నీటిని అందించలేదన్నారు. అయితే 2008లో చేపట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఐదు మండలాలకు సాగు నీరందేది కానీ దాని గురించి పట్టించుకోకపోవడంతో స్థానిక రైతాంగం ఇబ్బందులు పడుతోందన్నారు. అంతేకాకుండా కాళేశ్వరం బ్యారేజీల బ్యాక్ వాటర్ తో ఎగువ ప్రాంతాలు. గేట్లు వదిలినప్పుడు దిగువ ప్రాంతాలకు చెందిన భూములు మంపునకు గురవుతున్నాయని బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. పంటపొలాల్లోకి బ్యాక్ వాటర్ రాకుండా ఉండేందుకు కరకట్ట నిర్మాణంతో పాటు ముంపునకు గురైన భూములకు పరిహారం చెల్లించాలని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన మంథని నియోజకవర్గంలోని బలహీన వర్గాలు, నిరుపేదలను ఆదుకునేందుకు చొరవ చూపాలని దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.