మంథని బీఆర్ఎస్ లో తెరపైకి మరో నేత…?

పావులు కదుపుతున్న అస్మదీయులు

అధినేత ఫ్యామిలితో చర్చలు

దిశ దశ, పెద్దపల్లి:

మంథని బీఆర్ఎస్ పార్టీలో ఆశావాహుల జాబితాలో మరో పేరు తెరపైకి వస్తోంది. ఆయన అస్మదీయులు ఈ మేరకు అధినేత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇంతకాలం స్తబ్దంగా ఉన్న ఆ నాయకుడి పేరును ఉన్నట్టుండి అధిష్టానం ముందుకు తీసుకెళ్లడంతో అధికార పార్టీలో సరికొత్త చర్చ మొదలు అవుతోంది. మంథని పార్టీ ఇంఛార్జిగా ఉన్న పుట్ట మధు విషయంలో అధిష్టానం దోబూచులాడుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలం ఆయన్ను అక్కున చేర్చుకోవడం, కొంత కాలం దూరం పెడుతుండడంతో అవకాశం ఇస్తే నేను సైతం అంటున్న నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా ముత్తారం మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్ మోహన్ రావు పేరును కూడా పరిశీలించాలన్న ప్రతిపాదన మొదలైంది. ఇటీవల మంత్రి కేటీఆర్ వద్ద కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలని కూడా అభ్యర్థించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. టీడీపీ నుండి నియోజకవర్గం అంతా పరిచయాలు ఉన్న జగన్ మోహన్ రావుకు అవకాశం ఇస్తే ఆయన వ్యక్తిగత ఇమేజ్ తోడ్పాటును ఇస్తుందని కూడా ఆయన సన్నిహితులు అంటున్నారు. నియోజకవర్గానికి చెందిన కొంతమంది ఉద్యమకారులు కూడా నాగినేనికి ప్రాధాన్యత ఇస్తే బాగానే ఉంటుందన్న వాదనలు తీసుకొస్తున్నారు. నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరం లేదని అధిష్టానం భావించి తిరిగి పుట్ట మధుకే ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో తాజాగా నాగినేని పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. అధినేత కేసీఆర్ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో పాటు మంత్రి దయాకర్ రావుతో కూడా బంధుత్వం ఉన్నందున ఆయన పేరును పరిశీలించాలన్న ప్రతిపాదనలు అధినాయకత్వం ముందుకు తీసుకెళ్లినట్టు సమాచారం. టీడీపీ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముత్తారం ఎంపీపీ, జడ్పీటీసీగా కూడా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల వారితో సంబంధాలు ఉన్నాయని ఆయనకు అవకాశం ఇస్తే సానుకూల ఫలితాలు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన సన్నిహితులు. టీడీపీలో ఉన్నప్పుడు ఒకట్రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయినా చివరి క్షణంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడం వల్ల తనకు అవకాశం రాకుండా పోయిందని, లేనట్టయితే తనకున్న వ్యక్తిగత సంబంధాలతో గెలిచి తీరేవాడినన్న అభిప్రాయాన్ని నాగినేని కూడా పార్టీ ముఖ్య నేత ఒకరి వద్ద వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అధిష్టానం కూడా నాగినేని జగన్ మోహన్ రావు గురించి ఆరా తీయనున్నట్టుగా సమాచారం.

You cannot copy content of this page