ఈ ఘటనలో గాయపడ్డ వారెందరో…?

దిశ దశ, కరీంనగర్:

ఆదివారం కరీంనగర్ సమీపంలోని చెర్లబుత్కూరులో వేదిక కుప్పకూలిన ఘటనలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మరికొంతమందికి కూడా గాయాలయినట్టుగా తెలుస్తోంది. చిరుతల రామాయణ ముగింపు ఉత్సవాల్లో భాగంగా గ్రామంలోని మహిళలు ఓడిబియ్యం పోసే కార్యక్రమం నడుస్తున్న క్రమంలో అక్కడకు చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్ వేదిక ఎక్కారు. ఆయనతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పెద్ద ఎత్తున వేదికపైకి చేరడంతో వేదిక ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. అప్పటి వరకూ ఆధ్యాత్మిక భావంతో నిండిపోయిన ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా హాహాకారలతో నిండిపోయినట్టుగా ప్రత్యక్ష్య సాక్షులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనలో మొదట ఒక్క మంత్రి గంగుల కమలాకర్ మాత్రమే గాయాల పాలయ్యారని లీకయినప్పటికీ మరికొంతమందికి కూడా దెబ్బలు తగిలినట్టు తెలుస్తోంది. మంత్రితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ సర్దార్ రవిందర్ సింగ్, కరీంనగర్ జడ్పీటీసీ సభ్యురాలు పురుమళ్ల లలిత, చెర్లబుత్కూరు ఎంపీటీసీ సభ్యుడు తిరుపతితో పాటు పలువురికి గాయాలయ్యాయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డట్టుగా స్పష్టం అవుతోంది. చెర్లబుత్కూరు వేదిక కుప్పకూలిన ఘటనకు సంబంధించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ వైరల్ కావడం లేదు.

తీవ్రంగానే గంగుల కాలి గాయం…

ఈ ఘటనలో గాయపడ్డ మంత్రి గంగుల కమలాకర్ కాలికి ఫ్యాక్చర్ అయినట్టుగా తెలుస్తోంది. ఆదివారం రాత్రి వరకూ వాపు వచ్చిందని క్రేప్ బ్యాండేజ్ తో సరిపుచ్చినప్పటికీ సోమవారం మాత్రం మంత్రి కాలుకు అర్టికాస్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వేయడం గమనార్హం. పీఓపీ వేశారంటే ఫ్యాక్చర్ అయి ఉంటుందని మంత్రి 45 రోజుల పాటు బెడ్ రెస్ట్ లోనే ఉండాల్సి ఉంటుందని సమాచారం. అయితే అర్టికాస్ట్ పీఓపీ వేయడం వల్ల కాలు కింద పెట్టి నడిచే అవకాశం ఉంటుందని, దీనివల్ల గాయానికి ఇబ్బంది కాకపోవడంతో పాటు తన పని తాను చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలుస్తోంది. సోమవారం మంత్రి గంగులను మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లు పరమార్శించగా, కరీంనగర్ సీపీ సుబ్బరాయుడు కూడా ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కుప్పకూలిన తర్వాల చిరుతల రామాయణ వేదిక

You cannot copy content of this page