మడావి హిడ్మా… ఈ పేరు చెప్పగానే కొన్ని రాష్ట్రాల బలగాలు అలెర్ట్ అవుతాయి. మావోయిస్టు పార్టీ ప్రభావిత రాష్ట్రాల పోలీసులు అతని గురించి చర్చించుకోని రోజు ఉండదేమో. అంత కరుడుగట్టిన మావోయిస్టు అగ్ర నాయకుడు ఈయన. దండకారణ్య అటవీ ప్రాంత అడవులపై సంపూర్ణ అవగాహన పెంచుకున్న హిడ్మా మోస్ట్ వాటెండ్ లిస్ట్ లో ఉన్న అగ్రనాయకుల్లో ప్రథముడు కూడా. అనతి కాలంలోనే మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగి పార్టీ మిటరీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సుక్మా జిల్లా జీనాగుడా సమీపంలోని ఓ గూడెంకు చెందిన వాడు. కేవలం ఏడో తరగతి వరుక మాత్రమే చదువుకున్న హిడ్మా అప్పటి పీపుల్స్ వార్ గ్రూపు నక్సల్స్ పిలుపును అందుకుని అడవి బాట పట్టాడు. 1996లో పీపుల్స్ వార్ అనుభంధ సంఘం అయిన బాలల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన మడావి హిడ్మా పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించాడు. రెండున్నర దశాబ్దాల కాలంలో ఏరియా కమిటీ కార్యదర్శి నుండి ఏకంగా సెంట్రల్ కమిటీ సభ్యునిగా ఎదిగారు. పీపుల్స్ వార్ దండకారణ్య అటవీ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేసి, క్రాంతీకారీ జనతన్ సర్కార్ ఆవిర్భవించిన తరువాత మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ (ఎంసీసీ)లో విలీనం అయింది. అభుజామడ్ కీకారణ్యంలో బలగాలను మట్టుబెట్టడంలో అందే వెసిన మావోయిస్టుల్లో ముందు వరసలో నిలిచేది మాత్ర మడావి హిడ్మానే. చత్తీస్ గడ్ అటవీ ప్రాంతంలో ఆయన చేపట్టిన ఆపరేషన్లతో బలగాలపై పైచేయిగా నిలవడంలో వేసిన స్కెచ్ అంతా కూడా హిడ్మాదేనని చెప్పాలి. నక్సల్స్ మందుపాతరలను తట్టుకునేందుకు తయారు చేసుకున్న మైన్ ప్రూఫ్ వెహికిల్ ను మందుగుండు పెట్టి పేల్చి అందులో ప్రయాణిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలను మట్టుబెట్టడం నుండి 2022లో జీనాగూడ అటవీ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడి బలగాలను హతం చేయడంలోనూ హిడ్మా వేసిన స్కెచ్ లే. లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు హిడ్మా అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారని ఈ విషయంలో ఆయనకు ఆయనే సాటి అని మావోయిస్టు పార్టీలో పేరుంది.
చిన్న వయసులోనే…
విప్లవ పోరుబాటలో నాలుగు పదుల వయసులోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా పదవి అందుకున్న చరిత్ర కూడా హిడ్మాదే. కేంద్ర కమిటీలో ఇప్పుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిలో చాలా మంది కూడా 50 నుండి 60 ఏళ్ల వయసుకు చేరిన తరువాతే ఎదిగారు. కానీ హిడ్మా మాత్రం యంగ్ ఏజ్ లో కీ పోస్ట్ అందుకున్నాడు. అభూజామడ్ గుట్టలతో పాటు అక్కడి కీకారణ్యాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసిల గూడాలన్నింటిపై సంపూర్ణ అవగాహన ఉన్న వాడు హిడ్మా. ఇప్పటి వరకు ఆయన వేసిన ప్రతి ప్లాన్ లో కూడా ఫెయిల్ కాకపోవడానికి కారణం ఆయనకు ఇక్కడి అడవులపై ఉన్న పట్టే ప్రధాన కారణమన్నది వాస్తవం. అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించే బలగాలపై దాడులు నిర్వహించే తీరుకు సంబందించిన వీడియో రికార్డింగ్ ప్రక్రియ కూడా ఈయన సూచన మేరకు జరిగిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతుంటాయి.
