అట్టుడికిపోతున్న సరిహద్దులు
దిశ దశ, దండకారణ్యం:
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో యుద్ద వాతావరణం నెలకొంది. ప్రభావిత ప్రాంతాలైన చత్తీస్ గడ్, తెలంగాణా రాష్ట్రాల్లోల ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో హై అలెర్ట్ గా వ్యవహరిస్తున్నాయి బలగాలు. మావోయిస్టుల కట్టడి కోసం సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబిండ్ చర్యలు జరుగుతున్నా దండకారణ్య అటవీ ప్రాంతంలో మాత్రం మావోయిస్టులు చర్యలకు పాల్పుడుతున్నారు. తెలంగాణ సరిహద్దు జిల్లాల పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తత చర్యలపై అప్ డేట్ అవుతున్న నేపథ్యంలో నక్సల్స్ కదిలకలపై కట్టడి కొనసాగుతోంది.
చత్తీస్ గడ్ లో…
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొన్న తరువాత దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులపై అక్కడి బలగాలు ఉక్కుపాదం మోపేందుకు రంగంలోకి దిగాయి. కీకారణ్యాలు, గుట్లలు విస్తరించిన చత్తీస్ గడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు వ్యూహాత్మకంగా బలగాలకు చిక్కకుండా బీజేపీ నేతలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు బీజేపీ నేతలను నక్సల్స్ కాల్చి చంపారు. ఎన్నికలకు ముందు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా మావోయిస్టులు ఆరోపణల పర్వం చేశారు. అయితే ఎన్నికలు సమీపించిన తరువాత కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్న మావోయిస్టులు బీజేపీ నేతలపై టార్గెట్ చేసి వారిని హతమారుస్తున్నారు. దీంతో సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టుల చర్యలతో అట్టుడికిపోతున్న పరిస్థితి తయారైంది. పోలింగ్ జరిగే నాటికి ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కూడా లేకపోవన్న ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా మావోయిస్టుల ప్రభావితం ఉన్న ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్న ప్రభుత్వం ఆయా చోట్ల మరిన్ని ఎక్కువ రక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణలో…
దండకారణ్య అటవీ ప్రాంతాన్ని ఆనకుని ఉన్న తెలంగాణాలోని ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో పోలీసు బలగాలు హై అలెర్ట్ గా వ్యవహరిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం మావోయిస్టులు రాష్ట్రంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం అందుకున్న సరిహద్దు ప్రాంత పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. కొరియర్లతో పాటు సాను భూతిపరులను అరెస్ట్ చేయడంతో పాటు మాజీ నక్సల్స్ కు స్పెషల్ కౌన్సిలింగ్ లు ఇచ్చారు. అంతేకాకుండా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు కూంబింగ్ ఆపరేషన్లలు, గ్రామాల్లో కార్డన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల చర్యలకు కట్టడి అయ్యాయని పోలీసులు అంచనా వేశారు. అయినప్పటికీ మావోయిస్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవల్సిందేనని భావించిన పోలీసు అధికారులు స్పెషల్ ఆపరేషన్లను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ గ్రే హౌండ్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ కూడా సరిహద్దు ప్రాంతాల్లోని పోలీసు అధికారులతో జిల్లాలు, కమిషనరేట్ల వారిగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని దిశా నిర్దేశం చేశారు. అయితే చత్తీస్ గడ్ లో ఎన్నికలు జరుతున్న నేపథ్యంలో మావోయిస్టులు దండకారణ్య ప్రాంతంలో కలుపుకున్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో షెల్టర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మారు వేషంలో మావోయిస్టులు ఇంద్రావతి పరివాహక ప్రాంతం నుండి ప్రాణహిత పరివాహక ప్రాంతంలోకి చేురుకునే అవకాశాలు ఉన్నాయని గుర్తించిన తెలంగాణ పోలీసు అధికారులు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని ఫెర్రీ ఏరియాల్లో కూడా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.