మావోయిస్టుల డంపుల్లో రూ. 2 వేల నోట్లు..!

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టుల డంపులో రూ. 2 వేల నోట్లు లభ్యం కావడం సంచలనంగా మారింది. దేశంలో పెద్ద నోట్ల రద్దు తరువాత చాలా వరకు నోట్ల మార్పిడీ జరిగింది. కానీ కొన్ని కరెన్సీ నోట్లు బ్యాంకుల్లోకి చేరలేదు. ఇవి ఏమయ్యాయన్న చర్చ కూడా సాగింది. అయితే తాజాగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన డంపును బలగాలు గుర్తించాయి. ఈ డంపులో రద్దయిన 2 వేల నోట్లు ఉండడం గమనార్హం. ఒడిషాలోని ధామ్‌తరి-గరియాబంద్-నువాపరా డివిజన్‌లో గరియాబంద్-ధంతరి పోలీసులు, CRPF జవాన్లు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ మేరకు రాయ్ పూర్ నుండి పోలీసు అధికారులు విడుదల చేసిన ప్రకటనలో డంపులో లభ్యమైన వివరాలను వెల్లడించారు. ఈ నెల 10న బయలు దేరిన బలగాలు రెండు రోజుల పాటు అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించగా, 12వ తేదిన ధామ్‌తరి- సరిహద్దులోని ఛోటే గోబ్రా మరియు పెండ్రా అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ దాచి ఉంచిన డంపును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 2 వేల నోట్ల బెండిల్స్ 6, స్టీలు బాక్సుల్లో అమర్చిన రూ. 500 నోట్ల బెండిల్స్ 52 మొత్తం రూ. 38 లక్షలు లభ్యం అయ్యాయి. 23 బీజీఎల్ రౌండ్లు, రెండు ముక్కల టిఫిన్ ఐఈడీలు, మందపాతర తయారీ కోసం ఉపయోగించే 13 డిటోనేటర్లు, 1 బండిల్ ఫ్యూజ్ వైర్, 2 కిలోల గన్ ఫౌడర్, యూరియా, 2 ఫ్లాష్ లైట్లు, 3 మల్టీ మీటర్ ముక్కలు, సెన్సర్ రిమోట్లు, ఎలక్ట్రికల్ వైర్, నక్సల్స్ యూనిఫాంతో పాటు ఇతరాత్రా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. ఈ డంపును స్వాధీనం చేసుకున్న పోలీసులు మెయిన్‌పూర్ పోలీస్ స్టేషన్ లో వీపీసీ చట్టంలోని సెక్షన్ 308 బీఎన్ఎస్, సెక్షన్ 17, 20, 21, 40లలో కేసు నమోదు చేశారు. మోద్కా పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 109, 191 (2), 191 (3), 190 బీఎన్ఎస్ యాక్టు, 25, 27 ఆయుధ చట్టం 4, 5 వీపీసీ, 10 వీపీసీ 13 (ఏ), 16 (ఏ) సెక్షణ్ 38(2), 39 (2)లలో మరో కేసు నమోదు చేశారు.

You cannot copy content of this page