ఆరు సార్లు మిస్…
చత్తీస్ గడ్, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలకు సంబందించిన పోలీసు బలగాలు తమ ప్రధాన లక్ష్యం మడావి హిడ్మానే అన్న రీతిలో వ్యవహరిస్తుంటాయి. మావోయిస్టు పార్టీకి ‘కీ’ లీడర్ అయిన హిడ్మాను మట్టుబెడితే మావోయిస్టు పార్టీ కుడి చేయి విరిగినంత పనవతుందని నిఘా వర్గాలు కూడా అంచాన వేశాయి. కానీ ఆయన్ని పట్టుకోవడం మాత్రం ఇప్పటికీ ఏ రాష్ట్ర బలగానికి సాధ్యం కాలేదు. ఒక్కసారి అరెస్ట్ అయి బయటకు వచ్చిన హిడ్మా దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు సార్లు హిడ్మా బలగాల దాడుల నుండి తప్పించుకున్నాడని తాజా ఘటనతో ఈ సంఖ్య ఏడుకు చేరిందని తెలుస్తోంది. చిక్కినట్టే చిక్కి తప్పించుకోవడంలో కూడా హిడ్మా నేర్పరితనం అంతా ఇంతా కాదు. అక్కడి అడవులపై పట్టు ఉండడం వల్లే ఆయన పోలీసుల ఎత్తులను చిత్తు చేస్తున్నాడని స్పష్టం అవుతోంది.
అక్కడ సాధ్యమేనా…?
దండకారణ్య అటవీ ప్రాంతంలో మడావి హిడ్మాను మట్టుబెట్టడం మాత్రం బలగాలను సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడిగా, మిలటరీ ప్లాటూన్ ఇంఛార్జిగా కూడా ఉన్న హిడ్మా మూడంచెల భద్రత నడుమ పార్టీ కాలాపాలు కొనసాగిస్తున్నారు. ఆయనను హతం చేయాలంటే మూడంచెల భద్రతా వ్యవస్థను ఛేదించాల్సిన అవసరం ఉంటుంది. ఒక వేళ హిడ్మా డెన్ ను గుర్తించి అటుగా వెల్లేందుకు బలగాలు సాహసించినా అక్కడి భారీ వృక్షాలపై కూడా సెంట్రీ డ్యూటీ చేస్తుంటారు మావోయిస్టులు. కూంబింగ్ కు వెల్లిన పోలీసు బలగాలను కిలోమీటర్ల దూరం నుండే గుర్తించే అవకాశం ఉంటుంది. కూంబింగ్ బలగాలను అంతమోందించేందుకు మందుపాతరలు లేదా క్లైమోర్ మైన్స్ తో దాడులు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఏరియల్ దాడులు చేయాలన్నా పరుచుకున్న్టట్టుగా ఉండే అడవుల్లో అసాధ్యమనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హెలిక్యాప్టర్ ద్వారా వెల్లినప్పుడు విస్తరించిన భారీ వృక్షాల కింద ఏర్పాటు చేసుకునే షెల్టర్ జోన్ లను గుర్తించడం అసాధ్యమన్న అభిప్రాయాలే వ్యక్తం అవతున్నాయి. పలు రాష్ట్రాల ప్రభుత్వలకు మోస్ట్ వాంటెడ్ అయిన హిడ్మా డెన్ ను అంత ఈజీగా గుర్తించే ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా లేవు.
ఎదురు కాల్పులు జరిగాయి: సీఆర్పీఎఫ్
అయితే బీజాపూర్, సుక్మా, తెలంగాణ సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు హెలి క్యాప్టర్ ద్వారా ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ కు వెల్లాయి. ఈ క్రమంలో చాపర్ నుండి కోబ్రా బలగాలు దిగుతున్న క్రమంలో మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టులు అక్కడి నుండి తప్పించుకోగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని సీఆర్పీఎఫ్ చత్తీస్ గడ్ సెక్టార్ ఐజీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.